'వకీల్ సాబ్'పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్! రీజన్ ఏంటంటే...
on May 3, 2021
పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషించిన 'వకీల్ సాబ్' ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలై దాదాపు భారీ వసూళ్లను సాధించింది. అన్ని వైపుల నుంచీ ప్రశంసలు దక్కించుకుంది. టైటిల్ రోల్‌లో పవన్ కల్యాణ్ నటనను అందరూ మెచ్చుకున్నారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్'కు ఇది రీమేక్. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలు పోషించగా, శ్రుతి హాసన్ ఓ స్పెషల్ రోల్ చేసింది. అయితే ఈ సినిమాపై లేటెస్ట్‌గా పోలీస్ స్టేషన్‌లో ఓ కంప్లయింట్ దాఖలైంది.
'వకీల్ సాబ్' సినిమా తన ప్రైవసీకి భంగం కలిగించిందని ఆరోపిస్తూ సుధాకర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆ సినిమా నిర్మాతలపై ఫిర్యాదు చేశాడు. తనను ఏమాత్రం సంప్రదించకుండా ఆ సినిమాలో తన ఫోన్ నంబర్‌ను ప్రదర్శించారనేది అతని అభియోగం. దీని వల్ల తనకు అనేకమంది నుంచి కాల్స్ వస్తున్నాయనీ, కొంతమంది తనను వేధిస్తున్నారనీ తన ఫిర్యాదులో అతను పేర్కొన్నాడు. తెలియని వ్యక్తులు పదే పదే ఫోన్లు చేస్తూ ఉండటం వల్ల తను చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని అతను తెలిపాడు. దీనిపై ఇప్పటికే తన లాయర్ ద్వారా నిర్మాతలకు నోటీసు పంపాననీ, కానీ వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదనీ కూడా అతను తెలిపాడు.
థియేటర్లలో విడుదలైన మూడు వారాల తర్వాత 'వకీల్ సాబ్' ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 30న విడుదలై, మంచి ఆదరణ పొందుతోంది.
Also Read