అపురూప చిత్రం 'మల్లీశ్వరి' కథ ఎలా పుట్టిందో తెలుసా?
on May 3, 2021
తెలుగు సినీ సంగీతాన్ని విదేశీయులకు కూడా చవిచూపిన తెలుగు చిత్రంగా వాహినీ వారి 'మల్లీశ్వరి' చిత్రాన్ని చెప్పుకోవాలి. అంతకుముందు విడుదలైన చిత్రాలను 1931 నుంచీ తీసుకుంటే వాటిలో సంగీత స్థాయి కొంతవరకే ఉండేది. సంగీత సాహిత్యాలను సమతూకంలో నడిపించుకుంటూ ఆసాంతం సంగీత ప్రాధాన్యం కల చిత్రంగా నిర్మితమైన మల్లీశ్వరితో తెలుగు సినీ సంగీత గమనం, దిశ రెండూ మారిపోయాయి. ఈ చిత్రానికి పాటలను దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి రచించగా, సంగీతాన్ని సాలూరి రాజేశ్వరరావు సమకూర్చారు.
ఎన్టీ రామారావు, భానుమతి హీరో హీరోయిన్లుగా, స్వీయ దర్శకత్వంలో బి.ఎన్. రెడ్డి నిర్మించిన 'మల్లీశ్వరి చిత్రం' 1951లో విడుదలైంది. అంతకు ముందు వాహినీ బ్యానర్‌పై పలు మంచి సినిమాలు వచ్చాయి. వారి తొలి సినిమా 'వందేమాతరం' 1939లో విడుదలైంది. ఆ మూవీలో కొంత భాగాన్ని హంపీలో తీయాల్సి వచ్చింది. అప్పుడు హంపీలో ఉన్న విజయనగరంలోని విరూపాక్ష దేవాలయాన్ని సందర్శించాడు బి.ఎన్. రెడ్డి. ఆ దేవాలయం గర్భగుడిలో నిల్చొని ప్రార్థన చేస్తుండగా, ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు పూజ చేసిన పవిత్ర స్థలం ఇదే కదా అనే విషయం ఆయనకు స్ఫురించింది. వెంటనే ఒళ్లంతా పులకరించింది.
ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏదైనా ఒక కథను తీసుకొని సినిమా తీస్తే బావుంటుందని ఆయనకు అనిపించింది. అలా బి.ఎన్. రెడ్డి మనసులో 'మల్లీశ్వరి' చిత్రానికి సంబంధించిన తొలి బీజం ఆనాడు పడింది. సంవత్సరాలు గడుస్తున్నా ఆ ఊహ ఆయనను వదిలిపెట్టలేదు. తగిన కథ దొరకలేదు కూడా. ఒకరోజు సుప్రసిద్ధ రచయిత బుచ్చిబాబు రాసిన ఓ రేడియో నాటికను ఆయన విన్నారు. ఆ తర్వాత ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఓ కథను చదివారు. ఆ రెండింటి ప్రభావంతో ఒక కథను తయారుచేశారు బి.ఎన్. రెడ్డి. అదే 'మల్లీశ్వరి'గా రూపొందింది.
Also Read