ఈ వ్యవహారం చిరుకీ నచ్చట్లేదు..
on Nov 29, 2014
మేము సైతం అంటూ తెలుగు చలన చిత్రసీమ ఆర్భాటంగా ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేపే.. ఆ హంగామా. అయితే పరిశ్రమలో లుకలుకలన్నీ ఈ కార్యక్రమంతో మరోసారి బయటకు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. పరిశ్రమలో ఐకమత్యం లేదన్నది కాదనలేని వాస్తవం. ఇండ్రస్ట్రీ అంతా ఒకే తాటిపైకొచ్చి చేయాల్సిన ఈ కార్యక్రమం కూడా - పైపై మెరుగుల్లానే కనిపిస్తోంది. పరిశ్రమకు మూల స్థంభాల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకూ ప్రెస్ ముందుకు రాలేదు. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్. మహేష్‌బాబు, బన్నీ, ప్రభాస్.. వీళ్లెవరూ మాట వరసకు కూడా కనిపించలేదు. కొంతమంది అధీనంలోనే ఈ కార్యక్రమమంతా జరగడం... మిగిలిన వారిలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. అసలెందుకు.. ఈ కార్యక్రమ వివరాలు పరిశ్రమకే పెద్ద దిక్కు అయిన దాసరి నారాయణరావుకే తెలియపర్చడం లేదట. చిరంజీవికీ అసలు మేము సైతం వ్యవహారం బొత్తిగా నచ్చట్లేదని తెలుస్తోంది. ''అసలేం జరుగుతోంది..? ఎవరినీ సంప్రదించకుండా కీలకమైన నిర్ణయాలు ఎలా తీసుకొంటారు? అన్నీ మీరే అనేసుకొంటే ఇక మేముండి ఏంలాభం?'' అని మేము సైతం నిర్వాహకులపైనే చిరు తన అసంతృప్తిని వెళ్లగక్కినట్టు సమాచారం. పైగా ఈ కార్యక్రమానికి పొలిటికల్ టచ్ కూడా తగిలింది. మేము సైతం కార్యక్రమం మొత్తం అధికార టీడీపీ ప్రభుత్వాన్నీ, చంద్రబాబు నాయుడినీ మచ్చిక చేసుకోవడానికి కొంతమంది బడా నిర్మాతలు వేస్తున్న గాలం అనే ప్రచారం ఉదృతంగా ఉంది. అందుకే ఈ కార్యక్రమం జోలికి వెళ్లకపోతేనే మంచిదేమో.. అని చిరు భావిస్తున్నాడట. మొత్తానికి ఓ మంచి ఉద్దేశంతో తలపెట్టిన ఈకార్యక్రమంలో లుకలుకలు పెరిగి.. అసలు లక్ష్యానికే తూట్లు పొడుస్తుందేమోనన్న భయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో 24 గంటలు ఆగితే... అసలు రహస్యాలన్నీ బోధపడతాయి.