టాలీవుడ్ ‘మేముసైతం’ ఎవరికోసమంటారూ....
on Nov 29, 2014
హుద్ హుద్ తుఫాను విశాఖని అల్లకల్లోలం చేసింది. హుద్ హుద్ బాధితులని ఆదుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు. మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కూడా ముందుకొచ్చింది. తుఫాను బాధితుల కోసం నిధులు సేకరించాలని డిసైడైంది. ఈ ప్రాజెక్టుకి ‘మేముసైతం’ అని పేరు పెట్టింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా తెలుగు సినిమావాళ్ళు ఈనెల 30న ఆడతారు.. పాడతారు.. రకరకాల ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తారు. మీరు ఓ లక్ష రూపాయలిస్తే మీతో కలసి భోజనం కూడా చేస్తారు. ఇలా సేకరించిన డబ్బు మొత్తం తీసుకెళ్ళి ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తారు. ఇదంతా విని టాలీవుడ్ బాబులు చాలా మంచోళ్ళని మీరు అనుకుంటున్నారు కదూ... కానీ దీంట్లో స్వామికార్యం మాత్రమే కాదు.. స్వకార్యం కూడా వుందని కొంతమంది అంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అధికారంలో లేనప్పుడు టాలీవుడ్డు పెద్ద తలకాయలు ఆయన్ని లైట్ తీసుకున్నాయి. దాంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు టాలీవుడ్ బిగ్‌షాట్స్‌ని లైట్ తీసుకుంటున్నారు. టాలీవుడ్ బడాబాబులకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇరోస్ సంస్థతో ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ ఒప్పందం కూడా చేసేసుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబుని మంచి చేసుకోకపోతే ఫ్యూచర్లో తన సినిమా బిజినెస్ మొత్తం దెబ్బతింటుందేమోనని ఓ బడా నిర్మాతకి గుబులు పుట్టేసిందట. హుద్ హుద్ తుఫానుని అడ్డం పెట్టుకుని నిధులు సేకరించి, వాటిని ఏపీ సీఎం సహాయనిధికి ఇచ్చేసి చంద్రబాబుని కాకాపట్టే ప్లాను కూడా ఈ ‘మేముసైతం’ వెనక వుందట.
అన్నట్టు ఈ మేముసైతంలో ఓ కుంభకోణం కూడా వుందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయండోయ్. ‘మేముసైతం’ కార్యక్రమం లైవ్ ప్రసారం చేసే హక్కుల్ని ఆ బడా నిర్మాత మూడున్నర కోట్లకి జెమినీ టీవీకి ఇచ్చేశారట. మూడున్నర కోట్లా... పర్లేదుగా అనుకుంటున్నారా? మా టీవీవాళ్ళు ఆరు కోట్లు ఇస్తామన్నా వినకుండా మూడుకోట్లు ఇస్తామన్న జెమినీ వాళ్ళకే ఆ బడా నిర్మాత ఇచ్చేశారట. ఇంతకీ ఎందుకలా చేసినట్టు? ఈ విషయంలో టాలీవుడ్ పండితులు చెప్పేదేంటంటే... ఆ బడా నిర్మాతకి మా టీవీ అంటే గిట్టదట. తాను ఈమధ్య తీసిన మూడు సినిమాల శాటిలైట్ హక్కుల్ని 25 లక్షలకి మా టీవీ వాళ్ళకి అంటగట్టాలని ఆయన ప్లాన్ వేశారట. అయితే ఆ ట్రాప్‌లో మాటీవీవాళ్ళు పడలేదట. అంతేకాదు.. గతంలో ఆ నిర్మాతకి చెందిన వంద సినిమాల హక్కుల్ని రెన్యువల్ చేయడానికి కూడా మా టీవీ ఒప్పుకోలేదట. దాంతో ఆయన తన కొత్త మూడు సినిమాల హక్కులతోపాటు, పాత వంద సినిమాల హక్కుల్ని కూడా జెమినీ టీవీకి ఇచ్చేశారట. పాపం జెమినీ టీవీ తనకు అంత బాగా ఉపయోగపడింది కాబట్టి ఇప్పుడు మేముసైతం హక్కుల్ని జెమినీ టీవీకి తక్కువ ధరకి ఇచ్చేశారట.