'బేబీ' క్లైమాక్స్ మార్చమని చెప్పిన మెగాస్టార్!
on Jul 31, 2023
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బేబీ'. మాస్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకుడు. జూలై 14న విడుదలైన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, దాదాపు రూ.40 కోట్ల షేర్ రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా చూశాక క్లైమాక్స్ మరోలా తీసి ఉంటే బాగుండేదని దర్శకుడు సాయి రాజేష్ తో మెగాస్టార్ చిరంజీవి అన్నారట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి రివీల్ చేయడం విశేషం.
మెగా కల్ట్ సెలబ్రేషన్స్ పేరుతో తాజాగా 'బేబీ' సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. తన అభిమానులైన సాయి రాజేష్, ఎస్.కె.ఎన్ తన స్ఫూర్తితో సినీ పరిశ్రమకు వచ్చి, ఇప్పుడు బేబీ లాంటి చిత్రం తీయడం గర్వంగా ఉందని అన్నారు. ఈ సినిమా తనకు ఎంతగానో నచ్చిందని, అయితే క్లైమాక్స్ లో చిన్న మార్పు చేస్తే బాగుండేదని దర్శకుడికి సూచించినట్లు చెప్పారు.
"సినిమా చివర్లో హీరోయిన్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు దర్శకుడు చూపించాడు. ఇలా చూపించడం వల్ల ఎన్ని తప్పులు చేసినా సరే.. ఎవడో ఒకడు దొరుకుతాడని వాడితో సెటిల్ కావచ్చనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుందేమో అనిపించింది. అందుకే హీరోయిన్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా నన్ గా మారి సేవ చేస్తున్నట్లు చూపిస్తే బాగుండేదని సలహా ఇచ్చాను. అయితే తర్వాత దీని గురించి ఆలోచిస్తే, దర్శకుడే కరెక్ట్, నేనే తప్పు అనిపించింది. ఎందుకంటే, తెలిసో తెలియకో తప్పు చేస్తే లైఫ్ అయిపోయినట్టు కాదని, లైఫ్ మళ్లీ చిగురిస్తుందనే మెసేజ్ ను ఈ సినిమా ద్వారా ఇచ్చారు." అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
