'ఆర్ ఆర్ ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ గుండు నిజమేనా?
on Jan 5, 2020
2020లోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఏదంటే ఎవరైనా ఠక్కున చెప్పే పేరు 'ఆర్ ఆర్ ఆర్'. కారణం ఈ సినిమాకి యస్.యస్. రాజమౌళి దర్శకుడు కావడం, అందులో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటించడం. 20వ శతాబ్దం ఆరంభంలో బ్రిటిషర్లను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, రజాకార్ల గుండెల్లో నిద్రపోయిన గోండు గెరిల్లా యోధుడు కొమరం భీమ్ గా తారక్ ఈ సినిమాలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర్నుంచీ, దాని అప్‌డేట్స్ కోసం అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొని ఉండటం, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. అప్పుడప్పుడు షూటింగ్ లొకేషన్ నుంచి అనధికారికంగా కొన్ని ఫొటోలు లేదా వీడియో క్లిప్స్ వెల్లడవుతుంటే, ఆ వెంటనే చిత్ర బృందం లేదా హీరోల ఫ్యాన్స్ వాటిని తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా ఒక ఆశ్చర్యకరమైన వదంతి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దాని ప్రకారం.. ఒక సన్నివేశంలో తారక్ గుండుతో కనిపిస్తాడంట. ఒక సందర్భంలో కొమరం భీమ్ గుండు చేయించుకొనే సీన్ ఉందనీ, రాజమౌళి ఆ సీన్ విషయం చెప్పడంతో, విగ్గు ధరించడానికి బదులు నిజంగా గుండు చేయించుకోడానికి తారక్ సరేనన్నాడనేది ఆ గాసిప్ సారాంశం. ఈ గాసిప్‌ను పేరుపొందిన మీడియా సంస్థలు కూడా క్యారీ చెయ్యడం గమనార్హం. అయితే.. ఈ సినిమాలో తారక్ గుండు చేయించుకోవడం అనేది కేవలం వదంతి మాత్రమేననీ, అలాంటి సీన్ ఏదీ సినిమాలో లేదనీ 'తెలుగుఒన్' పరిశోధనలో తెలియవచ్చింది. సంచలనం కోసమే ఈ వదంతికి కావాలని పుట్టించారనీ, 'ఆర్ ఆర్ ఆర్'లో తారక్ ఏ సన్నివేశంలోనూ గుండుతో కనిపించడనీ ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.
'ఆర్ ఆర్ ఆర్'లో చరణ్ జోడీగా బాలీవుడ్ భామ అలియా భట్, తారక్ జతగా బ్రిటిష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. ప్రస్తుతం తారక్, ఒలీవియా పాల్గొంటున్న సన్నివేశాల్ని రాజమౌళి చిత్రీకరిస్తున్నాడు. కీరవాణి స్వరాలు కూరుస్తుండగా, కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. దీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం జూలై 30న విడుదల కావాల్సి ఉంది.