Home

»

Latest News

సంగీత రంగం కంటే సినిమా ఇండస్ట్రీనే సేఫ్‌.. చిన్మయి షాకింగ్ కామెంట్స్.!

Nov 23, 2026 3:00PM

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు హెచ్‌.ఎన్‌. భాస్కర్‌ అమెరికాలో మైనర్‌పై లైంగిక నేరాలకు సంబంధించిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం భారతీయ శాస్త్రీయ సంగీత రంగంలో కలకలం రేపుతోంది. గాయని చిన్మయి శ్రీపాద ఈ ఘటనపై తీవ్రంగా స్పదించారు. ఆమె చేసిన వ్యాఖ్యల్లో ఓ విషయం ఇప్పుడు ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. కర్ణాటక సంగీతం, శాస్త్రీయ నృత్య రంగాల కంటే సినిమా ఇండస్ట్రీనే సురక్షితమైనదని ఆమె వ్యాఖ్యానించారు.

కర్ణాటకకు చెందిన 50 ఏళ్ల హెచ్‌.ఎన్‌. భాస్కర్‌పై కాలిఫోర్నియాలో 18 ఏళ్లలోపు బాలికకు సంబంధించిన లైంగిక నేరాల ఆరోపణలతో నాలుగు ఫెలోనీ అభియోగాలు నమోదయ్యాయి. 2026 సెప్టెంబర్‌ 4 నుంచి 26 మధ్య ఈ ఘటనలు జరిగినట్లు శాన్‌ డియాగో సుపీరియర్‌ కోర్టు రికార్డుల్లో పేర్కొన్నారు. నవంబర్‌ 6న కేసు నమోదవడంతో పాటు అరెస్ట్‌ వారెంట్‌ కూడా జారీ అయింది. తాజాగా ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం.

ఈ కేసుపై చిన్మయి సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. భాస్కర్‌పై వచ్చిన ఆరోపణలు, అరెస్ట్‌ వార్త తనకు ఆశ్చర్యం కలిగించలేదని పేర్కొన్నారు. కర్ణాటక సంగీతం, శాస్త్రీయ నృత్య రంగాలు చాలా దగ్గరి సంబంధాలున్న వర్గాలని, అక్కడ అందరికీ అందరి గురించి తెలుసని వ్యాఖ్యానించారు. పలుకుబడి ఉన్న వ్యక్తుల కారణంగా కొందరు తప్పించుకుంటున్నారని, ఫిర్యాదు చేసిన వారి కెరీర్‌లే దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు.

ముఖ్యంగా ఈ రంగాల్లోనే తన కుటుంబానికి మూడు తరాలుగా పరిచయాలు ఉన్నాయని చిన్మయి వెల్లడించారు. తన వ్యక్తిగత అనుభవం ఆధారంగా చూస్తే.. కర్ణాటక శాస్త్రీయ సంగీత రంగం కంటే సినిమా ఇండస్ట్రీ చాలా సురక్షితమైనదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ వాతావరణం నుంచి తాను దూరంగా వెళ్లిపోయానని, అందుకు కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: చైతన్య బర్త్‌డే.. లిప్‌కిస్‌తో విషెస్‌ చెప్పిన శోభిత.!

భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్య రంగాల్లో గురు-శిష్య సంప్రదాయానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. విద్యార్థులు తమ గురువుల దగ్గరే ఉండి శిక్షణ తీసుకోవడం, వారితో వ్యక్తిగతంగా ఎక్కువ సమయం గడపడం ఈ సంప్రదాయంలో భాగం. అయితే ఇదే వ్యవస్థను కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు గతంలోనూ వినిపించాయి. విద్యార్థులు తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెడితే అవకాశాలు కోల్పోతామనే భయంతో మౌనంగా ఉంటున్నారని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదులపై అంతర్గత కమిటీలు సరిగా స్పందించకపోవడం కూడా సమస్యగా మారిందని ఆమె విమర్శించారు.

ఈ రంగంలో లైంగిక వేధింపుల గురించి తనకు బాధితుల నుంచి సందేశాలు వచ్చాయని చిన్మయి వెల్లడించారు. అయితే వారి అనుమతి లేకుండా వ్యక్తిగత వివరాలు, సందేశాలను బయటపెట్టలేనని స్పష్టం చేశారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే, వారికి న్యాయసహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

మీకు నచ్చవచ్చు: 
చిరంజీవి పేరులో ‘N’ మాయం.. ఆ హోర్డింగ్స్‌ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా.?
భోగి ట్రైలర్‌లో శర్వా విశ్వరూపం.. ఐదుగురు చెల్లెళ్ల కోసం గంగ పోరాటం.!

 

 

 

[HN Bhaskar Case, Chinmayi Sripaada, Carnatic Music, Film Industry]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com