'మత్తు వదలరా' మూవీ రివ్యూ
on Dec 25, 2019
సినిమా పేరు: మత్తు వదలరా
తారాగణం: శ్రీసింహా, సత్య, నరేశ్ అగస్త్య, అతుల్యచంద్ర, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, విద్యుల్లేఖా రామన్, పావలా శ్యామల, అజయ్, అజయ్ ఘోష్, గుండు సుదర్శన్
స్క్రీన్‌ప్లే: రితేశ్ రాణా, తేజ ఆర్.
పాటలు: రాకేందు మౌళి
సంగీతం: కాలభైరవ
సినిమాటోగ్రఫీ: సురేశ్ సారంగం
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
ప్రొడక్షన్ డిజైనర్: ఎ.ఎస్. ప్రకాశ్
స్టంట్ కో-ఆర్డినేటర్: శంకర్ ఉయ్యాల
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత
కథ-దర్శకత్వం: రితేశ్ రాణా
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: 25 డిసెంబర్ 2019
ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుల్లో చిన్నవాడైన శ్రీసింహా హీరోగా, పెద్దవాడైన కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రంగా 'మత్తు వదలరా' కొద్ది కాలంగా వార్తల్లో నలుగుతూ వస్తోంది. ఇదివరకే కాలభైరవ గాయకుడిగా ప్రేక్షకులకు పరిచయమే కానీ, శ్రీసింహా పరిచయం లేడు. 'రంగస్థలం' సినిమాకి డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అతను నటుడిగా అవతారం ఎత్తి, తొలి సినిమాలోనే హీరోగా నటిస్తున్నాడనే విషయం క్యూరియాసిటీని రేకెత్తించింది. దానికి తగ్గట్లు పబ్లిసిటీని కూడా వినూత్నంగా జరపడంతో క్లాస్ ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తూ వచ్చారు. రితేశ్ రాణా అనే నూతన దర్శకుడు రూపొందించిన ఈ సినిమా ఎలా ఉందయ్యా అంటే...
కథ
ఒక పల్లెటూరి నుంచి హైదరాబాద్‌కు జీవనం కోసం వచ్చిన బాబూమోహన్ (శ్రీసింహా) అనే యువకుడు ఒక డోర్ డెలివరీ కంపెనీలో డెలివరీ బాయ్‌గా చాలీ చాలని జీతంతో పనిచేస్తుంటాడు. వచ్చిన జీతం మూడంటే మూడు గంటల్లో ఖర్చయిపోవడంతో ఫ్రస్ట్రేషన్‌కు గురై తమ ఊరికి వెళ్లిపోదామనుకుంటాడు. కానీ రూమ్మేట్ అయిన ఏసు (సత్య) సలహా మేరకు ఒకసారి ఒక అపార్ట్‌మెంట్‌లో పార్సిల్‌ని డెలివరీ చేయడానికి వెళ్లి, ఫ్లాట్‌లో ఉన్న వృద్ధురాలి (పావలా శ్యామల)కి దాన్ని ఇచ్చి, ఆమె ఇచ్చిన 8 వేల రూపాయలు లెక్కపెడుతున్నట్లు నటిస్తూ, ఒక రూ. 500 నోటును షర్ట్ లోపలివైపు దాచేసి, రూ. 500 తగ్గాయని అంటాడు. తాను సరిగ్గానే ఇచ్చానని బామ్మ అంటుంది. వాదులాట పెరగడంతో ఆమె బాబూమోహన్ చొక్కా పట్టుకుని గుంజుతుంది. పెనుగులాటలో 500 నోటు కింద పడుతుంది. దాంతో పాటు బామ్మ కూడా కిందపడిపోతుంది. ఆమె తల ఫ్లోర్‌ని తాకుతుంది. ఆమె ముక్కు దగ్గర వేలుపెట్టి చూసి, చనిపోయిందనుకుంటాడు బాబూమోహన్. అతడికి ముచ్చెమటలు పోస్తాయి. తాను నేరం చేశాననుకొని, దాన్నుంచి బయటపడటానికి మార్గాలు అన్వేషిస్తాడు. ఆ క్రమంలో కొత్త కొత్త విషయాలు బయటకొస్తాయి. అవేమిటి? సంకట స్థితి నుంచి బాబూమోహన్ బయటపడ్డాడా లేదా? అనేది మిగతా కథ.
విశ్లేషణ
సినిమా విడుదలకు ముందు హీరో శ్రీసింహా ఎప్పుడూ నిద్రమత్తులో తూగుతూ ఉంటాడని ప్రచారం చేశారు. సినిమా చూస్తే ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించడానికే ఆ ప్రచారం చేశారని అర్థమైపోతుంది. సినిమా ఆరంభంలో మాత్రమే కూసింతసేపు అతడిది నిద్రమత్తు అన్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత అతడు మత్తులో ఉండేది వేరే కారణంతో. 'మత్తు వదలరా' అనేది 2 గంటల 10 నిమిషాల నిడివి ఉన్న సినిమా. సినిమా మొదలైన అరగంట తర్వాత ఇది క్రైమ్ థ్రిల్లర్ అనే విషయం ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. బాబూమోహన్ ఒక క్రైంలో చిక్కుకున్న క్షణం నుంచి దాదాపు ప్రతి సన్నివేశం థ్రిల్‌కి గురిచేస్తూ, తర్వాత సీన్‌లో ఏం జరుగుతుందనే ఉత్కంఠని కలిగిస్తుంది. ప్రేక్షకుడి ఊహకు, అంచనాలకు అందని విధంగా బిగువైన స్క్రీన్‌ప్లేతో కథను నడిపాడు దర్శకుడు. కష్టపడి కాకుండా జనాల్ని మోసంచేసి డబ్బు సంపాదించాలనుకుంటే ఏం జరుగుతుందనే ఒక సందేశాన్ని కూడా ఈ సినిమాతో దర్శకుడు ఇచ్చాడు. అలాగే ఇల్లీగల్‌గా మాదకద్రవ్యాల వ్యాపారం, దాని ఉత్పత్తి ఎలా మన ఇళ్లమధ్యే మనకు తెలీకుండా జరుగుతూ ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సినిమాతో చూపించాడు దర్శకుడు.
వెన్నెల కిశోర్ క్యారెక్టర్‌ను డైరెక్టర్ డిజైన్ చేసిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. పెద్ద రోల్ కాకపోయినా కథకు కీలకమైన బామ్మ పాత్రలో పావలా శ్యామలను చూపించిన విధానం, స్లో మోషన్‌లో ఆమె హావభావాలను క్యాప్చర్ చేసిన విధానం శెభాష్ అనిపించేలా ఉన్నాయి. సన్నివేశాలకు కావాల్సిన మూడ్‌ను ఎలివేట్ చెయ్యడంలో సురేశ్ సారంగం కెమెరా, కాలభైరవ నేపథ్య సంగీతం ఉన్నత స్థాయిలో పనిచేశాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా సినిమా ఉత్కంఠభరితంగా రావడంలో దోహదపడింది. లవ్ యాంగిల్, రొమాన్స్, డ్యూయెట్స్, రెగ్యులర్ ఫార్ములా వంటివి లేకుండా రెండు గంటల పైగా ప్రేక్షకుల్ని కుర్చీల్లో కూర్చోపెట్టాలంటే పకడ్బందీ స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఉండాలి. ఈ సినిమాలో అవి పుష్కలంగా ఉన్నాయి. రెండు నిర్మాణ సంస్థలు.. అందులోనూ భారీ చిత్రాలు తీసే ఒక సంస్థ ఉన్నప్పటికీ, నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో లేకపోవడం స్పష్టంగా తెలుస్తోంది. చాలా తక్కువ బడ్జెట్‌తోటే డైరెక్టర్ ఈ సినిమా తీశాడనేది స్పష్టం. స్పెషల్ ఎఫెక్ట్స్ అవసరమైన చోట తగినంత బడ్జెట్ లభిస్తే, ఆ సన్నివేశాలు మరింత బాగా వచ్చుండేవి.
ప్లస్ పాయింట్స్
గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే
థ్రిల్ కలిగించే సన్నివేశాల కల్పన
ఊహాతీతంగా సాగే కొన్ని పాత్రలు
నటీనటుల అభినయం
ప్రి క్లైమాక్స్ వరకు కొనసాగే సస్పెన్స్
టెక్నికల్ అంశాలు
మైనస్ పాయింట్స్
నిర్మాణ విలువలు క్వాలిటీగా లేకపోవడం
హీరో బాబూమోహన్ క్యారెక్టరైజేషన్‌లో కొంత కన్‌ఫ్యూజన్ ఉండటం
ఒక కీలకపాత్రను అనవసరంగా చంపివేయడం
అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ల నంబర్లలో గందరగోళం
నటీనటుల అభినయం
మెయిన్ లీడ్ బాబూమోహన్ పాత్రలో శ్రీసింహా రాణించాడు. ఒక కొత్త నటుడి నుంచి మనం ఊహించే దానికి మించి అతడు హావభావాలతో మెప్పించాడు. సినిమాకి కీలకమైన బామ్మతో పెనుగులాట సన్నివేశంలో సింహా ప్రదర్శించిన హావభావాలకు ఆశ్చర్యచకితులవుతాం. కొన్నిచోట్ల మాత్రం హావభావాలు ఓవర్ ది బోర్డ్ వెళ్లినట్లు తోస్తాయి. ఏదేమైనా తొలి సినిమాలోనే ఈ స్థాయి నటనను అతడు ప్రదర్శించాడంటే, మరో నాలుగైదు సినిమాల తర్వాత మరింత ఉన్నత స్థాయి నటుడిగా అతడు ఎదుగుతాడని చెప్పొచ్చు. ఈ జనరేషన్ కమెడియన్స్‌లో సత్య ఒక టిపికల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తనదైన మార్కును చూపిస్తున్నాడు. హీరో ఫ్రెండ్ ఏసు క్యారెక్టర్‌లో గొప్పగా ఆకట్టుకున్నాడు. నిజం చెప్పాలంటే సినిమా మొత్తం ప్రేక్షకులకు వినోదాన్నిచ్చింది అతడి క్యారెక్టరే. హీరో మరో రూమ్మేట్, ఫ్రెండ్‌గా నరేశ్ అగస్త్య కూడా ప్రతిభావంతుడైన నటుడిగా మనకు దర్శనమిచ్చాడు. మన ఊహలకు భిన్నమైన క్యారెక్టర్‌లో రాణించాడు. మత్తు పదార్థాల డీలర్ మైరా పాత్రలో అతుల్యచంద్ర సరిగ్గా సరిపోయింది. అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో ఉండే రవిగా ఇప్పటివరకూ మనంచూడని ఒక భిన్న పాత్రలో వెన్నెల కిశోర్ ఆకట్టుకుంటాడు. పావలా శ్యామల, విద్యుల్లేఖా రామన్, బ్రహ్మాజీ, గుండు సుదర్శన్ తమ పాత్రలకు తగ్గ అభినయాన్ని చూపారు. అజయ్ ఘోష్, అజయ్ అతిథి పాత్రల్లో కనిపించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్
న్యూ జనరేషన్ డైరెక్టర్లు ఎంత కొత్తగా ఆలోచిస్తున్నారు.. రొడ్డకొట్టుడు మూస కథలు, సన్నివేశాలతో విసుగెత్తుతున్న ప్రేక్షకులకు అవకాశం లభిస్తే కొత్త అనుభవాల్ని ఇవ్వడానికి ఎలా తపిస్తున్నారనేందుకు 'మత్తు వదలరా' సినిమా ఒక నిదర్శనం. నిరభ్యంతరంగా సినిమాకు వెళ్లి ఒకవైపు ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఆస్వాదిస్తూనే, మరోవైపు థ్రిల్స్‌ని ఫీలవ్వొచ్చు.
రేటింగ్: 3.25/5
- బుద్ధి యజ్ఞమూర్తి