బాబు బంగారం మూవీ రివ్యూ
on Aug 12, 2016
30 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకొన్న కథానాయకుడు వెంకటేష్. ఆయన ఖాతాలో బోల్డన్ని హిట్లున్నాయి. ఈమధ్యే వరుస విజయాలతో ఆకట్టుకొంటున్న దర్శకుడు మారుతి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో 'బాబు బంగారం' అనే టైటిల్, వెంకీకి హిట్ పెయిర్ అనిపించుకొన్న నయనతార హీరోయిన్.. ఓ సినిమాపై హైప్ పెరగడానికి ఇంతకంటే ఏం కావాలి? ఎప్పుడూ లేనంతగా వెంకీ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు.. సోలో రిలీజ్. అన్నీ కలిసొచ్చిన శుభవేళ.. వెంకీ - మారుతి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొన్నారా? అంచనాల్ని నిలబెట్టారా? తమ ఖాతాలో మరో హిట్ వేసుకొన్నారా? ఈ విషయాలన్నీ తెలియాలంటే రివ్యూ మొదలెట్టాల్సిందే.
* కథ
పోలీస్ కమీషనర్ కృష్ణ (వెంకటేష్)ది జాలి గుండె. ఎదుటివాళ్ల కన్నీళ్లు చూసి ఇట్టే కరిగిపోతుంటాడు. తాను కొట్టిన రౌడీలనే హాస్పటల్‌కి తీసుకెళ్లి సేవ చేస్తుంటాడు. అలాంటి కృష్ణ.. శైలు (నయనతార) కష్టాలు చూసి జాలి పడతాడు. ఆమె నాన్న ఓ కేసులో ఇరుక్కొని ఎక్కడికో పారిపోతాడు. తన కోసం రౌడీ గ్యాంగ్ వెదుకుతుంటుంది. మరో వైపు పోలీసుల ఇంట్రాగేషన్. ఇవన్నీ చాలదన్నట్టు ఇంట్లో బోల్డన్ని సమస్యలు. అవన్నీ తీర్చడానికి సిద్ధపడతాడు కృష్ణ. తాను పోలీస్ అనే విషయం తెలీయకుండా జాగ్రత్త పడుతూ.. సాయం చేస్తుంటాడు. ఆ క్రమంలో శైలుని ఇష్టపడతాడు. శైలు కూడా కృష్ణని ప్రేమించడం మొదలెడుతుంది. అయితే అదే సమయంలో తన తండ్రిని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ తనే అన్న సంగతి తెలుస్తుంది. అంతేకాదు.. తన తండ్రి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి. దాంతో శైలు.. కృష్ణకు దూరం అవుతుంది. మరి శైలు సమస్యల్ని కృష్ణ ఎలా పరిష్కరించాడు? ఆమెకు మళ్లీ ఎలా దగ్గరయ్యాడు? అసలు శైలు తండ్రికి పొంచి ఉన్న ఆపదేంటి? ఈ విషయాలన్న తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
* విశ్లేషణ
కథ వింటుంటే.. నిర్ణయం అనే పాత సినిమా గుర్తుకు రావడం ఖాయం. అందులోనూ ఇంతే. ఓ కేసు నిమిత్తం.. హీరోయిన్ వెంట పడుతుంటాడు హీరో. ఆ క్రమంలో ప్రేమలో పడతాడు. లైన్ మాత్రం చాలా పాతది. దానికి మారుతి తన వంతు వినోదం జోడించే ప్రయత్నం చేశాడు. హీరోకి పరమ జాలి.. కానీ అతను పోలీస్.. అనే పాయింట్ కొత్తదే కావొచ్చు. కానీ.. ఆ పాయింట్‌ని పరమ పాత ఫార్ములా కోసం వాడడం మాత్రం నప్పలేదు. బత్తాయి బాబ్జీ పాత్రతో ఫస్టాఫ్ నడిపించడానికి శాయశక్తులా కృష్ణి చేశాడు. సెకండాఫ్‌లో పోసాని కృష్ణమురళిని అడ్డుపెట్టుకొన్నాడు. కథలో బలం లేకపోతేనే కమెడియన్లమీద, స్నూఫ్‌ల మీద ఆధారపడాల్సివస్తుంది. ఇక్కడా అదే జరిగింది. నాన్నకు ప్రేమతో స్నూఫ్‌తో కాసేపు నవ్వించాడు మారుతి. ఓ కమెడియన్‌ని అడ్డుపెట్టుకొని. వాడ్ని బకరాగా మార్చుకొని హీరో తన లక్ష్యాల్ని సాధించడం అనే పాయింట్‌కి మన దర్శకుడు ఎప్పుడు దండేస్తారో మరి.
దర్శకుడు రాసుకొన్న కామెడీ సీన్లన్ని అయిపోయాక పరిస్థితి మామూలే. కథ ఎప్పుడైతే చెప్పాలనుకొన్నాడో.. అప్పుడు సినిమా పేషెంట్‌లా తయారైంది. కారణం... కథలో విషయం లేకపోవడమే. ఓ వీడియోని అడ్డుపెట్టుకొని హీరో.. విలన్‌లను ఓ ఆట ఆడుకోవాలని చూడడం, క్లైమాక్స్ లో దాన్ని సిల్లీగా తేచ్చేయడం రుచించవు. గబ్బర్ సింగ్ తరహాలో.. కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే.. అలాంటి సన్నివేశాల్ని చాలా సార్లు చూడడం వల్లనేమో పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఫస్టాఫ్ వినోదంతో టైమ్ పాస్ అయిపోతే... సెకండాఫ్‌లో ఆ వినోదం కరవయ్యింది. పోసాని, బ్రహ్మానందం.. వీళ్లిద్దరూ ఎంత ప్రయత్నించినా సెకండాఫ్ గట్టెక్కలేకపోయింది.
వెంకటేష్ అన్నట్టు నిజంగానే ఈ సినిమాలో తను యంగ్‌గా కనిపించాడు. ఈ సినిమాకి బలం అతనే. బొబ్బిలి రాజా రోజుల్ని గుర్తు చేయడానికి ఆయనా శతవిధాలా ప్రయత్నించారు. కానీ.. వెంకీ అంత హుషారుగా కదల్లేకపోయాడు. వెంకీ బలం వినోదం పండించడం. కానీ ఈ సినిమాలో వెంకీ చుట్టు ఉన్నవాళ్లు కామెడీ చేస్తుంటారు గానీ, ఆయన మాత్రం కేవలం ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడానికే పరిమితమయ్యాడు. మల్లీశ్వరిలానో, నువ్వు నాకు నచ్చావ్‌లానో... వెంకీ కూడా కామెడీ చేస్తే బాగుండేది. నయన ఎప్పట్లానే పద్ధతిగా కనిపించింది. అందంగానూ ఉంది. ఈ సినిమాతో ఆమెకు ప్లస్ అయ్యింది లేదు.. ఆమె వల్ల ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు పడిందీ లేదు. అలవాటైన పద్ధతిలో తాను చేసుకొంటూ వెళ్లిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాని రెండున్నర గంటల పాటు భరించారంటే అదంతా ఫృద్వీ, పోసాని వల్లే. ఫస్టాఫ్‌లో ఫృద్వీ వేసిన పంచ్‌లు.. బాగా పేలాయి. బత్తాయి బాబ్జీగా అలరించాడు. నాన్నకు ప్రేమతో ఎపిసోడ్ బాగా నవ్వించింది. ఓవర్సీస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ అది. వెన్నెల కిషోర్ ఓకే అనిపిస్తాడు. సంపత్ నటన ఎప్పట్లానే ఉంది. బ్రహ్మానందం చివర్లో ఓ మెరుపులా వచ్చాడంతే. అయితే తను నుంచి కూడా కామెడీ ఆశించలేం.
* సాంకేతికంగా
సినిమా చాలా రిచ్‌గా ఉంది. కెమెరా వర్క్ బాగుంది. బాబు బంగారం పాట ఒక్కటే క్యాచీగా ఉంది. ఆర్.ఆర్‌లో ఉన్న ఊపు.. తెరపై కనిపించదు. బొబ్బిలి రాజా సిగ్నేచర్ ట్యూన్ వస్తున్నప్పుడు మాత్రం వెంకీ ఫ్యాన్స్‌కి హుషారొస్తుంది. కథకుడిగా మారుతి ఫెయిల్ అయ్యాడు. దర్శకుడిగానూ ఇంతే. ఇంత పూర్ స్ర్కిప్ట్ మారుతి ఇప్పటి వరకూ రాసుకోలేదేమో? కొన్ని కామెడీ సీన్లు పండాయిగానీ.. అవీ లేకపోతే ఈ యేడాది అతి పెద్ద బోరింగ్ సినిమాగా మిగిలిపోయేది.
* పంచ్ లైన్
వెంకీ ఫ్యాన్స్ పరిస్థితి - అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో...
రేటింగ్: 2