నువ్వెంతోయ్... శతకోటి లింగాల్లో బోడి లింగానివి!
on Aug 21, 2017
అనసూయకు కోపం వచ్చిందండోయ్... ‘హాఠ్... నువ్వెవరివోయ్ నా బట్టల గురించి మాట్లాడటానికీ... నా ఇష్టం. నచ్చిన బట్టలేసుకుంటా. నచ్చిన తీరులో ఉంటా. చూడ్డం ఇష్టం లేకపోతే... మానేయ్. లేకపోతే కళ్లు మూసుకో...’ అంటూ ఛడామడా... లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. పాపం.. ఆ అర్భకుడెవరో కానీ.. మళ్లీ రిప్లై కూడా లేదు. అసలేంటి గొడవ? అనేగా మీ డౌట్?...
ఈ అమ్మాయి.. యాంకరింగులూ గట్రా చేస్తుంటుంది కదా!.. వాటిల్లో చిత్ర విచిత్రమైన డ్రస్సులు వేసుకొని విన్యాసాలూ అవీ... చేస్తుంటుంది కదా!.. అవి ఓ కంటికి ఇంపుగా ఉంటే...... ఇంకో కంటికి యావగించుకునేలా ఉంటాయి కదా! ఆ ఇంకో కంటివాడు... ఓ మీడియా లైవ్ షోలో... అనసూయ మీద అంతెత్తు లేచాడట. ‘నీ బట్టలేంటీ... నీ వేషాలేంటి? అసలు మేం టీవీలు చూడాలా వద్దా. నీకు బట్టల విషయంలో సోయ ఉందా? పొదుపు ఉండొచ్చు కానీ... మరీ ఇంతలానా? హన్నన్నా!’అని ఘాటుగా రియాక్టయ్యాడు.
మరి మన అనసూయ ఊరుకుంటుందా? అంతకు పదింతలు అప్పజెప్పిందా ఇంకో కంటివాడికి. ‘నువ్వెవరివోయ్ నా బట్టల గురించి మాట్లాడటానికి? నా ఇష్టం. నచ్చిన బట్టలే వేసుకుంటా. నచ్చిన తీరులోనే ఉంటా. చూడ్డం ఇష్టం లేకపోతే మానేయ్. లేకపోతే కళ్లు మూసుకో. నా వృత్తి ఎంటర్టైన్ చేయడం. రకరకాల డ్రస్సులు వేసుకోవాల్సి వస్తుంది. కోట్లాది మంది నా ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. నువ్వెంతోయ్ శతకోటి లింగాల్లో బోడి లింగానివి. మాలిన్యం నేను వేసుకునే బట్టల్లో లేదు. చూసే నీ కళ్లల్లో ఉంది. నేను ఆడదాన్ని. ఒకరి ఇల్లాలిని. మరీ మాట్లాడితే ఇద్దరు బిడ్డలకు తల్లిని. నాకు మంచీ చెడూ చెప్పే స్థాయా నీది? ముందు నీ సంగతి చూస్తో’అని ఓ ప్రైవేటు క్లాస్ ఇచ్చేసింది వాడికి.
పాపం.., ఇంతకీ వాడేం చేశాడు? అశుద్దం మీద కాలేశాడా?... ఆకాశం మీద ఉమ్మేశాడా?... వాడికే అర్థం కాని పరిస్థితి. మీకేమైనా అర్థమైందా?