అనుష్క కష్టమంతా బూడిద పాలేనా?
on Nov 28, 2015
డౌటేలేదు. అనుష్క అంత ప్రొఫెషనల్ కథానాయిక టాలీవుడ్‌లోనే లేదు. తనకు పాత్ర నచ్చితే చాలు, ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధపడిపోతుంటుంది.పారితోషికం గురించి పట్టించుకోదు. అవసరమైతే మిగిలిన సినిమాల్ని పక్కన పెట్టి, తన కెరీర్‌ని త్యాగం చేసి మరీ.. ఆ సినిమా చేస్తుంది. రుద్రమదేవి, సైజ్ జీరో అలా చేసిన సినిమాలే. రుద్రమదేవి కోసం రెండేళ్లు కష్టపడింది. కత్తి యుద్దాలు నేర్చుకొంది. గుర్రపుసారీ చేసింది. రుద్రమదేవి కోసమే చాలా కథలు పక్కన పెట్టింది. పారితోషికం కూడా బాగా తగ్గించుకొందని వినికిడి. ఇంతాకష్టపడితే ఏమైంది?? చివర్లో వచ్చిన గోనగన్నారెడ్డి అల్లు అర్జున్ ఆ క్రెడిట్ అంతా పట్టుకెళ్లిపోయాడు.
ఈ సినిమా ఈమాత్రమైనా ఆడిందంటే అదంతా బన్నీ చలవే అన్నారు. దాంతో అనుష్క పడిన కష్టం ఎగిరిపోయింది. ఇప్పుడు సైజ్ జీరో కూడా అంతే. ఈ సినిమా కోసం ఏ కథానాయికా చేయని త్యాగం చేసింది అనుష్క. దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. అది తగ్గడానికి నానా పాట్లూ పడుతోంది. అయితే ఈ సినిమా పలితం కూడా అంతంత మాత్రమే. అనుష్క బాగా చేసింది గానీ.. జనం చూడరు అనేస్తున్నారు విమర్శకులు. ఇది పక్కా మల్టీప్లెక్స్ సినిమా అంటూ ముద్ర వేస్తున్నారు. మల్టీప్లెక్స్ కోసమే అయితే అనుష్క ఇంత కష్టపడడం ఎందుకు??
అంతకు ముందు వర్ణ సినిమా కూడా ఇంతే. అనుష్క పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. బాహుబలి లో అనుష్క ఇరగదీస్తుందనుకొంటే ముసలి మేకప్‌తో భయపెట్టాడు రాజమౌళి. ఇలా అనుష్క అంచనాలన్నీ తారుమారు అవుతూనే వస్తున్నాయి. సైజ్ జీరో ఫలితం చూసుకొన్నాక కూడా అనుష్క ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుందనుకోవడం అత్యాసే అవుతుంది. కొన్నాళ్ల పాటు రొటీన్ గ్లామర్ పాత్రలవైపే అనుష్క మొగ్గు చూపినా ఆశ్చర్యపోనవసరం లేదు.