ENGLISH | TELUGU  

వెలలేని వెండితెర గురుతు అంజలీదేవి

on Aug 24, 2017

సినిమాను పెనవేసుకున్న పదం... ‘గ్లామర్’. హీరో అనేవాడు మాస్ గా ఉండాలి. హీరోయిన్ అంటే గ్లామర్ గా ఉండేలి. ఇదే వాణిజ్య మంత్రం. ‘మాస్’అంటే ‘జనం’. కానీ సినీ పరిభాషలో అదో ‘ఫీలింగ్’. ‘గ్లామర్’ అంటే ‘అందం’. సినీ పరిభాషలో అదో ‘స్టేటస్’. 


ఇలా ‘మాస్’ ఓ అనుభూతిగా మారడం మహానటుడు ఎన్టీయార్ తో జరిగితే... ‘గ్లామర్’ ఓ స్టేటస్ గా రూపాంతరం చెందడం... మహానటి అంజలీదేవితో మొదలైంది. ఆ విధంగా సినిమాపై ప్రేక్షకుల దృక్కోణాన్నే మార్చేశారు వీరిద్దరూ. సరే అసలు విషయానికొద్దాం... మంచితనం పరిమళిస్తుందంటారు.  ప్రతిభ ప్రకాశిస్తుంటారు. అంజలి జీవితాన్ని పరికించి చూస్తే అది నిజమని ఎవరైనా ఒప్పుకుంటారు. రంగస్థలం నుంచి వెండితెర దాకా ఆమె ప్రయాణం ఓ అద్భుతమైతే... వెండితెరపై ఆమె నట ప్రస్థానం అత్యద్భుతం, అనితరసాథ్యం. ఓవైపు సంగీత దర్శకుడు ఆదినారాయణరావు సహధర్మచారిణిగా, మరోవైపు వెండితెరపై మహారాణిగా ఆమె ప్రయాణం నేటి కథానాయికలందరికీ ఓ పాఠ్యాంశం. 


ఆ రోజుల్లో చాలామంది హీరోయిన్లకు అంజలీదేవి ప్రేరణ. అంతెందుకు... తెలుగువారంతా మహానటి సావిత్రికి అభిమానులు. కానీ ఆమె... అంజలీదేవి అభిమాని. అంజలిని ప్రేరణగా తీసుకొని ఆమె నటించిన సందర్భాలు చాలా ఉన్నాయ్. ఆ విషయాన్ని తానే స్వయంగా చెప్పారు కూడా. ‘కీలుగుర్రం’(1949) చిత్రం శతదినోత్సవం విజయవాడలో జరిగింది. సినీతారల్ని చూడటానికి వేలాదిగా ప్రజలు తరలివస్తే... కేవలం అంజలీదేవిని చూడ్డానికి సావిత్రి వెళ్లారు. ఆ జనసముద్రంలో దూరం నుంచి తన అభిమాన నటిని చూసి  మురిసిపోయారామె. ఆ ఆనందంలో పక్కనున్న మురుగు కాల్వను కూడా గమనించలేదు. తోపులాట పల్ల అమాంతం కాలువలో పడిపోయారు. ఈ సంఘటనను తను సూపర్ స్టార్ అయ్యాక కూడా గుర్తుచేసుకునేవారు సావిత్రి. అంజలి అంటే ఆమెకు అంతిష్టం. 


యాదృశ్చికమైన విషయం ఏంటంటే... కథానాయికగా అంజలి ప్రయాణం సాగుతున్న సమయంలోనే... సావిత్రి కూడా తెరకు పరిచయమై.. సూపర్ స్టార్ అయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే... ఆ రోజుల్లో నంబర్ వన్ హీరోయిన్ సావిత్రి అయితే... నంబర్ వన్ నటి అంజలీదేవే. ‘చెంచులక్ష్మి’(1958)లో మహాలక్ష్మిగా ఆమెను చూస్తే... కేలండర్లో మహాలక్ష్మిని చూస్తున్నట్లే ఉంటుంది. అంతటి లక్ష్మీకళ అంజలి సొంతం. ‘రాజశేఖరా.. నీపై మోజు తీరలేదురా... ’అంటూ... ‘అనార్కలి’(1955)గా ఆమె అభినయించిన తీరును ఎవరు మరిచిపోగలరు చెప్పండి? 


సీతమ్మ ఎన్ని కష్టాలు పడిందో మనం చూడలేదు కానీ... తెరపై సీతగా అంజలీదేవి కష్టాలు పడుతుంటే.. ప్రేక్షకులు విలవిలలాడిపోయారు. ‘లవకువ’(1963)లో సీతగా ఆ మహానటి అభినయం నిజంగా చిరస్మరణీయం. ఎన్టీయార్ తొలి హీరోయిన్ కూడా అంజలీదేవే.  ఆయన రెండో సినిమా‘పల్లెటూరి పిల్ల’(1950)లో తొలిసారి ఎన్టీయార్ తో జతకట్టారామె. ఇక అప్పట్నుంచీ తెలుగుతెరపై హిట్ పెయిర్ అంటే.. ఎన్టీయార్, అంజలీదేవే. ‘బాలనాగమ్మ’(1952), జయసింహ’(1955), ‘పాండురంగ మహత్మ్యం’(1957), ‘భట్టీ విక్రమార్క’(1960), ‘లవకుశ’(1963), ‘పల్నాటియుద్ధం’(1966), ‘బడిపంతులు’(1972) ఇలా ఆణిముత్యాలనదగ్గ సినిమాలు వారి కాంబినేషన్లో వచ్చాయ్.  అసలు వెండితెర సీతారాములు అంటే అంజలి, ఎన్టీయారే కదండీ. 

అక్కినేని, అంజలి కూడా హిట్ పెయిరేనండోయ్. అంజలి పిక్చర్స్ పతాకంపై అంజలి నిర్మించిన... ‘పరదేశి’(1953), ‘అనార్కలి’(1955), ‘సువర్ణసుందరి’(1957), ‘భక్తతుకారం’(1973), ‘మహాకవి క్షేత్రయ్య’(1976) చిత్రాల్లో అక్కనేనే కథానాయకుడు. ఇంకా చాలా సినిమాల్లో వీరిద్దరూ జతకట్టారు.  ‘అందానికి నేను అంజలినోయీ...’అనే నానూడి కూడా అప్పట్లో ఉందంటే నమ్ముతారా?. నాటి యువతరానికి ‘స్వప్న సుందరి’ ఆమే... ‘సువర్ణ సుందరి’ ఆమే. ఆ విధంగా తెలుగు సినిమా స్వర్ణయుగంలో అంజలిది ఓ సువర్ణాధ్యాయం. 


అంజలి గురించి తెలిసినవారికి గుర్తుచేస్తే బ్రహ్మానందం. తెలీనివారికి చెబితే... పరమానందం. అదేదో సినిమాలో చెప్పినట్టూ.... ఆ మహానటి నట ప్రస్థానం... కన్నవారి జన్మ పావనం. విన్నవారి జన్మ శ్రావణం. నేడు అంజలి పుట్టిన రోజు. బ్రతికుంటే నేటికి 90ఏళ్లు నిండేవి. 2014 జనవరి 13న ఆమె శివసాయుద్యం పొందారు. భౌతికంగా ఆమె మనమధ్య లేకపోయినా... వెలలేని వెండితెర గురుతుగా ప్రేక్షక హృదయాల్లో మాత్రం ఎన్నటికీ నిలిచే ఉంటారు. 

 

- నరసింహ బుర్రా 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.