బిగ్ స్టోరీ: మేకోవర్స్‌తో ట్రెండ్ సెట్ చేస్తోన్న బన్నీ!
on Mar 19, 2020
ఇటీవల తన బాడీగార్డ్ పుట్టినరోజు వేడుకలో పొడవుగా పెంచిన గడ్డంతో కనిపించిన అల్లు అర్జున్ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. సుకుమార్ మూవీ కోసం అతను మేకోవర్ అయ్యాడని అతని రూపం తెలియజేస్తోంది. ఆ వేడుకకు అతను క్యాప్ పెట్టుకొని వచ్చాడు కానీ, లేకపోతే అతని జులపాల జుట్టు కూడా బహిర్గతమయ్యేదే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. ఆ క్యారెక్టర్‌కు రఫ్ అండ్ టఫ్ లుక్ కావాలి కాబట్టి, సుకుమార్ సూచన మేరకు జుట్టు, గడ్డం పెంచి రఫ్‌గా కనిపించేలా మేకోవర్ అయ్యాడు బన్నీ. అయితే తన క్యారెక్టర్లతో, మేకోవర్‌తో అతను మనల్ని ఆశ్చర్యపరచడం, ఆకట్టుకోవడం ఇదే మొదటిసారి కాదు. పాత్ర కోసం అతను ఎన్ని సార్లు తన రూపాన్ని మార్చుకున్నాడో ఒక లుక్కేస్తే, వాటిలో మనల్ని ఆకట్టుకోని సందర్బాల కంటే అలరించిన సందర్భాలే ఎక్కువగా కనిపిస్తాయి.
ఆర్య
'గంగోత్రి' వంటి హిట్ మూవీతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ రూపం ప్రేక్షకులకు ఆకట్టుకోలేదు. కానీ సుకుమార్ డైరెక్ట్ చేసిన తన రెండో సినిమా 'ఆర్య'లో బన్నీని చూసినవాళ్లంతా ఆశ్చర్య చకితులయ్యారు. మొదటి సినిమాతో ఏమాత్రం పోలికలేని విధంగా రెండో సినిమాలో రూపం మారిపోయి కనిపించాడు బన్నీ. తన పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసిన అతను ఆర్యగా తన మేకోవర్‌తోనూ ఆకట్టుకొని, ఫ్యాన్స్ సంఖ్యను విపరీతంగా పెంచుకున్నాడు.
దేశముదురు
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'దేశముదురు' మూవీలో పొడవుగా పెంచిన జుట్టుతో కనిపించాడు బన్నీ. అంతేనా! బాలగోవింద్ అనే ఆ క్యారెక్టర్‌లో తొలిసారి సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు, అలరించాడు. ఒక టాలీవుడ్ హీరో సిక్స్ ప్యాక్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. అలా తన బాడీ మేకోవర్‌తో టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్ అయిన ఘనతను సొంతం చేసుకున్నాడు బన్నీ. సినిమాలో తన బాడీని చూపిస్తూ అతను చేసిన ఫైట్లు ఫ్యాన్స్‌కు కిర్రెక్కించాయి.
ఆర్య 2
బన్నీని 'ఆర్య'గా ప్రెజెంట్ చేసి, స్టార్‌గా మార్చిన డైరెక్టర్ సుకుమార్ మరోసారి అతడిని డిఫరెంట్‌గా ప్రెజెంట్ చెయ్యడానికి ఈ సీక్వెల్ ద్వారా ట్రై చేశాడు. డిఫరెంట్ హెయర్ స్టైల్‌తో కొత్తగా కనిపించిన బన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. కానీ, తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయితో ఉన్న కారణంగా చాలా ప్రాంతాల్లో థియేటర్లను మూసివేయడం వల్ల ఈ ప్రాంతంలో 'ఆర్య 2' హిట్ అనిపించుకోలేదు. ఆంధ్రలో మాత్రం లాభాలను ఆర్జించాడు.
బద్రినాథ్
కండలు బాగా పెంచి, ట్రిమ్ చేసిన గడ్డం, ముడి వేసిన పొడవాటి జుట్టుతో ఒక యోధుడిలా 'బద్రినాథ్' మూవీలో కనిపించాడు అల్లు అర్జున్. ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్ దేవాలయాన్ని కాపాడే బాధ్యతను వహించే టైటిల్ రోల్‌లో కత్తి చేతబట్టి చెలరేగిపోయాడు బన్నీ. అయితే కథలోని బలహీనతలు, స్క్రీన్‌ప్లే తప్పుల కారణంగా వి.వి. వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆశించిన రీతిలో ఆకట్టుకోలేదు.
జులాయి
'బద్రినాథ్'లో సరికొత్త రూపంలో కనిపించిన బన్నీ, ఆ వెంటనే 'జులాయి' కోసం మరో రూపంలోకి వెళ్లిపోయాడు. జుట్టును కత్తిరించుకొని అల్ట్రా మోడరన్ లుక్‌లో కనిపించాడు. రవీంద్ర నారాయణ్ అనే క్యారెక్టర్‌లో ఒక వైపు ఇలియానాతో రొమాన్స్ చేస్తూ, ఇంకోవైపు బిట్టూ క్యారెక్టర్ చేసిన సోనూ సూద్‌తో టాప్ అండ్ జెర్రీ గేమ్ ఆడుతూ అలరించాడు బన్నీ. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బిగ్ హిట్టయింది.
డీజే.. దువ్వాడ జగన్నాథమ్
రెండు రకాల ఛాయలుండే ఈ మూవీలో విలన్లకు డీజేగా, తనవాళ్లకు దువ్వాడ జగన్నాథమ్‌గా కనిపించే రోల్‌ను తనదైన శైలిలో పోషించాడు అల్లు అర్జున్. డీజేగా మోడరన్ లుక్‌లో కనిపించిన అతను దువ్వాడ జగన్నాథమ్ అనే బ్రాహ్మణ వంటగాడిగా నుదుటిన, ఛాతీపైన, చేతులకు విభూతి నామాలు, కొద్దిగా పెంచిన గడ్డం, పంచెకట్టుతో సరికొత్త రూపంలో దర్శనమిచ్చాడు. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రెండు ఛాయల క్యారెక్టర్‌ను రెండు రకాల డైలాగ్ డిక్షన్‌తో మెప్పించాడు.
నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా
రైటర్ నుంచి డైరెక్టర్‌గా మారి వక్కంతం వంశీ రూపొందించిన తొలి చిత్రం 'నా పేరు సూర్య'లో ఆర్మీ సోల్జర్‌గా కనిపించాడు అల్లు అర్జున్. ఆర్మీ కట్ హెయిర్ స్టైల్‌తో పాటు బాడీని పెంచి సూర్య పాత్ర కోసం చాలా శ్రమించాడు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేనివాడిగా బన్నీ ఎంత బాగా తన పాత్రను పోషించినా, కథలో అలరించే అంశాలు పెద్దగా లేకపోవడంతో ప్రేక్షకుల్ని ఈ సినిమా మెప్పించలేకపోయింది.
- బుద్ధి యజ్ఞమూర్తి

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
