అరుదైన ఘటన.. బన్నీ, సుక్కు.. ఇద్దరూ ఒకేసారి ఏడ్చేశారు!
on Dec 28, 2021

'పుష్ప' కథానాయకుడు అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్.. ఇద్దరూ ఒకేసారి ఎమోషనల్ అవుతూ ఏడ్చేసిన అరుదైన సందర్భం ఆ సినిమా థాంక్యూ మీట్‌లో చోటు చేసుకుంది. ఈరోజు జరిగిన ఈ మీట్‌లో మాట్లాడిన బన్నీ.. మధ్యలో ఎమోషనల్ అయ్యాడు. తను రుణపడే వ్యక్తులు చాలా తక్కువమంది ఉంటారన్న బన్నీ.. తన తాతయ్య అల్లు రామలింగయ్య, తన తల్లితండ్రులు, తనను మొదట్నుంచీ ప్రోత్సహిస్తూ వస్తున్న చిరంజీవి తర్వాత, సుకుమార్‌కు రుణపడి ఉంటానని చెప్పాడు. ఆ సందర్భంగా అతను ఎమోషనల్ అవగా, సుకుమార్ సైతం భావోద్వేగానికి గురయ్యాడు.
"నాకు తెలీదు, నాకు సుకుమార్ అంటే అంతిష్టమని. ఆర్య వచ్చిన నాలుగైదేళ్ల తర్వాత.. పరుగు సినిమా టైమ్‌లో అనుకుంటాను ఒక కారు కొనుక్కున్నాను. దాని ఖరీదు రూ. 85 లక్షలు. స్పోర్ట్స్ కారు.. అద్దిరిపోద్ది. డ్రైవింగ్ సీట్లో కూర్చొని, స్టీరింగ్‌పై చేయిపెట్టి.. ఇంత దూరం వచ్చానంటే దీనికి ఎవరెవరు కారణమై ఉంటారని ఆలోచించాను. నా మైండ్‌లో తట్టిన మొదటి వ్యక్తి సుకుమార్ గారు." అని భావోద్వేగానికి గురై మాట పెగలక ఆగిపోయాడు బన్నీ. అప్పుడే సుకుమార్ కూడా ఎమోషనల్ అయిపోయి, కన్నీళ్లు పెట్టుకున్నాడు. రెండు చేతులతో ముఖాన్ని దాచుకున్నాడు.
"డార్లింగ్.. నువ్వు లేకపోతే నేను లేను.." అని గొంతు గద్గదికమవుతుండగా చెప్పాడు బన్నీ. సుకుమార్ కళ్లజోడు తీసి, కళ్లు తుడుచుకుంటూ లేచి నిలబడ్డాడు. బన్నీ కొనసాగిస్తూ.. "ఆర్య లేదు. ఇంకేవీ లేవు" అని మళ్లీ భావోద్వేగానికి గురై.. మాట్లాడలేక ఆగిపోయి, జేబులోంచి కర్చీఫ్ తీసి, కళ్లజోడు పైకెత్తి కళ్లు తుడుచుకున్నాడు.
"ఛీ.. ఛీ.. ఛీ.. ప్రతిసారీ ఫంక్షన్‌లో పబ్లిక్‌లో ఇదేంట్రా దేవుడా.. లాస్ట్ టైమ్ నాన్నగారి గురించి అనుకున్నప్పుడు అనుకోకుండా ఇలా అయ్యింది. మళ్లీ ఇప్పుడవుతోంది దేవుడా.. ఇప్పుడైనా అర్థమైందా నువ్వెంత ఇంపార్టెంటో.." అని అంటుంటే సుకుమార్‌కు ఏడుపు ఆగలేదు. ఆయనను పక్కనే ఉన్న దేవి శ్రీప్రసాద్ ఓదార్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



