అఖిల్ గాయపడటం నిజమేనా? నిర్మాతలు నోరు విప్పరేంటి?
on Mar 7, 2020
అఖిల్ అక్కినేని హీరోగా ఇంతవరకూ ఒక్కటంటే ఒక్క విజయాన్నీ అందుకోలేకపోయాడు. అతను హీరోగా పరిచయమైన 'అఖిల్' మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కాగా.. 'హలో', 'మిస్టర్ మజ్ను' సినిమాలు బిలో యావరేజిగా నిలిచాయి. అఖిల్ హిట్ కొడితే చూడాలని అతని తల్లిదండ్రులు నాగార్జున, అమలతో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు.
'బొమ్మరిల్లు' వంటి క్లాసిక్ మూవీతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న భాస్కర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అయినా అక్కినేని ఫ్యాన్స్ ఎందుకనో ఆనందంగా కనిపించడం లేదు. కారణం.. భాస్కర్ మునుపటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడమే. అతని చివరి సినిమా 'ఒంగోలు గిత్త'. రామ్ హీరోగా నటించిన ఆ మూవీ ఎలా ఆడిందో మనకు తెలుసు. కాగా ఇటీవల ఒక ఫైట్ సీన్ చేస్తుంటే అఖిల్ గాయపడ్డాడంటూ ఆన్‌లైన్‌లో జోరుగా ప్రచారం జరిగింది. దానివల్ల కొద్ది రోజుల పాటు షూటింగ్ అంతరాయం కలిగిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా నిర్మాతల నుంచి ఎలాంటి ప్రకటనా రాకపోవడం గమనార్హం. దాంతో అసలు అఖిల్‌కు దెబ్బలు తగిలాయా, లేదా అనే విషయంలో క్లారిటీ లేక ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు.
సాధారణంగా సెట్స్‌పై యాక్టర్లు.. అందులోనూ హీరో హీరోయిన్లలో ఎవరైనా గాయాల పాలైతే వెంటనే ఆ విషయాన్ని నిర్మాతలో, మీడియా మేనేజరో తెలియజేయడం పరిపాటి. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. సోషల్ మీడియాలో అఖిల్ గాయాల వార్త ఎంతగా వైరల్ అవుతున్నా.. ఆ దెబ్బలు చిన్నవా, పెద్దవా.. అనే విషయం ఎవరూ చెప్పలేదు. ఇది ఫ్యాన్స్‌ని ఇరిటేట్ చేస్తోంది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బేనర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో మూవీని రిలీజ్ చేస్తామని మాత్రం వాళ్లు చెబుతున్నారు.