'అఖండ' టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేసింది!
on Dec 28, 2021

యంగ్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్‌రెడ్డి చాలా చాలా సంతోషంగా ఉన్నారు. 'అఖండ' రూపంలో ఆయనకు కెరీర్‌లో తొలి సక్సెస్.. అదీ అతి పెద్ద స్థాయిలో దక్కింది. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే 'అఖండ' బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ సినిమాతో నేమ్, ఫేమ్.. రెండూ రావడంతో, ఆ ఉత్సాహంతో మార్చిలో కొత్త సినిమాని ప్రారంభించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో ఓ కొత్త హీరోను పరిచయం చేస్తామని ఆయన చెప్పారు. దర్శకుడు ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తానన్నారు.
కాగా 'అఖండ'కు సీక్వెల్ చేయాలనే కోరిక ఉన్నట్లు వెల్లడించారు రవీందర్‌రెడ్డి. "అయితే ఆ డెసిషన్ తీసుకోవాల్సింది బోయపాటి గారే. ఆయనకు వేరే ప్లాన్స్ ఉండవచ్చు. సినిమా ఓ విజువల్ వండర్‌లా వచ్చింది కాబట్టి.. ఎలాంటి పరిస్థితుల్లో విడుదల చేసినా ట్రెండ్ సెట్టర్ అవుతుందని నేను నమ్మాను. అందుకే థియేటర్లలోనే ఈ సినిమాని విడుదల చెయ్యాలని అనేక నెలలు వెయిట్ చేశాం. కరోనా సెకండ్ వేవ్‌తో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ మేం దీన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఆలోచన అస్సలు చేయలేదు." అని ఆయన చెప్పారు.
'అఖండ' విడుదలైనప్పుడు టికెట్ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేసిందని రవీందర్‌రెడ్డి తెలిపారు. "ఈ చిత్ర విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం మాకు కొంత సపోర్ట్ చేసింది. నిజానికి ఆ సమయంలో మాకు చాలా భయాలుండేవి. పెద్ద చిత్రాలకు ఈ రేట్లు వర్కవుటవుతాయా? అసలు ఈ కరోనా భయాల మధ్య ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రారా? అనుకున్నాం. కానీ, టికెట్ రేట్ల విషయంలో మా చిత్రాన్ని చూసీ చూడనట్లు వదిలేశారు. ఫలితంగా మంచి వసూళ్లొచ్చాయి. ఒకవేళ పరిస్థితులు మునుపటిలా ఉండుంటే ఇంతకు రెట్టింపు వసూళ్లు వచ్చుండేవి. త్వరలోనే అన్ని సమస్యలు తొలగిపోతాయని ఆశిస్తున్నాం.’’ అని ఆయన చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



