బాలీవుడ్ ఒరిజినల్ చాక్లెట్ బాయ్.. రిషి కపూర్!
on Apr 30, 2020

రెండేళ్ల పాటు కేన్సర్‌తో యుద్ధం చేసిన బాలీవుడ్ లెజెండ్, 'ఒరిజినల్ చాక్లెట్ బాయ్ ఆఫ్ బాలీవుడ్'గా పేరుగాంచిన రిషి కపూర్ బుధవారం కన్నుమూశారు. ఆయనకు 67 సంవత్సరాలు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆయనను ముంబైలోని హెచ్.ఎన్. రిలయన్స్ హాస్పిటల్‌లో చేర్పించినట్లు ఆయన సోదరుడు రణధీర్ కపూర్ తెలిపారు.
రిషి కపూర్ తుది శ్వాస విడిచే సమయంలో ఆయన భార్య నీతూ కపూర్ పక్కనే ఉన్నారు. దివంగత లెజండరీ యాక్టర్ అండ్ డైరెక్టర్ రాజ్ కపూర్ రెండో కుమారుడు రిషి కపూర్. బాలీవుడ్‌లో 1973లో డింపుల్ కపాడియా సరసన నటించిన 'బాబీ' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తనదైన మార్క్ వేశారు. తొలి సినిమాతోటే బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకున్న ఘనత ఆయన సొంతం. అప్పట్నుంచే ఆయన చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నారు.
ఆ సినిమాలో రాజ్‌నాథ్ క్యారెక్టర్ పోషణతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు రిషి. బాబీ బ్రగాంజా అనే గోవన్ క్యాథోలిక్ అమ్మాయితో అతని ప్రేమకథ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. డింపుల్, రిషి మధ్య కెమిస్ట్రీ అమోఘంగా పండి, ఆ ఇద్దరి జోడీకి ఆడియన్స్ నీరాజనాలు పట్టారు. 'గ్రేటెస్ట్ షోమ్యాన్ ఆఫ్ హిందీ సినిమా'గా పేరు ప్రఖ్యాతులు పొందిన రాజ్ కపూర్ తీసిన 'శ్రీ 420', 'మేరా నామ్ జోకర్' తదితర సినిమాల్లో చైల్డ్ యాక్టర్‌గా రిషి నటించారు.
విశేషమేమంటే, బాలనటుడిగా పరిచయమైన 'మేరా నామ్ జోకర్' మూవీతో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా రిషి నేషనల్ అవార్డ్ అందుకున్నారు. "నటన అనేది నా బ్లడ్‌లోనే ఉంది కాబట్టి, దాన్నుంచి నేను తప్పించుకోలేకపోయాను. నా బాల్యం ఒక కలలా గడిచింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మా ఇంటికి తరచూ వస్తుండేవారు. మా ప్రొఫెషన్‌ను చూసుకొని కపూర్లు గర్వంగా ఫీలవుతుంటారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి చెందినవాళ్లమని మాలో ఏ ఒక్కరూ పశ్చాత్తాపపడ్డ సందర్భం లేదు" అని తన ఆటోబయోగ్రఫీ 'ఖుల్లమ్ ఖుల్లా'లో రాసుకున్నారు రిషి.
రణధీర్, రీతూ నందా, రీమా జైన్, రాజీవ్ కపూర్ ఆయన తోబుట్టువులు కాగా, స్టార్ హీరో రణబీర్ కపూర్, డిజైనర్ రిధిమా కపూర్ సహాని ఆయన పిల్లలు. తారలు కరిష్మా కపూర్, కరీనా కపూర్‌లకు ఆయన సొంత బాబాయ్. రిషి కన్నుమూశాక ఆయన కుటుంబం ఒక ప్రకటన వెలువరించింది. "మా ప్రియమైన రిషి కపూర్ రెండేళ్ల పాటు లుకేమియా వ్యాధితో పోరాడి, ఈరోజు హాస్పిటల్‌లో ఉదయం 8:45 గంటలకు ప్రశాంతంగా వెళ్లిపోయారు. చివరి శ్వాస దాకా ఆయన తమను ఎంటర్‌టైన్ చేస్తూ వచ్చారని హాస్పిటల్‌లోని డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ చెప్పారు. ఆయన రెండు ఖండాల్లో రెండేళ్ల పాటు ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే సరదాగా రోజుల్ని గడిపారు. ఆయన దృష్టి ఎప్పుడూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫుడ్, ఫిలిమ్స్ మీదే ఉండేది. ఈ కాలంలో కలుసుకున్న ప్రతి ఒక్కరూ తన జబ్బును ఏమాత్రం పట్టించుకోకుండా కనిపించే ఆయనను చూసి ఆశ్చర్యపోతూ వచ్చారు" అని ఆ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుత కరోనావైరస్ సంక్షోభ కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వచ్చిన రిషి, తన చివరి ట్వీట్‌లో డాక్టర్లపై రాళ్లు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేయడం గమనార్హం. డాక్టర్లు, నర్సులు, మెడికల్ స్టాఫ్, పోలీసులపై రాళ్లు వేయడం కానీ, చిత్రవధకు గురిచేయడం కానీ, మరే విధమైన హింస కానీ చేయవద్దని ఆయన ప్రజలను కోరారు. "అన్ని రకాల సామాజిక స్థితిగతుల్లో, నమ్మకాల్లో ఉండే సోదర సోదరీమణులకు ఇది నా అప్పీల్. హింస, రాళ్లు విసురుట, చిత్రవధలకు పాల్పడవద్దు. మనల్ని కాపాడ్డానికి డాక్టర్లు, నర్సులు, మెడికల్ స్టాఫ్, పోలీసులు తదితరులు తమ జీవితాలను పణంగా పెడుతున్నారు. కలిసికట్టుగా కరోనావైరస్‌పై యుద్ధంలో మనం గెలవాలి. ప్లీజ్. జైహింద్" అని ఆయన ట్వీట్ చేశారు.
నటుడిగా రిషి కపూర్‌ను బాగా ఆవిష్కరించిన సినిమాల్లో బాబీ (1973), అమర్ అక్బర్ ఆంటోని (1977), సర్గమ్ (1979), కర్జ్ (1980), నసీబ్ (1981), ప్రేమ్ రోగ్ (1982), సాగర్ (1985), నగీనా (1986), చాందిని (1989), హెన్నా (1991), దీవానా (1992), బోల్ రాధ్ బోల్ (1992), యారానా (1995), 102 నాటౌట్ (2018) వంటివి చెప్పుకోతగ్గవి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



