కన్నీళ్లతో కాదు... చిరునవ్వుతో వీడ్కోలు పలకండి
on Apr 30, 2020

కపూర్ ఫ్యామిలీ రిషి కపూర్ మృతిని ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. రిషి కపూర్ అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలను గౌరవించాలని కపూర్ కుటుంబ సభ్యులు కోరారు. ఎక్కువమంది ప్రజలు ఒకచోట సమావేశం కావడం, గుమిగూడడం నిషిద్ధం కనుక ఎవరూ రావొద్దని చెప్పారు. ఇంకా కపూర్ ఫ్యామిలీ ఆ ప్రకటనలో ఏమని పేర్కొందంటే...
"రెండేళ్లు లుకేమియాతో యుద్ధం చేసిన తర్వాత ప్రియమైన రిషి కపూర్ ఈ రోజు (గురువారం) ఉదయం 8:45 గంటలకు ప్రశాంతంగా కన్ను మూశారు. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది చివరి శ్వాస విడిచే వరకూ ఆయన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు.
రెండేళ్లలో రెండు దేశాల్లో రిషి కపూర్ చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన ఎప్పుడూ ఉల్లాస భరితంగానే ఉన్నారు. జీవితాన్ని పూర్తి ఆనందంగా జీవించాలని ధృడ నిశ్శచయంతో ఉండేవారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫుడ్, ఫిలిమ్స్... అన్నీ ఆయన దృష్టిలో ఉండేవి. ఆ సమయంలో ఆయన్ను కలిసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోయేవారు... అనారోగ్యాన్ని ఆయన ఏమాత్రం దరి చేరనివ్వలేదని.
ప్రపంచం నలుమూలల నుండి అభిమానులు, ప్రేక్షకులు కురిపిస్తున్న ప్రేమాభిమానాలకు రిషి కపూర్ కృతజ్ఞుడిగా ఉంటారు. కన్నీళ్లతో కాకుండా ప్రేక్షకులు చిరునవ్వుతో తనను సాగనంపాలని ఆయన కోరుకుంటారనే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం
వ్యక్తిగతంగా మాకు ఎంతో నష్టం జరిగినప్పటికీ... ప్రస్తుతం ప్రపంచం అంతా కష్టకాలంలో ముందుకు వెళుతోంది. బహిరంగంగా ప్రజలు సమావేశం కావడం, గుమిగూడడంపై అనేక ఆంక్షలు ఉన్నాయి. అభిమానులు, శ్రేయోభిలాషులు దయచేసి అమలులో ఉన్న చట్టాలను గౌరవించాలని మేము కోరుతున్నాం" అని కపూర్ ఫ్యామిలీ తెలిపింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



