కారు ప్రమాదం నుంచి బయటపడ్డ డాక్టర్ రాజశేఖర్.. వదంతులపై జీవిత వివరణ!
on Nov 13, 2019
కారు ప్రమాదం నుంచి ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డారు సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్. ఆయన ప్రయాణిస్తున్న కారు మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి చేరుకున్నారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ "మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డులో నుంచి బయటకు లాగారు. అప్పుడు నేను వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాను. అక్కడ నుంచి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు" అని వివరించారు.
జీవిత వివరణ
రాజశేఖర్‌కు అయిన యాక్సిడెంట్ గురించి రక రకాల వార్తలు ప్రచారంలోకి వస్తుండటంతో ఆయన భార్య, 'మా' ప్రధాన కార్యదర్శి జీవిత వివరణ ఇచ్చారు. "రాజశేఖర్ గారికైన యాక్సిడెంట్ గురించి మీడియాలో రకరకాల న్యూస్ వస్తున్నాయి. మంగళవారం రాతి 1.30 గంటలకు రాజశేఖర్ గారు రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి బెంజ్ కారులో ఇంటికి వస్తున్నారు. మధ్యలో టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి, డివైడర్‌ను ఢీకొట్టి అవతైలి వైపు బోల్తా పడింది. అప్పుడే ఎదురుగా వస్తున్న కారులోని వాళ్లు ఇది చూసి, తమ కారును ఆపారు. రాజశేఖర్ గారి అరుపులు విని, వాళ్లు కారు దగ్గరకు వచ్చారు. వాళ్ల సాయంతో రాజశేఖర్ గారు బయటకు వచ్చారు. తనకు సాయం చేసినవాళ్ల ఫోన్ నుంచే పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు. మాకూ ఫోన్ చేశారు. ఆయన వాళ్ల కారులోనే ఇంటికి బయలుదేరగా, మేం ఎదురువెళ్లి ఆయనను ఇంటికి తీసుకు వచ్చాం. ప్రమాదం జరిగినప్పుడు రాజశేఖర్ గారి వస్తువులు ఏమేం కారులో ఉన్నాయో పోలీసులు అడిగారు. మేం చెప్పాం. రాజశేఖర్ గారి క్షేమ సమాచారం గురించి అడిగారు. మేం సేఫ్‌గా ఉన్నారని చెప్పాం. ఘటన గురించి తమ తరపు ఇన్వెస్టిగేషన్ చేస్తామని వాళ్లు చెప్పారు. రాజశేఖర్ గారి డాక్టర్ ఫ్రెండ్ వచ్చి, ఆయనను పరిశీలించి, కనుబొమ్మమీద చిన్నగా గీసుకోవడం తప్ప శరీరంలో ఎలాంటి దెబ్బలూ తగల్లేదని చెప్పారు. ఫస్ట్ ఎయిడ్ చేసి, బాడీ పెయిన్స్‌కు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఇచ్చి వెళ్లారు. రాజశేఖర్ గారు బెటర్‌గా ఫీలయ్యాక స్టేషన్‌కు వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చి వెళ్లమని పోలీసులు చెప్పారు. వస్తామని చెప్పాం. కచ్చితంగా ఇది మేజర్ యాక్సిడెంట్. కానీ రాజశేఖర్ గారి అభిమానుల ప్రేమాభిమానాలతో ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు" అని జీవిత తెలిపారు.