ఆదర్శ్‌కు కొవిడ్.. మాటమాత్రం చెప్పకుండా సినిమాలోంచి తీసేశారు!
on Apr 17, 2021
కొవిడ్-19 బారినపడటం వల్ల నటులకు అవకాశాలు ఆగిపోవడం అటుంచి, చేస్తున్న సినిమా నుంచి కూడా అర్ధంతరంగా తొలగింపబడే ప్రమాదం కూడా ఎదురవుతోందని 'హ్యాపీ డేస్' ఫేమ్ ఆదర్శ్ బాలకృష్ణ ఉదంతం తెలియజేస్తోంది. బిగ్ బాస్ సీజన్ 1 పార్టిసిపెంట్ కూడా అయిన ఆదర్శ్‌కు ఇటీవల ఓ సినిమా మేకర్స్ షాకిచ్చారు. ఇటీవల అతని కుటుంబం మొత్తం కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతని అమ్మానాన్నలైతే హాస్పిటల్ పాలయ్యారు కూడా. కొవిడ్ నుంచి కోలుకున్నాక షూటింగ్‌లో పాల్గొనవచ్చని అతను భావించాడు. కానీ అతనికి కొవిడ్ అని తెలియడంతో చేస్తున్న సినిమా నుంచి అనూహ్యంగా అతడిని తొలగించి మరొకర్ని తీసుకున్నారు.
దీంతో షాక్‌కు గురయ్యాడు ఆదర్శ్. తన ఆవేదనను ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చేసిన పోస్ట్ ద్వారా వెల్లడించాడు. "కొద్ది రోజుల క్రితం మా మొత్తం ఫ్యామిలీ కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పేరెంట్స్ హాస్పిటల్‌లో ఉన్నారు. ఇదే విషయం నా సినిమా టీమ్‌కు చెప్పాను. మాట మాత్రం చెప్పకుండా నన్ను తీసేశారు. ఒక నటుడి జీవితం ఎంతగా అభద్రతల్లో ఉంటుందనేది ఊహాతీతం. కానీ, అదేగా జీవితం." అని ట్వీట్ చేశాడు ఆదర్శ్.
అదీ విషయం. ఆ సినిమా టీమ్‌కు దాని కారణాలు దానికి ఉండొచ్చు. ఆదర్శ్ కారణంగా షూటింగ్ నిలిచిపోతుందనే ఉద్దేశంతో అతడిని తీసేసి, వేరొకర్ని తీసుకొని ఉండొచ్చు. కానీ ఆ విషయాన్ని ఆదర్శ్‌కు తెలియజేయాలన్న కనీస బాధ్యతను ఆ సినిమా టీమ్ ప్రదర్శించి ఉండాల్సింది.