నేను పెద్దయ్యాక హీరో అవుతా.. చిరంజీవి నా పెళ్లికి వస్తాడు!
on Nov 24, 2021

'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ తన ప్రేయసి లోహిత మెడలో మూడు ముళ్ళు వేసి ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ ఘనంగా జరిగిన ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అభిమాన హీరో తన పెళ్ళికి రావడంతో కార్తికేయ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తన పెళ్లికి మెగాస్టార్ హాజరవ్వడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తాజాగా కార్తికేయ ట్వీట్ చేశారు.
కార్తికేయకు మెగాస్టార్ అంటే ఎంతో అభిమానం. ఓ సినిమా అవార్డుల వేడుకలో చిరంజీవి పాటలకు డ్యాన్స్ వేసి తన అభిమానాన్ని కూడా చాటుకున్నాడు. ఆ అభిమానమే ఇప్పుడు మెగాస్టార్ ని తన పెళ్లికి వచ్చేలా చేసిందని కార్తికేయ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. "నేను పెద్దయ్యాక హీరో అవుతా. అప్పుడు చిరంజీవి కూడా నా పెళ్లికి వస్తాడు అని చిన్నప్పుడు చెప్పేవాడిని. ఇప్పుడు నా కల నిజమైంది. నేను యాక్టర్ అయ్యాను.. మెగాస్టార్ చిరంజీవి గారు నా పెళ్ళికి వచ్చారు. మెగాస్టార్ రావడం మాటల్లో చెప్పలేనంత ఆనందం." అంటూ కార్తికేయ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

'ప్రేమతో మీ కార్తీక్' సినిమాతో వెండితెరకు పరిచయమైన కార్తికేయ.. తన రెండో సినిమా 'ఆర్ఎక్స్ 100'తో సూపర్ సక్సెస్ అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గానూ రాణిస్తున్నాడు. నాని 'గ్యాంగ్ లీడర్'తో తెలుగు ప్రేక్షకులకు తన విలనిజం పరిచయం చేసిన కార్తికేయ.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ అజిత్ 'వాలిమై'లో విలన్ గా నటిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



