బాలకృష్ణతో మెగా మేనల్లుడు ‘ఢీ’
on Oct 16, 2019
మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల... వైకుంఠపురములో’ సినిమాల సంక్రాంతి సమరం గురించి ఇటు ఇండస్ట్రీలో, అటు సోషల్ మీడియాలో ప్రేక్షకాభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సంక్రాంతికి ముందే... క్రిస్మస్ బరిలో మరో సమరానికి ఈ రోజు తెర లేచింది. క్రిస్మస్‌కి ఐదు రోజుల ముందు, థియేటర్ల బరిలో బాలకృష్ణతో ‘ఢీ’ కొట్టబోతున్నాడు మెగా మేనల్లుడు సాయితేజ్. బాలకృష్ణ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మిస్తున్న ‘రూలర్’ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. అఫీషియల్‌గా అందరికీ ప్రెస్ నోట్ ఇవ్వలేదు కానీ కొన్ని రోజుల క్రితమే నిర్మాత సి. కల్యాణ్ ఓ పత్రికతో విడుదల తేదీ వెల్లడించారు. ఇప్పుడు అదే తేదీకి ‘ప్రతిరోజూ పండగే’ విడుదల చేయనున్నట్టు ఈ రోజు ప్రకటించారు. క్రిస్మస్ బరిలో నటసింహంతో మెగా మేనల్లుడు పోటీ పడనున్నాడన్న మాట! అసలు, వీరిద్దరి కంటే డిసెంబర్ 20 మీద ముందుగా కర్చీఫ్ వేసింది నితిన్. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న ‘భీష్మ’ సినిమాను ఆ రోజున విడుదల చేస్తామని ఆ టీమ్ ఎప్పుడో ప్రకటించింది. ఇప్పుడు ఎవరు వెనక్కి తగ్గుతారో... ఎవరు ముందుకు వెళతారో! ఇటు ఇండస్ట్రీ ప్రముఖుల్లో, అటు ప్రేక్షకుల్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది. బాలకృష్ణ, నితిన్, సాయి తేజ్ కంటే రవితేజ ఐదు రోజులు ఆలస్యంగా డిసెంబర్ 25న ‘డిస్కో రాజా’తో థియేటర్లలోకి రానున్నాడు.
Also Read