డీప్ ఫోకస్: 'సైరా' కలెక్షన్స్.. జెన్యూన్ వర్సెస్ ఫేక్!
on Oct 16, 2019
చిరంజీవి పన్నెండేళ్ల కల 'సైరా.. నరసింహారెడ్డి' సినిమా తెలుగునాట మినహా మిగతా అన్ని ఏరియాల్లోనూ ఫ్లాప్ కావడం ఖాయమని తేలింది. నిజానికి ఒక చరిత్రకు.. అందునా బ్రిటిషర్లపై రాజీలేని పోరుసల్పి, ఆ పోరులో ప్రాణాల్ని పణంగా పెట్టిన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథకు.. సాక్షీభూతంగా నిలిచిన సినిమాని తెలుగువాళ్లు సొంతం చేసుకోవాలి. తమ వీరుడి గాథను సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించడాన్ని గొప్పగా భావించాలి. ఇక్కడ కమర్షియల్ అంశాల కంటే, సినిమానే హైలెట్ కావాలి. దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఏ సినిమాకైనా బాక్సాఫీస్ కలెక్షన్లే కొలబద్దగా మారాయి.
ఒక సినిమాకు 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చిందటే.. ఎంతమంది ప్రేక్షకులు చూస్తే.. అంత కలెక్షన్ వస్తుంది? మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర 130 రూపాయల నుంచి 200 రూపాయల దాకా ఉంటుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 40 రూపాయల నుంచి 100 రూపాయల వరకు టికెట్ రేట్లు ఉంటున్నాయి. వాటిలో యావరేజ్ టికెట్ రేటు 70 రూపాయలుగా లెక్క కడితే.. 'సైరా' మూవీని 2 కోట్ల మందికి పైగా థియేటర్లలో వీక్షించి ఉంటారని అంచనా. ఇంతమంది చూసిన సినిమా హిట్టయినట్లా, ఫ్లాపయినట్లా? జనరల్‌గా చూస్తే.. బ్లాక్‌బస్టర్ హిట్ అనుకోవాలి. కానీ బాక్సాఫీస్ పరంగా చూసినప్పుడు 'సైరా' బ్లాక్‌బస్టర్ కాదు. చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో మినహాయిస్తే.. తమిళనాడు, కర్ణాటక, కేరళ, హిందీ రాష్ట్రాలు, ఓవర్సీస్ ఏరియాలన్నింటిలోనూ ఆ సినిమా ఫ్లాప్ అని ట్రేడ్ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. అంటే ఆ ప్రాంతాల్లో బయ్యర్లు లేదా నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి తగినట్లు కలెక్షన్లు రాలేదు. మునుముందు వస్తాయనే ఆశ ఏమాత్రమూ లేదు.
ఇప్పటివరకూ 'సైరా' ఎంత వసూలు చేసిందనే విషయంపై 'సైరా' ప్రొడ్యూసర్ రాంచరణ్ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ అనేది ఇవ్వలేదు. ఇవ్వనని ఆయన స్పష్టం చేశాడు కూడా. 'సైరా'ను డబ్బుల్తో కొలవకూడదని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ మూవీ కలెక్షన్లపై పెద్ద యుద్ధమే నడుస్తోంది. కొన్ని బాక్సాఫీస్ ట్రాకింగ్ సైట్లు 'సైరా' కలెక్షన్ లెక్కల్ని వెల్లడి చేస్తూ వస్తున్నాయి. ఒక సైట్‌కూ, ఇంకో సైట్‌కూ ఈ లెక్కల్లో తేడా కనిపిస్తోంది. ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలోనూ, కలెక్ట్ చేసిన షేర్ విషయంలోనూ లెక్కలు భిన్నంగా కనిపిస్తున్నాయి.
చాలా కాలం నుంచి ట్రేడ్ విషయాల్నీ, కలెక్షన్ల రిపోర్టునీ ఇస్తూ వస్తున్న ఒక పేరుపొందిన ట్రాకింగ్ సైట్ 'సైరా' ప్రి రిలీజ్ బిజినెస్ విలువ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలుగా లెక్కగడితే, మరో పాపులర్ సైట్ ఆ విలువ సుమారు 153 కోట్ల రూపాయలనీ, తమిళనాడు, కేరళ, నార్త్ ఇండియా ఏరియాల్లో ప్రొడ్యూసర్ స్వయంగా రిలీజ్ చేశారనీ తెలిపింది. ఓన్ రిలీజ్ విలువను అది లెక్కకట్టలేదు. మరొక సైట్ అయితే 'సైరా' ప్రి బిజినెస్ వాల్యూ 187 కోట్లుగా తేల్చింది. ఈ విరుద్ధమైన విలువల కారణంగా, ఇప్పుడు వచ్చిన కలెక్షన్లను బేరీజు వేస్తే, అవి కూడా విరుద్ధమైన లెక్కలే చెబుతున్నాయి. ఉదాహరణకు తెలంగాణ ప్రి బిజినెస్ విలువను మొదట ప్రస్తావించిన ట్రాకింగ్ సైట్ 34 కోట్ల రూపాయలుగా తెలిపింది. రెండు వారాలకు ఈ ఏరియాలో 'సైరా' 31.5 కోట్ల రూపాయలు వసూలు చేసిందనేది తాజా సమాచారం. అంటే బ్రేకీవెన్ కావడానికి ఇంకా 2.5 కోట్ల రూపాయలు రావాలి. కానీ మిగతా సైట్లలో కొన్ని ఈ ప్రి బిజినెస్ విలువను 30 కోట్ల రూపాయలని చెబితే, ఒకట్రెండు 28 కోట్ల రూపాయలని పేర్కొన్నాయి. వాటి ప్రకారం తెలంగాణలో 'సైరా' బ్రేకీవేన్ సాధించి, హిట్ రేంజికి వెళ్లింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 'సైరా' ప్రి రిలీజ్ బిజినెస్ విలువ 115 కోట్ల 40 లక్షల రూపాయలుగా మొదటి సైట్ లెక్కవేసి, 12 రోజులకు వచ్చిన వసూళ్లు 98.5 కోట్లుగా వెల్లడించింది. అంటే ఆ సైట్ ప్రకారం ఇంకా 16 కోట్లకు పైగా వస్తేనే, తెలుగునాట ఈ సినిమా బ్రేకీవెన్ సాధించినట్లు లెక్క. రెండో సైట్ తెలుగునాట ఈ ప్రి బిజినెస్ వాల్యూ 107 కోట్ల 90 లక్షల రూపాయలుగా పేర్కొంది. ఆ సైట్ ప్రకారం 12 రోజుల్లో 'సైరా' రాబట్టిన షేర్ 99 కోట్ల 67 లక్షలు. అంటే ఈ సైట్ ప్రకారం 8.5 కోట్ల షేర్ వస్తే, బ్రేకీవెన్ అయినట్లే. వీటిలో ఏది జెన్యూన్, ఏది ఫేక్ అనే విషయం తేల్చడానికి ఎవరూ సిద్ధపడటం లేదు. సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చే 'డైలీ కలెక్షన్ రిపోర్ట్' ఆధారంగానే గ్రాస్, నెట్, షేర్ విలువను లెక్కగడుతుంటారు. టాక్స్ వాల్యూని తగ్గించుకోడానికి కొంతమంది ఉద్దేశపూర్వకంగా వసూళ్లను తక్కువచేసి చూపుతుంటారనే వాదన చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంది. ప్రొడ్యూసర్ నోరు విప్పి చెబితే తప్ప నిజమైన వసూళ్ల విలువ ఏదో మిగతా వాళ్లెవరికీ తెలీదనే చెప్పాలి.
'సైరా' ఫ్లాప్ అని చెప్పడానికి కావాలనే ఒక సైట్, దాని ప్రి రిజీల్ బిజినెస్ విలువను ఎక్కువ చేసి రాస్తున్నదంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. 'సైరా' బాక్సాఫీస్ లెక్కల్లోని ఈ గందరగోళంతో, ఎవరి రిపోర్ట్ జెన్యూన్, ఎవరి రిపోర్ట్ ఫేక్.. అనే విషయం అర్థంకాక చాలామంది తలలు పట్టుకుంటున్నారు. "శుభ్రంగా సినిమాని చూశామా, దాన్ని ఆస్వాదించామా, లేదా.. అనే విషయాన్ని పక్కనపెట్టి, ఈ కలెక్షన్ల గొడవేమిట్రా బాబూ" అని వాపోతున్నవాళ్లూ ఉన్నారు.