బోయపాటి ప్లాన్ అదేనా?
on Oct 8, 2018
రామ్‌చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమాకు 'వినయ విధేయ రామ' టైటిల్ పరిశీలనలో వున్నట్టు ఫిల్మ్‌నగర్ వర్గాల భోగట్టా. ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాత దానయ్య ఈ టైటిల్ రిజస్టర్ చేయించడంతో వార్త బయటకు వచ్చింది. వినయ విధేయ రామ' టైటిల్‌తో పాటు 'స్టేట్ రౌడీ', 'రౌడీ తమ్ముడు' టైటిల్స్ ప్రచారంలో వున్నాయి. బోయపాటి ఓటు మాత్రం 'వినయ విధేయ రామ' టైటిల్‌కేనట! రామ్‌చరణ్ మాస్ హీరో. బోయపాటి ఊరమాస్ సినిమాలు తీసిన దర్శకుడు. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో టైటిల్ అంటే ఎంత మాసీగా వుంటుందోనని ఊహించిన ప్రేక్షకులకు 'వినయ విధేయ రామ' టైటిల్ కాస్త షాక్ ఇచ్చింది. ఇండస్ట్రీ జనాలకు ఈ టైటిల్ సెలక్షన్ అంత షాక్ ఇవ్వలేదు. మరోసారి బోయపాటి సేమ్ ప్లాన్ ఫాలో అవుతున్నట్టు వున్నారని అంటున్నారు. ఇంతకీ, ఆ ప్లాన్ ఏంటి?
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సినిమా 'జయ జానకి నాయక'. అందులోని యాక్షన్ సన్నివేశాల్లో రక్తం ఏరులై పారింది. హంసలదీవి ఎపిసోడ్ అయితే రక్తపాతానికి పరాకాష్ట. కాని సినిమా టైటిల్ మాత్రం సాఫ్ట్‌గా పెట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు వచ్చారంటే ఆ టైటిలే కారణం. రామ్‌చరణ్ సినిమా కూడా మాస్ సినిమాయే. బీహార్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు తీశారట. మాస్ సినిమాకు మాస్ టైటిల్ పెట్టడం వలన ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా దూరమయ్యే ప్రమాదం వుందనీ, 'వినయ విధేయ రామ' వంటి సాఫ్ట్ టైటిల్ పెడితే అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నారట!!