ఆ లిస్టులో విద్యాబాలన్ సినిమా కూడా...
on May 15, 2020
ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్స్‌కి క్యూ కడుతున్న సినిమాల లిస్టులో విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన 'శకుంతలా దేవి' కూడా చేరింది. డిజిటల్‌లో ఎప్పటి నుండి సినిమా స్ట్రీమింగ్ అవుతుందనేది చెప్పలేదు కానీ, తమ ఆన్‌లైన్ ప్రీమియం ఫ్లాట్‌ఫార్మ్ ప్రైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన 'గులాబో సితాబో'ను జూన్ 12న విడుదల చేస్తామని ప్రకటించిన మరుసటి రోజున అమెజాన్ నుండి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇతర ఓటీటీ సంస్థలకు ఒక రకంగా అమెజాన్ సవాల్ విసురుతోంది. అదే సమయంలో పెద్ద సినిమాలకు భారీ మొత్తంలో ఆఫర్ చేస్తూ వల విసురుతోంది.
లాక్‌డౌన్ మొదలైనప్పటి నుండి ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్స్‌కి ఆదరణ పెరిగింది. ప్రజలు ఇళ్లకు పరిమితం కావడంతో వినోదం కోసం ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్స్ మీద ఆధారపడుతున్నారు. మరోవైపు థియేటర్లు బంద్ కావడంతో విడుదలకు సిద్ధమైన సినిమాలు ల్యాబులకు పరిమితం అయ్యాయి. టాలీవుడ్ హీరోలు రామ్, సుధీర్ బాబు తమ సినిమాలు 'రెడ్', 'వి'ను థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని అనుకుంటున్నామని చెప్పారు. హిందీ సినిమా ఇండస్ట్రీలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, విద్యా బాలన్ వంటి స్టార్స్ నటించిన సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి.