ఓవర్ ది టాప్ - ఓటీటీ రివ్యూ: రిజెక్ట్ ఎక్స్2
on May 15, 2020
నటీనటులు ఎవరు? ఇషా గుప్తా, అహ్మద్ మాసి వలి, అనిషా విక్టర్, సుమిత్ వ్యాస్, ఆయుష్ ఖురానా, తన్వీ షిండే, పూజా శెట్టి, ప్రభనీత్ సింగ్, సాధికా స్యాల్, రిద్ధి కక్కర్ తదితరులు
ఎందులో విడుదలైంది? జీ5 ఓటీటీలో
ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి? 8
జానర్ ఏంటి? క్రైమ్, థ్రిల్లర్, ఎరోటిక్
ఏ లాంగ్వేజ్? హిందీ (ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ సౌకర్యం ఉంది)
ఎప్పుడు విడుదలైంది? మే 14న
దర్శకుడు ఎవరు? గోల్డీ బెల్
రేటింగ్ ఎంత? 1.5
తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటించిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' పాటలో స్టెప్పులు వేసిన సుందరి ఇషా గుప్తా గుర్తున్నారా? ఆమె ప్రధాన పాత్రలో, ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా నటించిన వెబ్ సిరీస్ 'రిజెక్ట్ ఎక్స్2'. ఇది సెకండ్ సీజన్. ఎలా ఉందో రివ్యూ చదివి తెలుసుకోండి.
కథేంటి?
ఫస్ట్ సీజన్‌లో ఏం జరిగిందనేది పక్కన పెట్టి క్లుప్తంగా చెప్పుకోవాలంటే... ఆరవ్ (అహ్మద్ వలి), కియారా (అనిషా విక్టర్) ప్రేమికులు. ధనవంతుల పిల్లలు కూడా! ఒక పెద్ద స్కూల్‌లో చదువుతున్నారు. మొదటి ఎపిసోడ్ ఎండింగ్‌లో కియారాను బిల్డింగ్ మీద నుండి ఆరవ్ కిందకు తోసేస్తాడు. ఆ తర్వాత అతడికి స్నేహితులతో కలిసి ఏర్పాటు చేసుకున్న మ్యూజిక్ బ్యాండ్ రిజెక్ట్ ఎక్స్ గ్యాంగ్ సభ్యులు ఎటువంటి సహాయం చేశారు? ఈ మర్డర్ కంటే ముందు జరిగిన మరో మర్డర్ కేసులో, మరో ఎటాక్ కేసులో ఆరవ్ మీద ఆఫీసర్ రెనె (ఇషా గుప్తా) ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తోంది? అసలు, కియారాను ఆరవ్ బిల్డింగ్ మీద నుండి తోసి ఎందుకు చంపాలనుకున్నాడు? తదితర ప్రశ్నలకు మొత్తం ఎపిసోడ్స్ చూస్తే సమాధానాలు దొరుకుతాయి.
విశ్లేషణ:
లవ్, రొమాన్స్, లెస్బియన్ రొమాన్స్, డ్రగ్స్ (అనే భ్రమ కల్పిస్తారు కాని కాదు), క్రైమ్, డ్రామా... ఈ వెబ్ సిరీస్‌లో అన్నీ ఉన్నాయి. అయితే అన్నిటినీ కలిపే కథే ఏమంత ఆకట్టుకునేలా లేదు. కరణ్ జోహార్ దర్శకత్వంలో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమా వచ్చింది. తర్వాత ఆయన నిర్మాణంలో సీక్వెల్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే... ఆ సినిమాలు గుర్తుకు వస్తాయి. రెండిటి నేపథ్యం ఒక్కటే అనుకోవాలి... పెద్ద స్కూల్‌లో బడా బాబుల పిల్లలు, వాళ్ల సంతానం చేసే పనులు! 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ఫ్రాంచైజీకి మర్డర్ మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి బాగా సాగదీసి 'రిజెక్ట్ ఎక్స్ 2' కథ రాశారు. ఆ సాగదీత మామూలుగా లేదు. మొదటి ఐదారు ఎపిసోడ్స్ లో చుక్కలు చూపిస్తుంది. అసలు కథలో ఉపకథలు ఎక్కువ అయ్యాయి. కథ ప్రారంభమైన సమయం నుండి ఆ పాయింట్ వదిలేసి ఏవేవో కథలు వస్తుంటే విసుగు వస్తుంది. స్టార్టింగ్ లో ఎన్నో చిక్కుముడులు వేసుకుంటూ దర్శకుడు వెళ్లాడు. లాస్ట్ 3 ఎపిసోడ్స్ లో ఒక్కో ట్విస్ట్ రివీల్ చేస్తుంటే... మర్డర్ చేసింది ఇతడే? అనిపిస్తుంది. అంతలో కాదని మరో ట్విస్ట్ రివీల్ చేస్తాడు. మొత్తం మీద చివరకు అసలు నేరం చేసింది ఎవరో ప్రేక్షకులకు చెప్పి వెబ్ సిరీస్ ముగించారు. మరో సీజన్ ఉందని హింట్ ఇచ్చారు.
పాటల్లో ఒక్కటీ ఆకట్టుకోదు. విసిగించే సన్నివేశాలు, పాటలకు వరస్ట్ యాక్టింగ్ తోడైంది. సిటీ కల్చర్, సంపన్న వర్గాల పిల్లలు ఎలా ఉంటారనేది కొంతలో కొంత చూపించడంలో మాత్రమే దర్శకుడు సక్సెస్ అయ్యారు. స్కూల్‌కి వెళ్లే టీనేజ్ కిడ్స్ రొమాన్స్ మీద కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినా... దర్శకుడు ఆ రొమాంటిక్ సీన్స్ మాత్రమే పర్వాలేదనేలా తీశారు. ప్రేక్షకులను వెబ్ సిరీస్ చూసేలా చేసేవి కూడా అవే. ఇంత చెత్త సిరీస్ ను రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్ తో తీసిన నిర్మాతలను మెచ్చుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
రొమాంటిక్ సీన్స్
ప్రొడక్షన్ వేల్యూస్
మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే, రైటింగ్
సాంగ్స్, మ్యూజిక్
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా గుర్తుకు రావడం
నటీనటుల పనితీరు:
రిజెక్ట్ ఎక్స్ గ్యాంగ్‌లో సెహమత్ పాత్రలో నటించిన సాధికా స్యాల్ ఉన్నంతలో బాగా చేసింది. ఆరవ్ పాత్రతో పాటు మరో సర్‌ప్రైజ్ క్యారెక్టర్ చేసిన అహ్మద్ వలి హిందీ హీరోలను ఇమిటేట్ చేయడానికి ట్రై చేశాడు. వైస్ ప్రిన్సిపాల్ పాత్రలో సుమిత్ వ్యాస్ బాగా నటించారు. ఇవెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఈషా గుప్తా జస్ట్ ఓకే. పాత్రకు అవసరమైన సీరియస్‌నెస్ చూపించడంలో ఫెయిల్ అయింది. మిగతా వాళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అమ్మాయిలు నటన మీద కంటే అందాల ప్రదర్శన మీద ఎక్కువ దృష్టి పెట్టారు.
తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్: వెబ్ సిరీస్ కాబట్టి ఇంట్లో కూర్చుని ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. అయినా సరే మొదటి నాలుగైదు ఎపిసోడ్స్ భరించడం కష్టమే. ఎంత ఫార్వర్డ్ చేసినా విసిగిస్తుందీ వెబ్ సిరీస్. ఓ మూడు గంటలు ఓపిగ్గా కూర్చుని చూడడం కష్టమే.