వెంకీ - మీనా.. డబుల్ హ్యాట్రిక్ కొట్టేనా!
on Nov 23, 2021

తెలుగువారిని విశేషంగా అలరించిన వెండితెర జంటల్లో విక్టరీ వెంకటేశ్ - అభినేత్రి మీనా జోడీ ఒకటి. `చంటి`(1992) వంటి ఇండస్ట్రీ హిట్ తో మొదలైన ఈ జంట ప్రయాణం.. ఆపై `సుందరకాండ` (1992), `అబ్బాయి గారు` (1993), `సూర్యవంశం` (1998), `దృశ్యం` (2014) వరకు దిగ్విజయంగా సాగింది. కలిసి నటించిన ప్రతీ సినిమాతోనూ హిట్ కొట్టడం అనేది ఒక రకంగా అరుదైన అంశమే. అలా.. వెంకీ - మీనా జోడీ ఐదు బ్లాక్ బస్టర్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంది.
కట్ చేస్తే.. `దృశ్యం` సీక్వెల్ `దృశ్యం 2`తో మరోమారు ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది ఈ ఎవర్ గ్రీన్ హిట్ పెయిర్. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్.. ఈ నెల 25న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. గత ఐదు చిత్రాలతో థియేటర్స్ వేదికగా సెన్సేషన్ క్రియేట్ చేసిన వెంకీ - మీనా జంట.. డబుల్ హ్యాట్రిక్ కి మాత్రం అనూహ్య పరిస్థితుల్లో ఓటీటీ బాట పట్టింది. మరి.. వేదిక మారినా వేడుక చేసుకునే విజయాన్ని ఈ సెన్సేషనల్ కాంబో సొంతం చేసుకుంటుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



