కేసిఆర్ ప్రమాణస్వీకారంపై వర్మ సెటైర్లు
on Jun 2, 2014
రాంగోపాల్ వర్మ, వివాదస్పద వ్యాఖ్యలు చేస్తారని ఒకరంటే, వాటిలో ఎంతో నిజం ఉందని మరొకరంటుంటారు. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్ ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న హడావుడి గురించి ఆయన సూటిగా కొన్ని ప్రశ్నలు గుప్పించారు. కెసిఆర్‌నే కాదు, ప్రజలను, నాయకులను కూడా ఆయన ప్రశ్నించారు. గతంలో పదవులు చేపట్టిన నాయకులే ఇప్పుడు పదవీ స్వీకారం చేస్తున్నారు. అప్పుడు ఇచ్చిన హామీలు వీరు నిలబెట్టుకోలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని ఇలాంటి నాయకులకు మళ్లీ ప్రమాణస్వీకారాలు ఎందుకు? ప్రమాణ స్వీకారాలకు అట్టహాసమైన వేడుకలు ఎందుకు? అసలు ప్రజలకు, నాయకులకు ప్రమాణస్వీకారాలు అంటే తెలుసా? అని వర్మ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన గురించి ఒక ఇంగ్లీష్ పేపరుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయనాయకులు, డాక్టర్లు, లాయర్లు మొదలైన వారు వృత్తి, అధికారం చేపట్టేటప్పుడూ చేసే ప్రమాణాలను మరిచి ప్రవర్తిస్తుంటే అలాంటి వారిపై విసుగు, అసహనం కలుగుతుందన్నారు. ప్రమాణ స్వీకారానికి ఉన్న విలువ దిగజారుస్తున్న వారందరిపై వర్మ ఇలా విరుచుకుపడ్డారు. వర్మ చెప్పిన మాటలు వినడానికి కటువుగా వున్నా అందులో యదార్థం మాత్రం ప్రజలందరికీ తెలిసిందే. ఈ విషయం గురించి ఆలోచిస్తే, ప్రమాణస్వీకారంపై చేసే అట్టహాసం, హడావుడి ఎలాగూ తప్పవు. ఆ తర్వాతైనా ప్రమాణాలు నిలబెట్టుకునే విషయంలో దృష్టి పెడితే బాగుంటుందనిపిస్తుంది.