టాలీవుడ్‌లో షూటింగులు కూడా బంద్
on Mar 16, 2020
కరోనా ఎఫెక్ట్ తెలుగు సినిమా తీరాన్ని తాకి చాలా గంటలు గడిచింది. 'ఆచార్య' చిత్రీకరణ వాయిదా వేసినట్టు శనివారం రాత్రి చిరంజీవి ప్రకటించారు. అంతకు ముందు తెలంగాణాలో థియేటర్లను బంద్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్న నాని 'వి', యాంకర్ ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'తో పాటు మరికొన్ని సినిమాలను వాయిదా వేశారు. స్వచ్ఛందంగా కొంతమంది షూటింగులను దూరంగా ఉండడం ప్రారంభించారు. అయితే... ఆదివారం తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, కళాకారుల సంఘం సంయుక్తంగా సమావేశమై కొన్ని రోజులు షూటింగులు కూడా బంద్ చేయాలని నిర్ణయించారు.
అవును... సోమవారం నుండి తెలంగాణలో తెలుగు సినిమా షూటింగులు జరగవు. సినిమాల్లో నటించే హీరో హీరోయిన్లు, నటీనటులతో పాటు కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మాత సి. కళ్యాణ్, నారాయణ దాస్ నారంగ్, దామోదరప్రసాద్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ, సెక్రటరీ జీవిత తదితరులు తెలిపారు.
ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ వాయిదా వేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కూడా ఆగింది. భారీ బడ్జెట్ సినిమా షూటింగులు కొన్ని రోజులుగా జరగడం లేదని సమాచారం. చిన్న సినిమాలు చేస్తున్నవారు కూడా షూటింగులు చేయడానికి ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.