ఫ్యాన్స్ కు సారీ చెప్పిన ప్రభాస్, రాజమౌళి
on May 28, 2015
ఈనెల 31న బాహుబలి ఆడియో, థియేటరికల్ ట్రైలర్ విడుదల చేయాలని రాజమౌళి టీమ్ ఇరవై రోజుల క్రితమే ప్లాన్ చేసింది. ఆడియో రైట్స్‌తో పాటు, ప్రసార హక్కులు భారీ రేట్లకు అమ్మేశారు. హైదరాబాద్ లోని హైటెక్స్‌ని వేదికగా ఎంచుకొన్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆడియో వేడుక వాయిదా పడిందట. ఆడియో లాంఛింగ్ అనుకున్న తేదీకి చేయలేకపోవడంతో బాహుబలి టీం మీడియా ముందుకొచ్చింది. వాయిదా వేస్తున్నందుకు అభిమానులకు క్షమాపణలు చెబుతూ అభిమానులందరినీ అనుమతించాలన్న ఉద్దేశంతో వాయిదా వేసినట్లు చెప్పుకొచ్చారు. కొద్దిమందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు అంటున్నారని…. ఆలస్యమైన ఫర్వాలేదు కానీ అందరినీ అనుమతించాలన్న ఉద్దేశంతో ప్రోగ్రాంను వాయిదా వేసుకున్నామని తెలిపారు.
ప్రభాస్ ఏమన్నాడంటే…
అభిమానులు అందర్నీ కలిసి రెండేళ్లయింది… సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అనుమతులు రాక బాహుబలి వేడుకను అనుకున్న తేదీకి చేయలేకపోతున్నాం. కొత్త తేదీని ప్రకటిస్తాం. అభిమానులందరికీ క్షమాపణలు
రాజమౌళి..
ఆడియో ఫంక్షనుకు కొంత మందిని మాత్రమే అనుమతి ఇస్తామని అంటున్నారు. కొందరిని మాత్రమే అనుమతించి మిగతా అభిమానులను నిరుత్సాహపరచలేం కదా… అందుకే వేడుకను వాయిదా వేయాల్సి వచ్చింది. ఫ్యాన్స్ కి క్షమాపణలు
ట్రయిలర్ రెడీ..: కాగా ఆడియో రిలీజ్ సందర్భంగా ప్రదర్శించడానికి ఫైనల్ ట్రైలర్ కట్ రెడీ చేసుకున్నారు. దానికి సంబంధించిన సెన్సార్ కూడా పూర్తయింది. ఈ ట్రైలర్ నిడివి 2 నిమిషాలు.
లైవ్ ప్రోగ్రాంకు డిమాండ్: ఆడియో ప్రోగ్రాంకు తమిళ, తెలుగు, హిందీ పరిశ్రమల నుంచి ప్రముఖులు రావాల్సి ఉండడంతో ఆడియో లైవ్ ప్రోగ్రాం రైట్స్ కు కూడా బాగా డిమాండ్ ఏర్పడింది. చిత్ర ఆడియో ప్రత్యక్ష ప్రసారాలను ప్రసారం చేసేందుకు అన్ని ఛానెల్స్ పోటీ పడ్డాయి. టీవీ5 ఛానల్ కోటి రూపాయలు చెల్లించి ప్రత్యక్ష ప్రసార హక్కులను సొంతం చేసుకుంది.
సినిమా రిలీజ్ జులై 10: తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా జులై 10న విడుదల చేస్తారని సమాచారం.
థియేటర్ల రికార్డు: బాహుబలి సినిమాను దేశవ్యాప్తంగా 3500 థియేటర్లలో రిలీజ్ చేస్తారని టాక్
ఇండియాలో పెద్దది.. ఇంటర్నేషనల్ లో చిన్నది: బాహుబలి సినిమా మొత్తం రెండు భాగాలు కలిసి 290 నిమిషాల నిడివి ఉంటుంది. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం సినిమా నిడివి తగ్గించి విడుదల చేస్తున్నారు.