మూవీ రివ్యూ : సుప్రీమ్
on May 5, 2016
అనగనగా ఓ రాజుగారు.. ఆయనకు ఏడు గురు కొడుకులు. వాళ్లంతా ఓరోజు వేటకెళ్లి ఏడు చేపలు తీసుకొచ్చారు. అందులో ఓ చేప ఎండలేదు..ఈ కథ వినీ వినీ మనకెంత బోర్ కొట్టిందో.. తెలుగు సినిమా కథలు చూసీ చూసీ అంతే బోర్ కొడుతోంది..ఎప్పుడూ ఇదే కథ? కొత్త కథలేం లేవా? అని ప్రేక్షకుడు అరచి గీ పెట్టినా, కాళ్లా వేళ్లా పడినా ఈ దర్శకులకు కనికరం లేకుండా పోయింది. మళ్లీ అదే ఓల్డ్ సీన్.. మళ్లీ అదే పాత కథ.
సుప్రీమ్‌లోనూ అదే రిపీట్ అయ్యింది. ఓ విలన్... ఓ కుర్రాడి కోసం వెదుకుతుంటాడు. వాడేమో హీరోకి కనిపిస్తాడు. ఆ హీరో ఆ పిల్లాడ్ని కాపాడతాడు. పాత పసివాడి ప్రాణం నుంచి... ఇప్పటి వరకూ ఎన్నిసార్లు చూశామో లెక్కలేదు. సుప్రీమ్ కూడా డిట్టో అంతే. దానికి అనిల్ రావిపూడి కామెడీ యాడ్ చేశాడు. సాయిధరమ్ తేజ్.. తన మావయ్యల నటన ఇమిటేట్ చేసి చూపించాడు. అంతకు మించి సుప్రీమ్‌లో ఏంలేదు. కావాంటే ఓ సారి రివ్యూ చదవండి. మీకే అర్థం అవుతుంది.
కథ:
ఈ కథ అనంతపురంలో మొదలవుతుంది. అక్కడ జాగృతి ఫౌండేషన్‌కి చెందిన వేల ఎకరాల భూమిని రైతులు సాగుచేసుకొంటుంటారు. వాటిపై విక్రమ్ సర్కార్ (కబీర్) కన్నుపడుతుంది. తప్పుడు డాక్యుమెంట్లతో వాటిని చేజిక్కించుకోవాలని చూస్తాడు. న్యాయ స్థానం కూడా విక్రమ్ సర్కార్‌దే రైట్ అంటుంది. కాకపోతే.. రైతులకు ఒక్క నెల రోజులు అవకాశం ఇస్తుంది. సరైన పత్రాలు సమర్పిస్తే.. భూమికి తిరిగి ఇచ్చేస్తామని షరతు విధిస్తుంద. అయితే ఆ ఆస్తులకు సంబంధించిన పూర్వీకుల్ని పట్టుకోవాలి. అందుకోసం నారాయణరావు ( సాయికుమార్) నడుం కడతాడు. ఈ ఆస్తి తాలుకూ వారసుల్ని కలుసుకొనే ప్రయత్నం చేస్తుంటాడు. కట్ చేస్తే కథ హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ బాలు (సాయిధరమ్) ఓ టాక్సీ డ్రైవర్ . జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటాడు. ఎస్సై బెల్లం శ్రీదేవి (రాశీఖన్నా)ని చూసి ఇష్టపడతాడు. ఈలోగా బాలుకి ఓ ఎనిమిదేళ్ల బాలుడు పరిచయం అవుతాడు. ఆ కుర్రాడు పరిచయమయ్యాక బాలుకి ఓ లక్ష్యం అంటూ ఏర్పడుతుంది. విక్రమ్ సర్కార్ కాజేయాలనుకొన్న ఆ వేల కోట్ల ఆస్తికి బాలుకీ సంబంధం ఏమిటి? ఆ పిల్లాడు ఎవరు? ఆ తరవాత ఏం జరిగింది? అన్నదే సుప్రీమ్ స్టోరీ.
విశ్లేషణ:
నాలుగు రీళ్లు గిర్రున తిరుగుతాయో లేదో... సినిమా కథేంటో అందరినీ టక్కున అర్థమైపోతుంది. ఇంట్రవెల్ బ్యాంగ్‌కే టోటల్ స్టోరీని అంచనా వేయొచ్చు. క్లైమాక్స్‌తో సహా! ఇలాంటప్పుడు దర్శకుడు తన తెలివి తేటలకు పదును పెట్టాలి. సన్నివేశాలు కొత్తగా రాసుకోవాలి. ఆ విషయంలో అనిల్ రావిపూడ కొంత వరకూ మాత్రమే సక్సెస్ అయ్యాడు. పటాస్‌లో కామెడీని నమ్ముకొని విజయం సాధించిన అనిల్..ఈ సినిమాలోనూ దాన్నే నమ్ముకొన్నాడు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, హీరోయిన్ ఇంటి విషయాలు, వెన్నెల కిషోర్.. వీళ్లంతా కథకు సంబంధం లేని, అక్కర్లేని వ్యవహారాలు. కాకపోతే.. ఈ సినిమాలో రిలీఫ్ పాయింట్లు అవే. తొలి భాగాన్ని కాపాడిందీ అదే. సినిమా డౌన్ అవుతోంది అనుకొన్నప్పుడల్లా ఏదో రూపంలో నవ్వులు పంచుతూ సినిమాలో విషయం లేదన్న విషయాన్ని కవర్ చేశాడు. అయితే.. ఈ కవరింగ్ ఇంట్రవెల్ వరకే సక్సెస్ అయ్యింది. పిల్లాడ్ని వెదుక్కొంటూ హీరో బయల్దేరడం, ఆ తరవాత అనుకొన్న లక్ష్యాన్ని సాధించడం.. ఇవి తప్ప సెకండాఫ్‌లో చెప్పడానికి ఏం మిగల్లేదు. దాంతో శ్రీనివాసరెడ్డి, పోసానిలను ఇరికించి సినిమాని లాగే ప్రయత్నం చేశాడు. దివ్యాంగుల ఫైట్ కూడా అలాంటిదే. సెకండాఫ్ మొత్తం ఛేజింగులు, ఫైటింగులే. దాంతో కామెడీ కరువైపోయింది. పాటలూ బోరింగ్‌గానే సాగాయి. అందం ఇందోళం పాటని రీమిక్స్ పేరుతో చెడగొట్టారు. మిగిలిన పాత్రలూ నామమాత్రమే. అయితే ఆ పాటల్లో సాయి స్టెప్పులు బాగున్నాయనిపించాయి. తొలి భాగంలో కామెడీ సీన్లు, రెండో భాగంలో చిన్నపిల్లాడిపై తీసిన సీన్లు బాగున్నాయి. అంతే.. వాటి కోసం ఈ సినిమా చూడాలి.
పెర్ఫామెన్స్:
నటీనటుల విషయానికొస్తే సాయిధరమ్ తేజ్.. యాజ్ ఇట్ ఈజ్ బాగా చేశాడు. అతని కామెడీ టైమింగ్ చూస్తుంటే.. రౌడీ అల్లుడు రోజుల్లోని చిరంజీవి గుర్తుకు రావడం సహజం. మేనమామల్ని అనుకరిస్తూ, వాళ్ల ఫొటోల్ని చూపిస్తూ, వాళ్ల పాటల్ని వాడుకొంటూ ఇంకా ఎన్ని రోజులు నెట్టుకొస్తాడో చూడాలి. రాశీఖన్నా పాత్ర నామమాత్రమే. అయితే ఫస్టాఫ్ కామెడీ పంచడానికి ఆ క్యారెక్టర్ హెల్ప్ అయ్యింది. పిల్లాడిగా కనిపించిన బాల నటుడు బాగా నటించాడు. అతని పాత్ర అందర్నీ ఆకట్టుకొంటుంది. కామెడీ సీన్లు.. బిట్లు బిట్లుగా చూస్తే బాగున్నాయి. అవి కూడా లేకపోతే... ఈ సినిమా ఏమైపోదునో. కమెడియన్లంతా తమ టైమింగ్‌తో ఆకట్టుకొన్నారు. కబీర్ స్టైలీష్‌గా కనిపించాడు. అంతకు మించి చేసిందేం లేదు.
టెక్నికల్ గా :
సాయికార్తీక్ సంగీతం బోర్ కొట్టించింది. అన్ని బాణీలూ ఎక్కడో విన్నట్టు అనిపించినవే. అందం ఇందోళం పాటని ఎందుకు రిమిక్స్ చేశారో వాళ్లకే తెలియాలి. సాంకేతికంగా సినిమా రిచ్‌గానే ఉంది. సెకండాఫ్‌లో తీసిన కార్ ఛేజింగ్ ఆకట్టుకొంటుంది. అనిల్ రావిపూడి సెకండాఫ్ నుంచి పట్టు వదిలేశాడు. కథపై మరింత కసరత్తు చేస్తే బాగుంటుంది.సుప్రీమ్ ఓ సాదా సీదా కథ. అక్కడక్కడ వినోద సన్నివేశాలు వర్కవుట్ అయ్యాయి. దాంతో కాలక్షేపం అయిపోవొచ్చు. దిల్‌రాజు నుంచి ప్రేక్షకులు కోరుకొనేది ఇలాంటి టైమ్ పాస్ సినిమాలు కావు. బ్లాక్ బ్లస్టర్లు. కథకి ప్రాధాన్యం ఇస్తాం అని చెప్పే దిల్‌రాజు కూడా కథ లేకుండా చేసిన ప్రయత్నం విస్మయం కలిగించింది.
తెలుగు వన్ వ్యూ :
కథ గురించి, లాజిక్కుల గురించి పెద్ద పట్టింపు లేకపోతే టైంపాస్ గా చూసేయచ్చు.
రేటింగ్: 2.5/5