నోరు విప్పినందుకు... అప్రకటిత నిషేధం!?
on Dec 12, 2018

'మీ టూ' ఉద్యమం దక్షిణాదిలో మొదలయ్యే ముందు వరకూ శృతి హరిహరణ్ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. యాక్షన్ కింగ్ అర్జున్ సరసన 'కురుక్షేత్రం'లో నటించినా.. ఆమెను ఎవరూ పెద్దగా గుర్తించలేదు. 'కురుక్షేత్రం' చిత్రీకరణలో భాగంగా తనతో అర్జున్ అసభ్యంగా ప్రవర్తించాడని శృతి హరిహరణ్ కొన్ని రోజుల క్రితం బయట పెట్టారు. పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లి కేసులు పెట్టారు. 'మీ టూ' ఉద్యమంలో శృతి ఆరోపణలు చర్చనీయాంశం అయ్యాయి. ఆమెకు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా కొందరు మాట్లాడారు. అయితే... సదరు వివాదం తరవాత ఆమెపై సినిమా పరిశ్రమలో అప్రకటిత నిషేధం విధించారని శృతి హరిహరణ్ తాజా మాటలను బట్టి తెలుస్తుంది. "ప్రస్తుతం నాతో పని చేయాలని ఎవరూ కోరుకోవడం లేదు. ఇటీవల నేను నోరు విప్పినందుకు ('మీ టూ' ఉద్యమంలో) ఈ పరిస్థితి. కొన్ని నెలల క్రితం వరకూ వారంలో కనీసం మూడు అవకాశాలు నా దగ్గరకు వచ్చేవి. వాటిలో నచ్చిన సినిమాను ఎంపిక చూసుకునేదాన్ని. ఇప్పుడు ఒక్కటి కూడా రావడం లేదు. నేను నటించిన కమర్షియల్ సినిమా ఒకటి సెప్టెంబరులో విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. హిట్ తరవాత కూడా అవకాశాలు రాకపోవడానికి కారణం అప్పుడు మాట్లాడటమే. అప్పుడు నోరు మూసుకుని వుంటే ఇప్పుడు ఏదో కొత్త సినిమా కబురు చెప్పేదాన్ని" అని శృతి హరిహరణ్ పేర్కొన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



