షేర్‌ఖాన్.... మళ్లీ పుడతాడా..??
on Oct 9, 2014
ఓ కంచు కంఠం మూగబోయి, ఓ ఉక్కుపిడికిలి మసిగా మారి, ఓ రియల్ స్టార్ చుక్కల సరసన చేరి యేడాదయ్యింది..
రియల్ స్టార్ శ్రీహరి లేని లోటు పూడ్చే ప్రయత్నాలు మొదలెట్టి చిత్రపరిశ్రమకు ఏడాది..!!
శ్రీహరి ఉంటే బాగుణ్ణు... అంటూ ఎన్ని పాత్రలు కోరుకొన్నాయో...?
రియల్‌స్టార్ కోసం ఎన్ని పాత్రలు పుట్టి, మధ్యలోనే వెక్కి వెక్కి యేడ్చాయో..?? చాలామంది నటులకు ప్రత్యామ్నాయాలు ఈజీగా దొరికేస్తాయి. ఈ హీరో కాకపోతే మరో హీరో అంటూ దర్శకులూ సర్దుకుపోతుంటారు. కానీ... శ్రీహరిలాంటి నటులకు ప్రత్నామ్నాయాలు దొరకవు. ఆ మాటకొస్తే ఉండవు కూడా!
ఎక్కడ బాలానగర్ మోటారు షెడ్డు..?? ఇంకెక్కడ సినిమా స్టార్ హోదా..?
చాలా మెట్లెక్కాలి. డక్కా ముక్కీలు తినాలి. ఎదురు దెబ్బలు తట్టుకోవాలి. శ్రీహరి బాడీ గట్టిదనే విషయం.. అతని ఎదుగుదలలోనే తేలిసిపోయింది.
శోభన థియేటర్లో షోలు మీద షోలు చూసి.. సినిమా స్టారైపోవాలన్న కలల్ని నిజం చేసుకోవడానికి శ్రీహరి... చిన్న సైజు యుద్ధమే చేశాడు. పరిస్థితులతో, తనతో, తన పోటీ దారులతో! జోకర్, గుంపులో ఒకడు, విలన్ బామ్మర్ది, కామెడీ విలన్... భయంకరమైన విలన్ - ఇలా ఒకొక్క మెట్టూ తానే నిర్మించుకొన్నాడు. హీరోగా శిఖరం ఎక్కాడు.
శ్రీహరికి పోలీస్ అవ్వాలని ఉండేది. జిమ్నాస్టిక్స్‌లో ఛాంపియన్ కదా..? స్పోర్ట్స్ కోటాలో పోలీస్ ఉద్యోగం కూడా వచ్చింది. ఎస్ ఐని చేస్తామంది డిపార్ట్‌మెంట్. కానీ సీఐ ఇస్తేనే గానీ జాయిన్ కాను అన్నాడు. అప్పట్లో శ్రీహరి మొండిపంతం చూసి చాలామంది పెదవి విరిచారు. ఆ మొండితనమే లేకపోతే పోలీస్ డిపార్ట్ మెంట్ ఓ మంచి ఎస్.ఐని చూసేది. తెలుగు సినిమా మాత్రం ఓ మంచి నటుడ్ని కోల్పోయేది.
నిజ జీవితంలో పోలీస్ డ్రస్ వేయలేదు గానీ, సినిమాల్లో మాత్రం చాలాసార్లు వేసుకొన్నాడు. ఆ దుస్తుల్లో శ్రీహరిని చూస్తే భలే ముచ్చటేసేది. బుల్లెట్‌కి.. యూనిఫామ్ వేసినట్టే ఉండేది. హీరో పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్స్ అయ్యాడు. `విలన్ హీరోగా మారడం ఏంటి..?? ఈ దెబ్బతో విలన్ పాత్రలూ గోవిందా..?`` అనుకొన్నవాళ్ల నోళ్లు మూయించాడు శ్రీహరి. ఇలా తిరిగి అలా చూసేటప్పటికి మినిమం గ్యారెంటీ హీరో అయిపోయాడు. మాస్ ప్రేక్షకులకు శ్రీహరి ఫైటింగులకు ఫిదా అయిపోయింది. ఏ బాలానగర్‌లో శోభన థియేటర్‌లో సినిమా చూసేవాడో, అదే బాలానగర్ శోభన థియేటర్‌కి శ్రీహరి హీరోగా వెళ్లాడు. ఇంతకంటే ఏం కావాలి..??
శ్రీహరి మాట్లాడితే ఫైట్ చేసినట్టుండేది
ఫైట్ చేస్తే యుద్ధమే.. ఆ డైలాగులకు థియేటర్లు దద్దరిల్లేవి. క్రమంగా మాస్ ఆరాధించే హీరో అయిపోయాడు శ్రీహరి. ఆ తరవాత అన్నీ అలాంటి పాత్రలే. పోలీస్.. గుండా, అరచుకోవడాలూ, భారీ ఫైటింగులూ.. ఓహ్.. రొటీన్ అయిపోయింది. శ్రీహరి సినిమా అంటే ఇంతేనేమో అని ప్రేక్షకులూ ఫీల్ అవ్వడం మొదలెట్టారు. ఈ మెనాలిటీని బ్రేక్ చేయడానికి శ్రీహరికి ఎంతో కాలం పట్టలేదు. ఢీ, మహానంది, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కింగ్... ఇలా సహాయక పాత్రలవైపు దృష్టిపెట్టాడు. సపోర్టింగ్ పాత్రలంటే చిన్నబుచ్చినట్టు అవుతుంది. అతను ఓ పిల్లర్. ఒక్కోసారి ఆ సినిమా మొత్తానికి హీరోనే అతడు. ఇక మగధీరలో షేర్‌ఖాన్‌గా చెరగని ముద్రవేశాడు. ఓ చరిత్ర సృష్టించాడు. `ఈ సినిమాతో రిటైర్ అయిపోయినా ఫర్లేదు` అని శ్రీహరే సంతృప్తిపడినంత పాత్ర అది.
అయితే చిత్రసీమ మాత్రం శ్రీహరి ని వదల్లేదు. తమ సినిమాకి బలం కావాలి, బలగం కావాలి అనుకొంటే శ్రీహరి దగ్గరకే పరిగెట్టేవాళ్లు. చిన్నా పెద్దా ఏ సినిమా అయినా శ్రీహరి నో చెప్పలేదు. కోటి పారితోషికం తీసుకొన్న సందర్భాలున్నాయి.. సినిమా నష్టాల్లో ఉంటే తీసుకొన్న పారితోషికాన్నే తిరిగిచ్చిన సంఘటనలూ ఉన్నాయి. ఇవ్వడం అంటే శ్రీహరికి ఎంతిష్టమో. పాత్రలకు ప్రాణాలిచ్చేవాడు. తనని నమ్ముకొన్న వ్యక్తులకు అభయ హస్తం అందించేవాడు. జూబ్లిహిల్స్‌లోని శ్రీహరి ఇల్లెప్పుడూ ఓ మినీ సత్రంలా ఉండేది. వచ్చిపోయేవాళ్లు, భోజనాలు చేసేవాళ్లు.. అక్కడో జాతరే.
శ్రీహరి చేయాల్సిన పాత్రలు అలానే ఉన్నాయి
దర్శకుల మదిలో, వారి రాతల్లో శ్రీహరి ఇంకా ఉన్నాడు..
కానీ శ్రీహరే లేడు!
ఆ పాత్రల్ని బతికించడానికైనా, ఆ డైలాగుల్లో పౌరుషం నింపడానికైనా శ్రీహరి మళ్లీ రావాలి! షేర్‌ఖాన్ మళ్లీ పుట్టాలి..
(ఈరోజు రియల్‌స్టార్ శ్రీహరి తొలి వర్థంతి సందర్భంగా)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
