ENGLISH | TELUGU  

ద‌ర్శ‌కుడుగా ఆయ‌న స్పృశించ‌ని అంశం లేదు!!

on Feb 23, 2019

 టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్ను మూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం తనువు చాలించారు. ఆయన మృతితో టాలీవుడ్‌ శోక సంద్రంలో మునిగింది. పలువురు సినీ, రాజ‌కీయ  ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్ర‌క‌టించారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం మ‌హాప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌నున్నారు. ఈయ‌న‌కు భార్య ప‌ద్మ‌, ఇద్ద‌రు కూతుళ్లు దీప్తి, ప్ర‌వ‌ళిక లు ఉన్నారు. 130 కు పైగా సినిమాలు చేసి తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర‌ను ఏర్ప‌రుచుకున్నారు.  ఫాంటాసి చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన శైలి భిన్నమని అమ్మోరు, దేవి, అరుంధతి లాంటి సినిమాలను చూస్తే తెలుస్తుంది.

 పాల‌కొల్లులో ప్రారంభ‌మై...

పాల‌కొల్లులో న‌ర‌సింహా మూర్తి, చిట్టెమ్మ దంప‌తుల‌కు జ‌న్మించారు. ఆయ‌న ప్రాథ‌మిక విద్య పాలకొల్లులో జ‌రిగింది.  చిన్న‌త‌నము నుండే నాట‌ల‌కాల‌పై ఆస‌క్తి పెంచుకున్న కోడి రామ‌కృష్ణ  డిగ్రీ పూర్త‌య్యాక సినిమాల్లోకి వ‌చ్చి ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.  దాస‌రి `తాత మ‌న‌వ‌డు` సినిమా చూసి ఇన్ స్పైర్ అయినా కోడి రామ‌కృష్ణ ఆయ‌న ద‌గ్గ‌ర శిష్య‌రికం చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రి ఆయ‌న ద‌గ్గ‌ర చేరారు.   దాస‌రి వ‌ద్ద ఐదేళ్ల‌కు పైగా శిష్య‌రికం చేసి ఆయ‌న‌కు ప్రియ శిష్యుడుగా మారారు.  దాస‌రిని ద‌ర్శ‌కుడుగా ప‌రిచయం చేసిన నిర్మాత రాఘ‌వ‌గారే `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య` సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా కోడిరామ‌కృష్ణ‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశారు.  

 తొలి విజ‌యంతో...

 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోడి రామ‌కృష్ణ  `ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌` చిత్రంతో ద‌ర్శ‌కుడుగా మారారు. ఈ చిత్రం 525 రోజులు ఆడింది.  తొలి చిత్రంతో నే తిరుగులేని స‌క్సెస్ ను అందుకుని చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఆక‌ర్షించారు. ఇక అప్పటి నుంచి వెన‌క్కి మ‌ళ్లీ చూసుకోలేదు.  త‌రంగిణి, తలంబ్రాలు, మువ్వ‌గోపాలుడు, ముర‌ళీకృష్ణుడు, ముద్దుల మావ‌య్య‌, ముద్దుల మేన‌ల్లుడు, మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, 20వ శ‌తాబ్దం , అంకుశం, శ్రీనివాస క‌ళ్యాణం, దేవి, దేవుళ్లు, పంజ‌రం, పెళ్లాం చెబితే వినాలి, పెళ్లి కానుక‌, పెళ్లి పందిరి, పుట్టింటికి రా చెల్లి, భార‌త్ బంద్, పోలీస్ లాక‌ప్ , పెళ్లి, మ‌న్నెంలో మొన‌గాడు, అమ్మోరు, రిక్షావోడు, లాఠీ చార్జ్, శత్రువు, అరుంధ‌తి ఇలా వ‌రుస విజ‌యాల‌తో ద‌ర్శ‌కుడుగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. క‌న్న‌డ‌లో ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నాగ‌రాహు ఆయ‌న ఆఖ‌రి చిత్రం. ఈ సినిమా తెలుగులో నాగ‌భ‌ర‌ణం గా విడుద‌లైంది.

ఆయ‌న స్పృశించ‌ని అంశం లేదు...

ద‌ర్శ‌కుడుగా 35 ఏళ్ల కెరీర్ లో ద‌ర్శ‌కుడిగా కోడి రామ‌కృష్ణ స్పృశించ‌ని అంశం అంటూ లేదు. ఫ్యామిలీ, ఫాంట‌సీ, యాక్ష‌న్‌, పోలీస్‌, దేశ‌భ‌క్తి, భ‌క్తి , గ్రామీణ ఇలా భిన్న‌మైన ఇతివృత్తాల‌తో సినిమాలు చేసి ద‌ర్శ‌కుడుగా త‌న ప్ర‌తిభ నిరూపించుకున్నారు. ఆయన ఎప్పుడూ ట్రెండ్ కంటే ముందే ఉండేవారు. కొత్త‌గా ఆలోచించేవారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ హీరోగా వ‌చ్చిన సినిమాలు ఘ‌న విజ‌యాలు సాధించాయి. ఆయ‌న కెరీర్ కు ఎంతో ప్ల‌స్స‌య్యాయి.

ఎప్ప‌టికీ నిలిచిపోయే ...

ఇక అంకుశం, త‌లంబ్రాలు , ఆహుతి సినిమాలు రాజ‌శేఖ‌ర్ కెరీర్ లో మైలు రాళ్ల‌లా నిలిచిపోయాయి. ఖాకీ చిత్ర‌మంటే అంకుశ‌మే అనేలా ఆ సినిమా నిలిచిపోయింది.  అర్జున్ హీరోగా `మా ప‌ల్లెలో గోపాలుడు` , మ‌న్నెంలో మొన‌గాడు, మా ఊరి మారాజు, మ‌న‌వ‌డొచ్చాడు, పుట్టింటికి రా చెల్లి చిత్రాలు భారీ స‌క్సెస్ అందుకున్నాయి.  సుమ‌న్, జ‌గ‌ప‌తి బాబు, భానుచంద‌ర్ ల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోయే చిత్రాలు ఇచ్చారు. ఇక చిరంజీవితో ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య చిత్రం త‌ర్వాత రిక్షావోడు, గూఢచారి నెం-1 చిత్రాలు చేసారు. దాస‌రి నారాయ‌ణ రావు, రాఘ‌వేంద్ర‌రావు త‌ర్వాత వంద చిత్రాల‌కు పైగా ద‌ర్శ‌కత్వం వ‌హించి పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించుకున్నారు.  తెలుగులో దాదాపు స్టార్ హీరోలంద‌రితో ఆయ‌న సినిమాలు చేసి స‌క్సెస్ లు చ‌వి చూసారు.

సోష‌ల్ రెస్పాన్స్ బులిటీతో...
 
క‌థ ఎటువంటిదైనా అందులో సామాజిక అంశాలు ఉండేలా చూసుకునే వారు కోడి రామ‌కృష్ణ‌. ఆయ‌న చిత్రాల్లో సామాజిక స్పృహ క‌లిగిన చిత్రాల్లో `అదిగో అల్ల‌దిగో ` చిత్రం ముందు వ‌రుస‌లో ఉంటుంది.  ఇందులో జోగిని వ్య‌వ‌స్థ గురించి అద్భుతంగా చూపించారు. వితంతు వ్య‌వ‌స్థ గురించి పంజ‌రం చిత్రంలో చ‌ర్చించారు.  ద‌ర్శ‌క రత్న దాస‌రి నారాయ‌ణ‌రావు స్పృశించ‌ని ఎన్నో అంశాల‌ను స్పృశించి గ‌రువుకి త‌గ్గ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు.  ఇలా ఆయ‌న అన్ని ర‌కాల సినిమాలు చేసారు.


       

 

గ్రాఫిక్స్ చిత్రాల‌కు శ్రీకారం...

`అమ్మోరు` సినిమా త‌ర్వాత తెలుగులో గ్రాఫిక్స్ చిత్రాల‌కు తెర‌తీసింది కోడిరామ‌కృష్ణ‌. ఆ త‌ర్వాత వ‌చ్చిన దేవి , దేవి పుత్రుడు, దేవుళ్లు , అరుంధ‌తి,  నాగ‌భ‌ర‌ణం చిత్రాలు గ్రాఫిక్స్ మాయా జాలంతో ఆడియ‌న్స్ ను అల‌రించాయి. విజువ‌ల్ ఎఫెక్ట్ట్స్ ను త‌ను వాడినంత‌గా మ‌రి వేరే ఎవ‌రూ వాడ‌లేద‌న‌డంలో సందేహం లేదు.

ప‌లు అవార్డులు, రివార్డులు వ‌రించాయి...

కోడి రామ‌కృష్ణ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అజాత శ‌త్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఇంత వ‌ర‌కు ఆయ‌న‌పై ఎలాంటి వివాదం, విమ‌ర్శ లేదు. సినిమా  త‌ప్ప ఆయ‌న‌కు మ‌రో ప్ర‌ప‌పంచం తెలియ‌దు.  నిర్మాత‌ల ప‌ట్ల ఎంతో గౌర‌వంగా ఉండేవారు. నిర్మాత‌ల ద‌ర్శ‌కుడాయ‌న‌. నిర్మాతలు సినిమాల విష‌యంలో ఎంత ప‌ట్టించ‌కుంటే అంత మంచి సినిమాలు వ‌స్తాయ‌నేవారు.  తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో కూడా సినిమాలు చేసారు. 2012లో ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం అందుకున్నారు. అలాగే ప‌లు సినిమాల‌కు గానూ 10 నంది అవార్డ్స్,  రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.