అప్పుడు చరణ్ ``నా కోసం``.. ఇప్పుడు చిరు ``శానా కష్టం``..!
on Jan 4, 2022

ఒక పాపులర్ సాంగ్ స్ఫూర్తితో మరికొన్ని పాటలు వెలుగులోకి రావడం చిత్ర పరిశ్రమలో కొత్తేమీ కాదు. అలా.. స్వర మాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ బాలీవుడ్ డెబ్యూ మూవీ `రంగీలా` (1995)లోని ఊర్మిళ సోలో సాంగ్ ``యాయిరే యాయిరే`` కూడా స్ఫూర్తిగా నిలుస్తూ వార్తల్లో నిలుస్తోంది. యథాతథంగా కాకుండా.. ఆ పాట బాణీని గుర్తుచేస్తూ ఇటీవల కాలంలో తెలుగులోనూ రెండు పాటలు వచ్చాయి. విశేషమేమిటంటే.. ఆ రెండింటిలోనూ ఫిమేల్ సింగర్ ఒకరే కాగా.. రెండు సినిమాలు కూడా కొణిదెల తండ్రీతనయుల కోసం స్టార్ కంపోజర్స్ ట్యూన్స్ చేసిన పాటలే.
ఆ వివరాల్లోకి వెళితే.. 2009 నాటి సెన్సేషనల్ మూవీ `మగధీర` కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పై చిత్రీకరించిన ``నా కోసం`` గీతాన్ని పరిశీలిస్తే.. ఇందులో ``యాయిరే యాయిరే`` గీతం తాలూకు ట్యూన్ గుర్తుకు రాక మానదు. స్వరవాణి కీరవాణి బాణీకట్టిన ఈ గీతాన్ని దీపుతో కలిసి గీతామాధురి ఆలపించింది. కట్ చేస్తే.. తాజాగా విడుదలైన ``శానా కష్టం`` పాటలోనూ పల్లవిలోని మొదటి రెండు లైన్స్ ``కల్లోలం కల్లోలం`` అనే చోట ``యాయిరే యాయిరే`` ట్యూన్ టచ్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, రెజీనాపై `ఆచార్య` కోసం చిత్రీకరించిన ఈ పార్టీ సాంగ్ కి స్వరబ్రహ్మ మణిశర్మ బాణీకట్టగా.. రేవంత్ తో కలిసి గీతామాధురినే గానం చేయడం విశేషం.
Also read: శానా కష్టం'గా పాడిన గీతా మాధురి! 'రంగీలా' సాంగ్ స్టైల్‌లో మొదలైంది!!
మొత్తమ్మీద.. చిరు, చరణ్ తొలిసారిగా కలిసి కనిపించిన `మగధీర`లోనూ.. అదే చిరు, చరణ్ పూర్తిస్థాయిలో కలిసి నటించిన `ఆచార్య`లోనూ ఒకే ట్యూన్ స్ఫూర్తితో పాటలు రూపొందడం.. వాటిని ఒకే గాయని పాడడం ఆసక్తిని రేకెత్తించే అంశమే. మరి.. `రంగీలా` సెంటిమెంట్ తోడై `మగధీర` తరహాలో `ఆచార్య` కూడా బాక్సాఫీస్ సెన్సేషన్ అవుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



