`సంక్రాంతి` రాజు వర్సెస్ `సంక్రాంతి` రాజు!
on Jan 4, 2022

ఆ ఇద్దరు కూడా స్టార్ ప్రొడ్యూసర్సే. ఇద్దరి పేరులోనూ `రాజు` ఉంటుంది. అంతేకాదు.. ఇద్దరికి కూడా ఒక సీజన్ భలేగా అచ్చొచ్చింది. అయితే, ఎప్పుడు కూడా ఆ సీజన్ లో ఈ ఇద్దరు పోటీ పడింది లేదు. కట్ చేస్తే.. ఈ సంవత్సరం తమ లక్కీ సీజన్ లో ఈ ఇద్దరు పోటీకి సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ ప్రముఖులెవరంటే.. ఎమ్మెస్ రాజు, `దిల్` రాజు. ఆ సీజన్ ఏమో.. సంక్రాంతి.
ఆ వివరాల్లోకి వెళితే.. `శత్రువు` (1991), `ఒక్కడు` (2003), `వర్షం` (2004), `నువ్వొస్తానంటే నేనొద్దాంటానా` (2005), `మస్కా` (2009) వంటి విజయవంతమైన చిత్రాలతో `సంక్రాంతి రాజు`గా పేరొందిన మెగా ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు.. ఈ ఏడాది అదే పొంగల్ సీజన్ కి `7 డేస్ 6 నైట్స్` చిత్రంతో పలకరిస్తున్నారు. తమ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్ సమర్పణలో రాజు దర్శకత్వంలోనే రూపొందిన ఈ చిత్రంలో అతని తనయుడు సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు.
ఇక ఇదే సీజన్ లో `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` (2013), `ఎవడు` (2014), `శతమానం భవతి` (2017), `ఎఫ్ 2` (2019), `సరిలేరు నీకెవ్వరు` (2020) (సహ నిర్మాణం) వంటి సక్సెస్ ఫుల్ వెంచర్స్ తో `సంక్రాంతి` రాజుగానూ పేరు గడించిన స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు.. ఈ ఏడాది తన సోదరుడి తనయుడు ఆశిష్ ని హీరోగా పరిచయం చేస్తూ `రౌడీ బాయ్స్` చిత్రంతో పొంగల్ లో ఎంటర్టైన్ చేయనున్నారు. మరి.. `సంక్రాంతి` రాజు వర్సెస్ `సంక్రాంతి` రాజు అన్నట్లుగా ఉన్న ఈ పోటీలో.. ఇద్దరూ విజయపథంలో పయనిస్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



