ప్రభాస్ 'రాధేశ్యామ్'పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి లేదా?
on Jan 4, 2022

'బాహుబలి' సిరీస్ తో ప్రభాస్ ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సినిమా వస్తుందంటే భాషలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. 'బాహుబలి' తర్వాత వచ్చిన 'సాహో' సినిమా కంటెంట్ పరంగా నిరాశపరిచినప్పటికీ.. కలెక్షన్స్ పరంగా మాత్రం నార్త్ లో దుమ్ము దులిపింది. ప్రభాస్ కేవలం తన స్టార్డంతోనే ఆ కలెక్షన్స్ రాబట్టాడన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు అంటుంటారు. కానీ ప్రభాస్ మాత్రం రచ్చ గెలిచి ఇంట గెలవలేకపోతున్నాడని అనిపిస్తోంది. ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్'కి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకనో ఆశించిన స్థాయిలో హైప్ రావట్లేదు.
'రాధేశ్యామ్' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ కి తెలుగులో ఎందుకనో అంతగా రెస్పాన్స్ రావట్లేదు. పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' తో పాటు టాలీవుడ్ నుండి వస్తున్న మరో రెండు సినిమాలు 'భీమ్లా నాయక్', 'ఆచార్య'తో పోల్చితే 'రాధేశ్యామ్' సాంగ్స్ కి యూట్యూబ్ లో అంతగా రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. 'ఆర్ఆర్ఆర్' నాటు నాటు సాంగ్ కి 60 మిలియన్ కి పైగా వ్యూస్, దోస్తీ సాంగ్ కి 30 మిలియన్ కి పైగా తెలుగులో వ్యూస్ వచ్చాయి. కానీ రాధేశ్యామ్ నుండి విడుదలైన ఒక్క సాంగ్ కూడా తెలుగులో ఇప్పటిదాకా 20 మిలియన్ వ్యూస్ సాధించలేకపోయింది. పాన్ ఇండియా సినిమాలు కాకపోయినా 'భీమ్లా నాయక్', 'ఆచార్య' సినిమాలకు 'రాధేశ్యామ్'కి మించిన రెస్పాన్స్ వస్తుండటం విశేషం. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కి 70 మిలియన్ కి పైగా వ్యూస్, లాలా భీమ్లా సాంగ్ కి 30 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇక ఆచార్య నుంచి విడుదలైన 'లాహే లాహే' సాంగ్ కి అయితే 100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.
ట్రైలర్ పరంగానూ 'ఆర్ఆర్ఆర్'తో పోల్చితే 'రాధేశ్యామ్'కి యూట్యూబ్ లో వచ్చిన రెస్పాన్స్ తక్కువే. ఆర్ఆర్ఆర్ తెలుగు ట్రైలర్ కి 40 మిలియన్ కి పైగా వ్యూస్, హిందీ ట్రైలర్ కి 60 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. కానీ రాధేశ్యామ్ ట్రైలర్ కి మాత్రం తెలుగులో 30 మిలియన్ కి పైగా వ్యూస్, హిందీలో 40 మిలియన్ కి పైగా వ్యూస్ దక్కాయి.
బాహుబలి తరువాత ప్రభాస్ స్థాయి ఆకాశాన్ని తాకింది. ఆయన క్రేజ్ ని తక్కువ చేయలేము. కానీ అంతటి స్టార్ నటిస్తున్న రాధేశ్యామ్ కి అంతగా హైప్ రాకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. రాధేశ్యామ్ లవ్ స్టోరీ కావడం, సాంగ్స్ కూడా అంతగా ఆకట్టుకోకపోవడమే యూట్యూబ్ లో అంతగా రెస్పాన్స్ రాకపోవడానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా మళ్ళీ విజృంభిస్తుండటం, ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల తగ్గింపు వంటి ప్రతికూల పరిస్థితుల నడుమ.. తెలుగు రాష్ట్రాలలో అంతగా హైప్ రాని రాధేశ్యామ్ తో ప్రభాస్ ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



