'రష్మిక'కు బాధ కలిగించిన 'పుష్ప' ప్రీరిలీజ్ ఈవెంట్!
on Dec 13, 2021

ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో 'పుష్ప' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ ఈవెంట్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో అక్కడ తోపులాట జరిగి పలువురు ఫ్యాన్స్ గాయపడ్డారు. ఈ విషయం తనకు బాధ కలిగించిందని రష్మిక తాజాగా ట్వీట్ చేసింది.
"నిన్న జరిగిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అయితే ఈ ఈవెంట్ లో కొందరు గాయపడ్డారని ఇప్పుడే నాకు తెలిసింది. ఈ విషయం నాకు బాధ కలిగించింది. మీరందరూ ఆరోగ్యంగా ఉన్నానని భావిస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి" అంటూ రష్మిక ట్వీట్ చేసింది. రష్మిక ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రేక్షకుల పట్ల ఆమె చూపిస్తున్న కేరింగ్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

బన్నీ గత చిత్రం 'అల వైకుంఠపురములో' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లోనే జరిగింది. ఆ సెంటిమెంట్ ప్రకారమే పుష్ప వేడుకను అక్కడ నిర్వహించారు. ఈ వేడుకకి 'అల వైకుంఠపురములో' ఈవెంట్ కి మించి అభిమానులు తరలివచ్చారు. ఒకానొక సమయంలో వేదిక వద్దకు కూడా పెద్ద ఎత్తున రావడంతో బన్నీ స్పీచ్ కి కూడా కాస్త ఇబ్బంది కలిగింది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్పకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకి రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



