రామ్‌లీల రివ్యూ
on Feb 27, 2015
పెళ్లి గొప్పదా?? ప్రేమ గొప్పదా?? ఈ ప్రశ్నకు ఈతరం ప్రేమే గొప్పదని సమాధానం చెబుతుంది. తాళి కట్టిన భర్త కంటే.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడే మిన్న అంటూ స్టేట్‌మెంట్లు ఇస్తుంది. తాళికి ఎగతాళి చేయడం.. ఇప్పుడో ఫ్యాషన్. దాదాపుగా ఇప్పుడొస్తున్న కథలన్నీ.. ప్రేమ పైత్యంతో సంప్రదాయాల్ని మంటగలిపేవే. అయితే.. అందుకు భిన్నంగా తాళి విలువ చాటిన సినిమా రామ్ లీల. నువ్విలా, జీనియస్ సినిమాలతో.. కథానాయకుడిగా తొలి అడుగులు వేసిన హవీష్.. మాస్‌ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడీ చిత్రంతో. అతనికి ఈ సినిమా ఎంత వరకూ ప్లస్..??? దర్శకుడు తన తొలి అడుగులు ఎంత విజయవంతంగా వేశాడు?? అసలు రామ్ లీలలో టచ్ చేసిన పాయింట్ ఏమిటి??? చూద్దాం రండి.
క్రిష్ (అభిజిత్) అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటాడు. ఇంట్లో కోడలు పిల్ల కోసం.. కలవరిస్తుంటారు. అంతలో సశ్య (నందిత)ని ఓ టీవీ షోలో చూసి ఇష్టపడతాడు. ఆ తరవాత ఆమె వెంటపడతాడు. క్రిష్ అమ్మానాన్నలకూ సశ్య నచ్చుతుంది. సశ్య ఇంటికి వెళ్లి... సంబంధం అడుగుతారు. కుటుంబంతో పాటు క్రిష్ కూడా నచ్చడంతో పెళ్లికి ఓకే అంటుంది సశ్య. అయితే ఓ కండీషన్ పెడుతుంది. పెళ్లయ్యాక.. మలేసియాలో సెటిల్ అవ్వాలని. సశ్యపై ప్రేమతో అమెరికాలో జాబ్ మానేసి.. మలేసియా ట్రాన్స్‌ఫర్ అవుతాడు. ఓ వారం రోజుల పాటు సశ్యతో మలేసియా అంతా హనీమూన్ ట్రిప్ వేయాలని ప్లాన్ చేస్తాడు. కానీ సశ్య షాక్ ఇస్తుంది. నిన్ను పెళ్లి చేసుకొంది, మలేసియా తీసుకొచ్చింది.. ఇక్కడ కలసికాపురం చేయడానికి కాదు, నా ప్రియుడ్ని వెతుక్కోవడానికి.. అంటూ ఓ లెటర్ రాసి జంప్ అవుతుంది. సశ్యని మర్చిపోలేక.. ఒంటరిగా ఉండలేక.. ఒక్కడే హనీమూన్ ట్రిప్ కు బయల్దేరతాడు. పబ్‌లో జరిగిన ఓ సంఘటన ద్వారా రామ్ (హవీష్) పరిచయం అవుతాడు. అక్కడి నుంచి క్రిష్, రామ్ కలసి ప్రయాణం మొదలెడతారు. ఇంతకీ రామ్ ఎవరు?? సశ్య ఎవరి కోసం క్రిష్‌ని వదిలేసి వెళ్లిపోయింది..?? క్రిష్ కి సశ్య దొరికిందా, లేదా?? అనేదే రామ్ లీల స్టోరీ.
కథలో ఫ్రెష్ నెస్ ఉంది. మరీ కొత్త కథేం కాకపోయినా.. ట్విస్టుల వల్ల ఆసక్తిగా మారింది. కథలో రెండు మూడు ఇంట్రస్ట్రింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవేంటో తెరపై చూస్తేనే బాగుంటుంది. సినిమా అంతా సరదా, సరదాగా నడిపేస్తూ, ఎమోషనల్ టచ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు దర్శకుడు. చివరి ఐదు నిమిషాలూ.. హార్ట్ టచింగ్ గా సాగుతుంది. రోడ్ జర్నీ నేపథ్యంలో సాగే సినిమాలు చాలా వచ్చాయి. ఆ ప్రయాణంలో జీవితం గురించి, స్నేహం గురించి తెలుసుకోవడం, బంధాలకు ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవడం ఈ కథ వెనుక థ్రెడ్. ఒక విధంగా చెప్పాలంటే గమ్యం లాంటి కథన్నమాట. సినిమా ఎంత జాలీగా సాగిపోయినా.. అక్కడక్కడ ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల హార్ట్ టచ్ చేసే ప్రయత్నం చేశారు. పరస్పర భిన్నధృవాల్లాంటి ఇద్దరి వ్యక్తుల ప్రయాణం ఆసక్తిగా చెప్పే ప్రయత్నం చేశారు.
ఇది వరకు ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల్లో తాళి, పెళ్లి, సంప్రదాయం లాంటి మాటలకు అర్థాలు వినిపించేవి. ఆ ప్రయత్నం ఈ సినిమాలోనూ కనిపించింది. చివర్లో ఓ ఓమోషనల్ మూడ్‌కి తీసుకెళ్లి శుభం కార్డు వేశాడు దర్శకుడు. ఈ ముక్కోణపు ప్రేమకథలో ప్రేమ - పెళ్లి కి వేసిన తూకంలో దర్శకుడు పెళ్లినే గెలిచించి ఓ మంచి సంప్రదాయానికి నాంది పలికాడు.కథ ఎంత బాగున్నా, పాత్రల చిత్రణ ఎంత బాగున్నా... కథని నడిపే విధానం బాగుండాలి. అయితే దర్శకుడు అక్కడే పప్పులో కాలేశాడు. రెండు ట్విస్టుల మధ్య కథని నడపడంలో అతని బ్యాలెన్స్ తప్పింది. అలీ. సప్తగిరిల కామెడీ ట్రాక్ సినిమా లెంగ్త్ పూరించడానికి తప్ప ఎందుకూ ఉపయోగపడలేదు.అంతేకాదు.. ఈ కామెడీ వల్ల సినిమా పాయింట్ బ్యాలెన్స్ తప్పి.. ఎటో వెళ్లిపోయే ప్రమాదంలో చిక్కుకొంది. కథానాయిక, నాయకుల మధ్య కెమిస్ట్రీ అంతగా పండలేదు. దానికి తోడు అభిజిత్ - హవీష్ లమధ్య స్నేహం బలపడానికి ఏమైనా రెండు బలమైన సంఘటనలు చూపిస్తే బాగుండేది. చూపించిన రెండు ప్రేమకథల్లోనూ డెప్త్ లేదు. దాంతో పాయింట్ బలహీనపడింది. అయితే మళ్లీ పతాక సన్నివేశాలతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దాంతో కాస్త రిలీఫ్ కలుగుతుంది.
హవీష్ కి ఇది మూడో సినిమా. గత రెండు సినిమాలతో పోలిస్తే బెటర్ మెంట్ కనిపించింది. మాస్‌ని ఆకట్టుకొనేలా తన బాడీ లాంగ్వేజ్ నీ, డైలాగ్ డెలివరీనీ మార్చుకొన్నాడు. అల్లరి చేశాడు.. చివర్లో హార్ట్ టచింగ్ సీన్ లోనూ రాణించాడు. అతని గొంతు బాగుంటుంది. దాంతో మామూలు డైలాగ్ కూడా బాగా వినిపించింది. డాన్సుల్లోనూ కష్టపడ్డాడన్న విషయం అర్థం అవుతుంది. డీసెంట్ కథల్ని ఎంచుకొంటూ ముందుకు వెళ్తే.. తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది. అభిజిత్ ఓకే అనిపించాడు. నందితది అంత గొప్ప పాత్రేం కాదు. మాంటేజెస్లో ఎక్కువగా కనిపించింది. భానుచందర్, నాగినీడు ఓకే అనిపించారు. సప్తగిరి, అలీ కామెడీ గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది.
ప్రొడక్షన్ వాల్యూస్ అడుగడుగునా కనిపించాయి. ఎస్.గోపాలరెడ్డి కెమెరా పనితనం గురించి కొత్తగా చెప్పేదేముంది? మలేసియా, విశాఖ అందాల్ని అద్భుతంగా చూపించారు. చిన్నా అందించిన పాటల్లో రెండు బాగున్నాయి. రావే రావే రంగోలు రాణీ.. పాట మాస్‌కి నచ్చుతుంది. మిగిలినవన్నీ మెలోడీలే. విస్సు మాటల్లో కొన్ని ఆకట్టుకొన్నాయి. ప్రేమించిన వాళ్లను చాలామందిని చూశాగానీ, ప్రేమను మించిన వాడిని తొలిసారి చూశా.. అన్న డైలాగ్ బాగుంది. దర్శకుడిలో విషయం ఉంది. అయితే అనుకొన్న కథని పూర్తి స్థాయిలో ఆవిష్కరించలేకపోయాడు. స్ర్కీన్ ప్లేలో గందరగోళం ఉంది. దానికి తోడు అనవసరమైన నస తగ్గించుకొంటే మంచిది.
మొత్తానికి రామ్ లీల ఓకే అనిపిస్తుంది. అంచనాలు పెట్టుకొని వెళ్లకపోతే.. ఒక్కసారి ఈ సినిమా చూసేయొచ్చు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
