ఈ ఐస్ క్రీమూ... కరిగి'పాయె'
on Nov 22, 2014
సినిమా ఎలా తీయాలో పాఠాలు నేర్పించాడు రాంగోపాల్ వర్మ! ఇప్పుడు ఎలా తీయకూడదో... కూడా వర్మ సినిమాల్ని చూసి తెలుసుకోవాల్సివస్తోంది. తాజాగా మరో కళాఖండం వర్మ నుంచి వచ్చింది. అదే ఐస్ క్రీమ్ 2! ఐస్ క్రీమ్ తొలి భాగం చూసి జనం గగ్గోలు పెట్టారు. వర్మ మరీ ఇంత నాశిరకం సినిమాలు ఎలా తీయగలిగాడు....?? అంటూ ఆశ్చర్యపోయారు. ఐస్ క్రీమ్ చూడకుండా బతికిపోయిన అదృష్టవంతుల్ని వెతికి పట్టుకొని మరీ కక్ష్య సాధించాలని ఈ సినిమా తీసుంటాడు వర్మ. ఈ ఐస్ క్రీమూ చప్పగా, చేదుగా, భయంకరంగా ఉందంటే నమ్మండి. సినిమా అంతా అడవిలో చుట్టేశాడు. ఈ సినిమాలో క్వాంటిటీ క్వాలిటీ గురించి మాట్లాడుకొంటే కంగారొచ్చేస్తుంది మనకు. ఇది వరకు నితిన్‌తో వర్మ అడవి అనే మహాద్భుత సినిమా తీసి పారేశాడు. అఫ్ కోర్స్ వర్మపై జనాలకు ఉన్న నమ్మకం అప్పటి నుంచే పడిపోయిందనుకోండి. ఆ సినిమాని ఐస్ క్రీమ్ 2తో మరోసారి గుర్తు చేశాడు వర్మ. ఏ పాత్ర ఎందుకు ఎలా ప్రవర్తిస్తుందో... ఎందుకు ఎప్పుడు అరుస్తుందో, ఎందుకెప్పుడు మాయమవుతుందో... వర్మ కూడా చెప్పలేడేమో. అంత కంగాళీగా ఉందీ సినిమా. అడవిలో సినిమా తీయడానికి వెళ్లిన ఓ బృందంలో ఒక్కొక్కరూ మాయమైపోతుంటారు. వాళ్లని ఓ ముసుగు వీరుడు చంపేస్తుంటాడు. వాడెవడనేది వెతికి పట్టుకోవడమే ఐస్ క్రీమ్ 2 కథ. అరవింద్ 2 కాన్సెప్ట్ ఇదే. పాపం.. వర్మ ఆ సినిమా చూళ్లేదేమో..?? పాపం నవీన కాస్తో కూస్తో అందంగా ఉంటుంది. ఆ కాస్త అందాన్ని కూడా వర్మ తన కెమెరాలో బంధించలేకపోయాడు. చెడ్డీలు, నిక్కర్లు వేసుకొంటూ.. గ్లామర్ రాదన్న సంగతి వర్మలాంటి జీనియస్, అందాల్ని ఆరాధించే దర్శకుడు ఎలా మర్చిపోయాడో....?? ఇక మీదట ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్ర్రాల్లో ఐస్ క్రీమ్ సేల్స్ దారుణంగా పడిపోతే.. అది వర్మ చేసిన పాపమే తప్ప మరోటి కాదు. ఎందుకంటే జనాలు ఇప్పుడు ఐస్ క్రీమ్ పేరు చెబితేనే ఝడుసుకొనే స్థితిలో ఉన్నారు మరి..! వర్మా.. ఇకనైనా ఈ దండయాత్రలు ఆపేయమ్మా.. ప్లీజ్!!