దిల్‌రాజు.. దొరికిపోయాడు
on Nov 22, 2014
సినీ వేడుకల్లో బోలెడన్ని తమాషాలు జరుగుతుంటాయ్. ఈ సినిమా గ్యారెంటీ హిట్టు... అసలు ఇంత అద్భుతమైన సినిమా ఇప్పటి వరకూ రాలేదు, ఇంత కథ ఎప్పుడూ చూళ్లేదు అంటూ ఏవేవో మాట్లాడుతుంటారు. తెరపై బొమ్మ పడ్డాకగానీ, అసలు నిజం బోధపడదు. ఆ వేడుకకు వచ్చిన అతిథుల విషయంలోనూ ఇదే తంతు. ట్రైటర్లు చూస్తుంటే... బాక్సాఫీసుని ఇరగదీసే సినిమాలా కనిపిస్తోంది, రికార్డులు సృష్టిస్తుంది, గల్లా పెట్టె నిండిపోవడం ఖాయం అని గొప్పలు పోతుంటారు. కొంతమందైతే.... ''ఈ దర్శకుడు తీసిన ఫలానా సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు'' అని చెప్తుంటారు. టాలీవుడ్‌లో బడా నిర్మాతగా పేరొందిన దిల్‌రాజు కూడా అదే బాపతు. ఓ ఆడియో ఫంక్షన్‌కి వెళ్తే... ఇలాంటి డైలాగులే చెప్తారు. సరిగ్గా ఇదే సీన్ రిపీట్‌చేస్తూ.. తప్పులో కాలేశాడు దిల్‌రాజు. ''యమలీల 2'' పాటల విజయోత్సవం కార్యక్రమానికి అతిథిగా వెళ్లాడు దిల్‌రాజు. అక్కడ ఏదోటి మాట్లాడాలి కదా...? అందుకే ''యమలీల నాకు భలే బాగా నచ్చింది. అందులో చినుకు చినుకు అందెలతో.. పాటకోసం ఈ సినిమాని పది సార్లు చూశా..'' అనేశాడు. నిజానికి చినుకు చినుకు అందెలతో పాట యమలీలలో లేదు. అది మాయలోడు సినిమా గీతం. యమలీలకీ, మాయలోడుకీ తేడా తెలియకపోతే ఎట్టా..?? అంటూ సభికులంతా నవ్వేసుకొన్నారు. దిల్‌రాజు పక్కనున్నవాళ్లు ఉప్పందిస్తే... మళ్లీ తేరుకొని... ''అమ్మ పాట కోసం ఈ సినిమా 20 సార్లు చూశా'' అని మాట మార్చేశాడు. మొత్తానికి సిల్లీ సిల్లీగా మాట్లాడి కావల్సినంత ఎంటర్‌టైన్ చేశాడు దిల్‌రాజు!!