మహేష్, బన్నీకి ఆ స్టార్‌తో పోటీ తప్పదు!
on Dec 17, 2019
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'దర్బార్'. దాదాపు పాతికేళ్ళ తర్వాత ఆయన పోలీస్ పాత్ర పోషించిన చిత్రమిది. పైగా, దీనికి ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. రజని పక్కన చాలా రోజుల తర్వాత నయనతార కథానాయికగా నటించింది. ప్రస్తుతం తమిళనాట, తెలుగులోనూ ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్ని విశేషాలు ఉన్నప్పటికీ... నిన్నటి వరకు తెలుగులో 'దర్బార్' చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు. సంక్రాంతి బరిలో భారీ చిత్రంగా దీన్ని ఎవరూ పరిగణించలేదు. రజినీకాంత్ గత చిత్రాలు కబాలి, కాలా, పేట అనుకున్న స్థాయిలో విజయాలు సాధించకపోవడంతో 'దర్బార్'ను ఎవరూ పట్టించుకోలేదు.
మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపుములో' సినిమాల మధ్య సంక్రాంతి పోటీ ఉంటుందని భావించారు. ఇదంతా 'దర్బార్' ట్రైలర్ విడుదల అవ్వకముందు లెక్క. దర్బార్ ట్రైలర్ విడుదలైన తర్వాత లెక్కలన్నీ మారాయి. ఒక్కసారిగా రజనీకాంత్ సంక్రాంతి పోటీలో వచ్చాడు. సామాజిక సందేశంతో సినిమాలు తెరకెక్కించే మురుగదాస్... 'దర్బార్'కి వచ్చేసరికి ప్రయోగాల జోలికి వెళ్ళలేదు. పూర్తిగా రజని స్టైల్, మేనరిజమ్స్ మీద దృష్టి పెట్టాడు. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా రజనీ ఎలా చూడాలనుకుంటున్నారో ట్రైలర్లో అలా చూపించాడు. స్టైలిష్ ఫైట్లు, రజినీ పంచ్ డైలాగులు సినిమాకు ఒక్కసారిగా క్రేజ్ తీసుకొచ్చాయి. దాంతో సంక్రాంతి పోటీకి ఈ సినిమా తయారైంది.