గీతాలో మహేష్ సినిమా ఖాయమే
on Dec 17, 2019
గీతాఆర్ట్స్ నిర్మాణ సంస్థలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తప్పకుండా ఒక సినిమా ఉంటుందని నిర్మాత బన్నీ వాస్ తెలిపారు. అయితే... మంచి కథ కుదరాలని ఆయన అన్నారు. కొన్ని రోజుల క్రితం మహేష్, గీతా ఆర్ట్స్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 20న 'ప్రతి రోజు పండగే' విడుదల కానున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ సినిమా గురించి ప్రశ్నించగా... "మహేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు మధ్య మంచి రిలేషన్ ఉంది. సినిమా గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. మంచి కథ కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం" అని బన్నీ వాస్ అన్నారు.
మహేష్ హీరోగా 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా తాము ప్లాన్ చేయలేదని బన్నీ వాస్ స్పష్టం చేశారు. 'గీత గోవిందం' విజయం తర్వాత పెద్ద హీరోలతో పరశురామ్ తో సినిమా చేయాలని ప్రయత్నించామని... ఈ లోపు అక్కినేని నాగచైతన్యతో అవకాశం రావడంతో 14 రీల్స్ ప్లస్ సంస్థలో అతడు సినిమా చేస్తున్నాడని ఆయన అన్నారు. వేరే నిర్మాత ద్వారా మహేష్ దగ్గరకు వెళ్లి పరశురామ్ కథ చెప్పాడట. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ సినిమా అంగీకరించడంతో... పరశురామ్ సినిమా ప్రారంభం కావడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉంది. అందుకనే నాగ చైతన్యతో పరశురామ్ సినిమా ప్రారంభించారు.