అవార్డుల పంట పండించిన `రాజన్న`కి పదేళ్ళు!
on Dec 22, 2021

వైవిధ్యానికి పెద్దపీట వేసే అగ్ర కథానాయకుల్లో కింగ్ నాగార్జున ఒకరు. తమ హోమ్ బేనర్ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఆయన స్వయంగా నిర్మిస్తూ నటించిన అలాంటి ఓ వైవిధ్యభరిత చిత్రమే `రాజన్న`. రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో స్వాతంత్ర్య పోరాట యోధుడు సుద్దాల హన్మంతు జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ పిరియడ్ డ్రామాలో.. `రాజన్న`గా టైటిల్ రోల్ లో నాగ్ నటించగా, అతనికి జోడీగా లచ్చమ్మ పాత్రలో స్నేహ అలరించింది. వారి కూతురు మల్లమ్మగా మరో ప్రధాన పాత్రలో బేబి యానీ ఆకట్టుకుంది. శ్వేతా మీనన్, నాజర్, సమ్మెట గాంధీ, సుప్రీత్, ముకేశ్ రిషి, విజయ కుమార్, అజయ్, ప్రదీప్ రావత్, రవి కాలే, హేమ, తెలంగాణ శకుంతల, అజయ్ ఘోష్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
ప్రముఖ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోసం ఆయన తనయుడు, దర్శకధీరుడు రాజమౌళి పోరాట ఘట్టాలను రూపకల్పన చేయడం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక స్వరవాణి కీరవాణి సంగీతంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ``అమ్మా అవని`` అంటూ సాగే గీతం చార్ట్ బస్టర్ గా నిలిచింది. `ద్వితీయ ఉత్తమ చిత్రం`, `ఉత్తమ బాలనటి`, `ఉత్తమ గుణచిత్ర నటుడు` (సమ్మెట గాంధీ), `ఉత్తమ కళా దర్శకుడు` (ఎస్. రవీందర్), `ఉత్తమ నేపథ్య గాయని` (మాళవిక - అమ్మా అవని), `స్పెషల్ జ్యూరీ` (నాగార్జున).. ఇలా ఆరు విభాగాల్లో `నంది` అవార్డులను సొంతం చేసుకుందీ చిత్రం. 2011 డిసెంబర్ 22న విడుదలై జననీరాజనాలు అందుకున్న `రాజన్న`.. నేటితో పది వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



