ENGLISH | TELUGU  

'నాగ చైతన్య'కు సినిమా చాలా నచ్చింది.. 40నిమిషాలు మాట్లాడారు!

on Nov 24, 2021

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'అనుభవించు రాజా'. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాని నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన రాజ్ తరుణ్.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

* ఈ సినిమా షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశాను. నా సినిమాలు దాదాపు భీమవరంలోనే చేశాను. అక్కడంతా తెలిసిన వాళ్లే ఉన్నారు. ఈ పాత్ర చాలా కొత్తది. ఇంతకు ముందు చేసిన వాటితో పోల్చుకుంటే ఇంకాస్త హైపర్‌గా ఉంటుంది.

* సెక్యూరిటీ గార్డ్ అవ్వాలంటే వెనకాల ఎంతో ప్రాసెస్ ఉంటుందని, సెక్యూరిటీ గార్డ్ అంటే అంత ఈజీ కాదని తెలిసింది. మనం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చూసే ఫస్ట్ మొహం, రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు చూసే చివరి మొహం సెక్యూరిటీ గార్డ్‌దే. వాళ్లు ఒక్క చిరు నవ్వుతో తలుపు తీస్తే మనకు బాగుంటుంది. అదే చిరగ్గా తీశారంటే రోజంతా కూడా మన మూడ్ అలానే అవుతుంది.

*'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' సినిమాకు ఈ సినిమాకు దర్శకుడు చాలా మార్పు చెందారు. అప్పుడు కుర్రాడు. ఇప్పుడు ఎంతో మెచ్యూరిటీ వచ్చింది. పాజిటివిటీ, హానెస్టి ఇలా చాలా వచ్చాయి. పని విషయంలో ఎప్పుడూ క్లారిటీగానే ఉంటాడు. మనిషిగా చాలా మారాడు.

*గత తొమ్మిదేళ్ల నుంచి నాకు శ్రీను ఫ్రెండ్. ఒక్క సినిమా ఆడటానికి, ఆడకపోవడానికి చాలా కారణాలుంటాయి. ఏ ఒక్కరినో నిందించలేం. నాకు శ్రీను బలం, సామర్థ్యం ఏంటో తెలుసు. అస్సలు భయపడలేదు. అన్నపూర్ణ స్టూడియో కాబట్టి.. శ్రీను టాలెంట్ చూపించేందుకు అవకాశం దొరికింది.

*కథ నాకు ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. కానీ అది నాకోసం అని అప్పుడు అనుకోలేదు. ఆ కథను సుప్రియ గారికి, నాగ చైతన్య, నాగార్జున గారికి చెప్పడంతో వారికి నచ్చడం.. తరువాత నా పేరు ప్రాజెక్ట్‌లోకి వచ్చింది. అప్పుడు పూర్తి కథ విన్నాను. మంచి ఫ్యామిలీ డ్రామా. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి రెండున్నర గంటల పాటు ఎంజాయ్ చేసేలా ఉంటుంది.

*భీమవారం స్లాంగ్, అక్కడి పాత్రలు నాకు బాగా సూట్ అవుతాయి. వాటిలో నేను సులభంగా ఇమడగలను. కొత్త పాత్రలు ట్రై చేశాను. కానీ వర్కవుట్ అవ్వలేదు. ఈ చిత్రం భీమవరం, హైద్రాబాద్ నేపథ్యంలో సాగుతుంది.

* హీరోయిన్ కషిష్ ఖాన్ తెలుగు రాకపోయినా కూడా ఎప్పుడూ ప్రాంప్టింగ్‌ తీసుకోలేదు. చాలా కష్టపడింది. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే చెప్పేది. మనిషి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. త్వరగానే ఫ్రెండ్స్ అయిపోయాం. ఫ్యామిలీ ఆడియెన్స్ కలిసి చూసేలానే రొమాన్స్ ఉంటుంది.

*2019 మార్చి 29న షూట్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. కానీ మార్చి 23న లాక్డౌన్ వచ్చింది. అలా కథ, స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉన్నాం. కానీ కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇలాంటి సినిమాను థియేటర్లోనే చూడాలి. అందుకే ఈ చిత్రాన్ని మంచి టైం చూసి విడుదల చేస్తున్నాం. పైగా సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలున్నాయి.

* నాగ చైతన్య గారు ఈ సినిమా చూశారు. ఆయన చూసినప్పుడు నేను అక్కడ లేను. వేరే షూటింగ్‌లో ఉన్నాను. సినిమా చూశాక డైరెక్టర్‌తో నలభై నిమిషాలు మాట్లాడారట. సినిమా చాలా నచ్చిందని అన్నారట.

*సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ఫాదర్ అండ్ సన్, ఊరికి సంబంధించిన ఎమోషన్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. క్లాస్ పీకినట్టుగా మెసేజ్ ఉండదు. కానీ అండర్ లైన్‌గా ఓ మెసేజ్ ఉంటుంది. అమ్మిరాజు పాత్రలో అజయ్ గారు అద్భుతంగా నటించారు.

*మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్‌కు, శ్రీనుకి మంచి బాండింగ్ ఉంది. సినిమా చేయాలని అడిగినప్పుడు.. రెమ్యూనరేషన్ గురించి ఏమీ మాట్లాడలేదు. ఎంతిస్తే అంత ఇవ్వండి.. నేను ఈ సినిమా చేస్తాను అని అన్నారు. అది చాలా గొప్ప విషయం.

*గ్యాంబ్లింగ్ అంటే నాకు నచ్చదు. ఆ ఆటలు నేను ఆడను. కోడి పందెలు చూస్తాను కానీ బెట్టింగ్ పెట్టను. ఈ సినిమా సంక్రాంతి పండుగ నుంచి మొదలవుతుంది. అక్కడి పండుగ వాతావరణాన్ని చూపిస్తాం. కోడి పందెల్లో ఎన్నో  రకాల కోళ్లు ఉంటాయి. నాకు జంతువులంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో వాడిన కోడిని నాకు అలవాటు అయింది. షూటింగ్ లేదని ఆ కోడి దిగాలుగా ఉంటుందట. దానికి కూడా షూటింగ్ అలవాటు అయింది. తినడం లేదంట. (నవ్వులు)

*కెరీర్‌ను ప్లాన్ చేయను. ఏది బాగా నచ్చితే అది చేస్తాను. ఇప్పుడు స్టాండప్ రాహుల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే విడుదల కానుంది. మాస్ మహారాజా ఈ మధ్యే  షూటింగ్ ప్రారంభమైంది. స్టాండప్ రాహుల్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. మాస్ మహారాజా పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుంది. స్లాంగ్ కూడా కొత్తగా ఉంటుంది.

*హైద్రాబాద్ ఎలా రావాలో కూడా తెలీదు. అలాంటిది ఇక్కడకు వచ్చాను. పద్నాలుగు సినిమాలు చేశాను. ఇంకో సినిమా రెడీగా ఉంది. మూడు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇంత కంటే గొప్ప అదృష్టం ఇంకేం కావాలి.

*ఓ వెబ్ సిరీస్ చాన్స్ వచ్చింది. నాకు చాలా నచ్చింది. కానీ రెండు సినిమా షూటింగ్‌లు చేస్తుండటంతో డేట్స్ అడ్జస్ట్ కాలేదు. ఇక్కడ ఓ సినిమా హిట్ కొట్టిన తరువాత వేరే భాషలో ట్రై చేస్తాను.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.