ఏపీలో పేదల కోసం రేషన్ థియేటర్స్!
on Jan 4, 2022

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలను తగ్గించడంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జగన్ సర్కార్ ని తనదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. అన్ని కార్లు ఒకే రేట్ ఉండవు, బ్రాండ్ ని బట్టి రేట్ ఉంటుంది. అన్ని హోటల్స్ లో ఫుడ్ కూడా ఒకే రేట్ ఉండదు. కొన్ని హోటల్స్ లో రూ.50 ఉంటే, స్టార్ హోటల్స్ లో వందలు వేలల్లో ఉంటుంది. మరి అలాంటప్పుడు అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేట్ ఎలా పెడతారు?. రూ.50 లక్షలతో తీసిన సినిమాకి, 200-300 కోట్లు పెట్టి తీసిన సినిమాలకు ఒకే రేట్ అనేది ఎలా? సినిమా చూడటం అనేది ప్రేక్షకుల ఛాయిస్, వాళ్ళకి నచ్చితే టికెట్ కొంటారు, దాని రేట్ ని ప్రభుత్వం కంట్రోల్ చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటూ వర్మ తనదైన శైలిలో వీడియో బైట్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అంతేకాదు తాజాగా ఆర్జీవీ వరుస ట్వీట్స్ తో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతి ట్వీట్ లో గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారు అని సంభోదిస్తూ చురకలు అంటించారు. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని వాటి ధరలను నిర్ణయించవచ్చని నాకు అర్థమైంది. కానీ అది సినిమాలకు ఎలా వర్తిస్తుంది సార్? అంటూ ఆర్జీవీ ప్రశ్నించారు.

పేదలకు సినిమా అనేది నిత్యావసరం అని మీరు భావిస్తే.. చదువు, వైద్యానికి సబ్సిడీ ఇచ్చినట్లు దీనికి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి సబ్సిడీ ఇవ్వొచ్చుగా సార్? ఆర్జీవీ ప్రశ్నించారు. పేదలకు బియ్యం, పంచదార వంటి నిత్యావసరాలు అందించడానికి రేషన్ షాప్ లు ఓపెన్ చేసినట్లుగా.. రేషన్ థియేటర్స్ ఓపెన్ చేయొచ్చు కదా సార్? అని చురకలు అంటించారు.

డ్యూయల్ ప్రైస్ సిస్టమ్ అనే థియరీలో దీనికో సొల్యూషన్ ఉంది. ప్రొడ్యూసర్స్ వాళ్ళు నిర్ణయించిన ధరలకు టికెట్స్ అమ్ముకుంటారు. ప్రభుత్వం వారి నుంచి టికెట్స్ కొని, వాటిని పేదలకి తక్కువ రేట్ కి అమ్మాలి. అప్పుడు ప్రొడ్యూసర్స్ కి డబ్బులు, మీకు ఓట్లు వస్తాయి అంటూ ఆర్జీవీ ఎద్దేవా చేశారు. ఆడమ్ స్మిత్ ఎకనామిక్ ప్రిన్సిపుల్స్ ప్రకారం ప్రైవేట్ బిజినెస్ లో ప్రభుత్వ జోక్యం అనేది ఎప్పటికీ పనిచేయదు అని హితవు పలికారు. మా పరిస్థితిని చేసుకోండి అని చెబుతూనే, మరోవైపు మీకు అధికారం ఇచ్చింది మా నెత్తి మీద ఎక్కి కూర్చోడానికి కాదు అంటూ ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇది నా రిక్వెస్ట్ కాదు డిమాండ్ అంటూ ఈ విషయంపై స్పందించకుండా మౌనంగా ఉంటున్న సినీ ప్రముఖులకు కూడా ఆర్జీవీ చురకలు అంటించారు. టికెట్ ధరల అంశంపై సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ నిర్మొహమాటంగా స్పందించాలి. ఎందుకంటే, ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు..తర్వాత మీ ఖర్మ అంటూ ఆర్జీవీ వ్యాఖ్యానించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



