'బన్నీ' ఫ్యాన్స్ కి షాక్.. జనవరి 7 నుంచే 'పుష్ప' ఓటీటీ స్ట్రీమింగ్!
on Jan 4, 2022

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రైజ్'. డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటిదాకా రూ.155 కోట్లకు పైగా షేర్ రాబట్టిన పుష్ప.. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప మిగతా అన్ని చోట్ల లాభాలను చూసింది. జనవరి 7 న విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్' కూడా వాయిదా పడటంతో సంక్రాంతికి పుష్ప మరింత కలెక్ట్ చేసే అవకాశముందని భావిస్తున్నారంతా. అయితే ఊహించాడని విధంగా జనవరి 7 నుంచే పుష్ప ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
సినిమా 50,100 రోజులు ఆడేరోజులు పోయి.. ఒకట్రెండు వారాల్లో కలెక్షన్స్ కొల్లగొట్టే రోజులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పుష్ప విడుదలైన 20 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా విడుదలకు ముందే అమెజాన్ ప్రైమ్ తో పుష్ప మేకర్స్ భారీ డీల్ కుదుర్చుకున్నారట. ఆ డీల్ ప్రకారం అమెజాన్ ప్రైమ్ లో జనవరి 7 నుండి పుష్ప స్ట్రీమింగ్ కావాల్సి ఉందట. అదే ఇప్పుడు పుష్ప ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది.
'ఆర్ఆర్ఆర్' విడుదల వాయిదాని ఊహించని పుష్ప మేకర్స్.. అమెజాన్ తో జనవరి 7 నుండి పుష్ప స్ట్రీమింగ్ అయ్యేలా డీల్ కుదుర్చుకొని ఉంటారు. అయితే ఇప్పుడు దానివల్ల సంక్రాంతి సీజన్ లో వచ్చే కలెక్షన్స్ కి గండి పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన పుష్ప థాంక్స్ మీట్ లో పుష్ప నిర్మాత నవీన్ యెర్నేని చేసి వ్యాఖ్యలను పరిశీలిస్తే.. జనవరి 6 వరకే పుష్ప టైం అన్నట్లు ఆయన చెప్పారు. జనవరి 6 వరకు పుష్ప 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తుందని, జనవరి 7న ఆర్ఆర్ఆర్ లేకపోతే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తుందని అన్నారు. అప్పటికి ఆర్ఆర్ఆర్ వాయిదా పడలేదు కాబట్టి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఆయన వ్యాఖ్యల వెనక ఈ ఓటీటీ డీల్ కూడా ఉండి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన నేపథ్యంలో ఈ డీల్ లో మార్పు జరుగుతోందో లేక జనవరి 7 నుండే పుష్ప రాజ్ ఓటీటీలో సందడి చేస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



