పూరికి అసలు సిసలైన ఛాలెంజ్ ఇదే..!
on May 25, 2015
చిరంజీవి 150వ సినిమాకి దర్శకుడు కావడం ఎంత లక్కీనో... అంత ఒత్తిడి కూడా ఉంటుంది. ఆ ఒత్తిడిని భరించడం ఇష్టంలేకే.. చాలామంది దర్శకులు చేతులు ఎత్తేశారు. ఆఖరికి మెగాఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన వి.వి.వినాయక్ కూడా తెలివిగా తప్పుకొన్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి ఆ ఛాన్స్ పూరి జగన్నాథ్ దగ్గరొచ్చి ఆగింది. పూరి కూడా ఈ సినిమా చేయాలా, వద్దా? అని తర్జనభర్జన పడి ఉంటాడు. ఎందుకంటే చిరు సినిమా అంటే ఎన్ని ఒత్తిళ్లు తట్టుకోవాలో తనకు బాగా తెలుసు. సినిమా హిట్టయితే సరేసరి. కానీ పోతే... అన్నివేళ్లూ దర్శకుడివైపే మళ్లుతాయి. మెగా స్టార్‌ని హ్యాండిల్ చేయలేకపోయాడు అనేస్తారు. అంతేనా.. తన సినిమా విషయంలో అంగుళం అంగుళం చిరు క్రాస్ చెకింగ్ ఉంటుంది. కథ, సంగీతం, పాత్రధారుల ఎంపిక.. ఇలా అన్ని విభాగాల్లోనూ చిరు ప్రమేయం ఉంటుంది. చిరు అనుభవం ఉన్న నటుడు. పైగా తనకు ఇది ప్రతిష్టాత్మక చిత్రం. కాబట్టి... ఇన్‌వాల్వ్‌మెంట్ తప్పుకాదు. కానీ... పూరిలాంటి అగ్రశ్రేణి దర్శకుడు చిరు అతి ప్రమేయాన్నిఏ విధంగా రిసీవ్ చేసుకొంటాడన్నది ఆసక్తికరం.
అంతేనా..మరోవైపు రామ్‌చరణ్ అజమాయిషీ కూడా తట్టుకోవాలి. తండ్రి సినిమా బాగా రావాలన్న తపనతో తాను తనకు తోచిన సలహాలివ్వడంలో ఏమాత్రం వెనుకంజ వేయడు. చిరు 150వ సినిమాలో నటించాలని, చిన్న పాత్రలో అయినా కనిపించాలని చాలామందికి ఉంటుంది. బన్నీ, చరణ్, వరుణ్‌తేజ్... వీళ్లంతా రికమెండేషన్లతో దిగిపోతారు. పూరి ఎవ్వరినీ కాదనలేడు. మరి వీళ్లందరికీ ఈ సినిమాలో చోటు ఇవ్వడానికి చాలానే కష్టపడాలి. చిరుకి సినిమాల్లో తిరుగులేని ఇమేజ్ ఉండేది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక ఆ ఇమేజ్‌కి విపరీతమైన డామేజీ కలిగింది. దాన్ని పూడ్చేబాధ్యత ఇప్పుడు పూరిపై ఉంది.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని.. 150వ సినిమాని సక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. పూరి ఇప్పటి వరకూ చాలా ఛాలెంజ్‌లు ఫేస్ చేశాడు. కానీ చిరు సినిమానే తన కెరీర్‌లో అతి పెద్ద ఛాలెంజ్. మరి ఇందులో విజయం సాధిస్తే.. మెగా అభిమానులు పూరికి జీవితాంతం రుణపడిపోయుంటారు. పూరి.. ఆల్ ది బెస్ట్.