పహిల్వాన్ మూవీ రివ్యూ
on Sep 13, 2019
చిత్రం : పహిల్వాన్
బ్యానర్: ఆర్.ఆర్.ఆర్. మోషన్ పిక్చర్స్, వారాహి చలనచిత్రం
నటీనటులు: సుదీప్, ఆకాంక్ష సింగ్, సునీల్ శెట్టి, కబీర్ దుహన్ సింగ్ తదితరులు
సంగీతం: అర్జున్ జన్య
కూర్పు: రూబెన్
ఛాయాగ్రహణం: కరుణాకర ఏ.
నిర్మాత: స్వప్న కృష్ణ
రచన, దర్శకత్వం: ఎస్. కృష్ణ
విడుదల తేదీ: 12 సెప్టెంబర్ 2019
'ఈగ'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ హీరో సుదీప్. అంతకు ముందు 'రక్త చరిత్ర'లో చిన్న పాత్ర చేశారు గానీ... పెద్దగా ఎవరూ గుర్తించలేదు. తర్వాత 'బాహుబలి'లో చిన్న పాత్రలో కనిపించారు. త్వరలో విడుదల కానున్న 'సైరా'లోనూ నటించారు. 'కె.జి.యఫ్' ఇచ్చిన ధైర్యంతో సుదీప్ హీరోగా నటించిన 'పహిల్వాన్'ను తెలుగు, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉంది?
కథ:
సర్కార్ (సునీల్ శెట్టి) బ్రహ్మచారి. తన జీవితాన్ని కుస్తీకి అంకితం చేస్తాడు. అనాథ కృష్ణ (సుదీప్) ను చేరదీసి కుస్తీలో శిక్షణ ఇస్తాడు. కన్న కొడుకులా చూసుకుంటాడు. ఏనాటికైనా జాతీయ కుస్తీ పోటీల్లో కృష్ణ విజేతగా నిలిస్తే చూడాలని సర్కార్ కోరిక. కానీ, కృష్ణ ప్రేమలో పడటం, తన మాట కాదని రుక్మిణి (ఆకాంక్ష సింగ్)ను పెళ్లి చేసుకోవడం సర్కార్ కు నచ్చదు. తనకు దూరంగా వెళ్లిపొమ్మని, తాను నేర్పిన కుస్తీని ఎక్కడా ఉపయోగించవద్దని కృష్ణను సర్కార్ కోరతాడు. తండ్రి, గురువు, దైవంగా భావించే సర్కార్ చెప్పినట్టు కృష్ణ చేస్తాడు. మళ్లీ వీళ్లిద్దరూ ఎలా కలిశారు? మల్లయోధుడు కృష్ణ బాక్సింగ్ రింగ్ లోకి ఎందుకు దిగాడు? బాక్సింగ్ ఎందుకు చేశాడు? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
ప్రీ క్లైమాక్స్
చిల్డ్రన్ ఎమోషన్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ, దర్శకత్వం
లవ్ ట్రాక్ & విలన్ ట్రాక్
క్లైమాక్స్
నిడివి ఎక్కువ కావడం
తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు లేకపోవడం
విశ్లేషణ:
'బలం ఉందన్న అహంతో కొట్టేవాడు రౌడీ. బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు' - 'పహిల్వాన్' ట్రైలర్లో వినిపించిన డైలాగ్. సినిమాలోనూ రెండుసార్లు వినిపిస్తుంది. ఈ పాయింట్ చుట్టూ కథ రాశారు. బలమైన కారణం కోసం హీరో కుస్తీ నుండి బాక్సింగ్ లోకి వచ్చాడు. కానీ, అక్కడి వరకూ రావడానికి చేసిన ప్రయాణం ఏమంత బలంగా లేకపోగా, ప్రేక్షకులను విసిగిస్తుంది.
సినిమాలో ఒక్క సన్నివేశం గురించి తప్పకుండా చెప్పాలి. అంతకంటే ముందు 'మగధీర'లో సన్నివేశం గురించి చెప్పాలి. 'మీ శత్రుత్వాన్ని మీకంటే ముందు పకృతి పసిగడుతుంది. మీ ఇద్దరూ ఎదురు పడినప్పుడు పక్షులు మీ నుండి దూరంగా వెళ్లిపోతాయి. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడతాడు. వాడు మనిషిలా కాదు. మండే అగ్నిగోళంలా కనపడతాడు' అని రావు రమేష్ చెప్పడం, తర్వాత రామ్ చరణ్ ఎదురు పడినప్పుడు విలన్ దేవ్ గిల్ కి చుట్టూ రావు రమేష్ చెప్పినట్టు జరగడం సన్నివేశం గుర్తుందా? సేమ్ టు సేమ్... హీరోయిన్ ని హీరో తొలిసారి చూసేటప్పుడు, అంతకు ముందు హీరోకి 'నీకు హనుమంతుడు ఆమె దగ్గరకు దారి చూపిస్తాడు. అగ్ని ముందు నిన్ను తాకుతుంది.. వగైరా వగైరా' అని జోతిష్యుడు చెప్పినట్టు జరగడం చూస్తే, 'మగధీర'లో సన్నివేశం గుర్తొస్తుంది. హీరోయిన్ ప్రేమలో పడటానికి బలమైన కారణం ఏమీ లేదు.
సుదీప్ హీరోయిజం ఎలివేట్ చేసే సన్నివేశాలు, ప్రేమ సన్నివేశాలు పలు తెలుగు సినిమాల్లో చూసేసినవే. లవ్ ట్రాక్, విలన్ ట్రాక్... ఏదీ కొత్తగా లేదు. తెలుగులో శ్రీహరి నటించిన 'భద్రాచలం', హిందీలో సల్మాన్ ఖాన్ చేసిన 'సుల్తాన్' పోలికలు 'పహిల్వాన్'లో కనిపిస్తాయి. ఫస్టాఫ్ లో హీరో ఎలివేషన్, గ్రాండ్ సాంగ్స్ మీద పెట్టిన శ్రద్ధ... కథపై పెట్టలేదు. కన్నడ నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు. కానీ, పెట్టిన ఖర్చు ఏమవుతుందని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే బావుండేది. అసలే ఆకట్టుకునేలా లేదంటే... నిడివి ఎక్కువ కావడం సినిమాను మరో సమస్య.
హీరో ఏ కారణం కోసమైతే బాక్సింగ్ రింగ్ లోకి రావాలని అనుకుంటాడో, ఆ కారణం ప్రశంసించదగ్గది. చిల్డ్రన్ ఎమోషన్, ప్రతిభ ఉన్నా ఆకలి సమస్యలతో పనికి వెళుతూ... పైకి రాలేకపోవడం గురించి వివరిస్తూ తీసిన సన్నివేశాలు, పాట బావున్నాయి. పాత్ర కోసం సుదీప్ కష్టపడ్డాడు. బాగా నటించాడు. హీరోయిన్ రుక్మిణి పాత్రలో తెలుగులో 'మళ్లీ రావా', 'దేవదాస్' సినిమాల్లో నటించిన ఆకాంక్ష సింగ్ పాత్రకు తగ్గట్టు నటించింది. 'కన్నె పిచ్చుక...' పాటలో అందంగా కనిపించింది. సునీల్ శెట్టి వల్ల పాత్రకు హుందాతనం వచ్చింది. కానీ, పాత్ర పరిధి మేరకు అతడికి పెద్దగా నటించే అవకాశం దక్కలేదు. ఇక, విలన్ కబీర్ సింగ్ మినహా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలిసిన నటీనటులు సినిమాలో లేరు.
తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
రొటీన్ కథ, కథనం, కమర్షియల్ విలువలతో రూపొందిన చిత్రమిది. కన్నడలో సుదీప్ స్టార్ హీరో కనుక... అతడి స్టార్ ఇమేజ్ వల్ల కన్నడలో కొన్ని సన్నివేశాలు క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ, తెలుగు ప్రేక్షకులకు అవన్నీ ఓవర్ అనిపిస్తాయి. కొత్తదనం ఏమీ లేని ఈ సినిమాను చూడటం కష్టమే.
రేటింగ్: 1.75/5