విజయ్ సినిమా తెలుగు రైట్స్ మంచి ధరే పలికాయి!
on Sep 13, 2019
రజనీకాంత్ తర్వాత తమిళనాట అత్యంత ప్రజాదరణ కలిగిన స్టార్‌గా పేరుపొందిన విజయ్ నటించిన తాజా చిత్రం 'బిగిల్' తెలుగు హక్కులను యువ నిర్మాత మహేశ్ కోనేరు చేజిక్కించుకున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌పై ఇటీవల కల్యాణ్ రాంతో '118' మూవీ నిర్మించి విజయం సాధించిన మహేశ్ ప్రస్తుతం కీర్తి సురేశ్ టైటిల్ రోల్ చేస్తోన్న 'మిస్ ఇండియా' మూవీని నిర్మిస్తున్నాడు.
కాగా 'బిగిల్' తెలుగు హక్కుల కోసం ఆయన రూ. 9 కోట్లను వెచ్చించినట్లు సమాచారం. విజయ్ సినిమా తెలుగు రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడుపోవడం విశేషంగా చెప్పుకోవాలి. గతంలో విజయ్ సినిమాలకు తెలుగునాట పెద్దగా ఆదరణ ఉండేది కాదు. అయితే 'తుపాకి' సినిమా నుంచి విజయ్‌కు తెలుగునాట కూడా ఆదరణ లభిస్తూ వస్తోంది. దాంతో తమిళ ఒరిజినల్‌తో పాటే తెలుగు వెర్షన్‌ను కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. ఇదివరకు విజయ్ హీరోగా చేసిన 'తెరి' (పోలీసోడు), 'మెర్సాల్', (అదిరింది), 'సర్కార్' సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని కొద్దో గొప్పో ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు 'బిగిల్'తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విజయ్. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో 400 పైగా థియేటర్లలో రిలీజ్ చెయ్యడానికి మహేశ్ కోనేరు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వచ్చే దీపావళికి ఈ సినిమా విడుదలవనున్నది. నయనతార నాయికగా నటించిన ఈ సినిమా ఏ రేంజిలో వసూళ్లను సాధిస్తుందో చూడాలి.